– టాప్ 10 మున్సిపాలిటీల్లో
– హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ రెండో ర్యాంక్
– ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా మూడు ర్యాంకులు
– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ 6వ జాతీయ జల పురస్కారాలు-2024లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పనితీరు ఆధారంగా ‘జల్ సంచరు జన్ భగీదారీ'(జేఎస్ జేబీ) 1.0 అవార్డుల్లో మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసిన ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీజన అవార్డు అందుకున్నారు. అలాగే టాప్ 10 మున్సిపాలిటీల్లో రెండో ర్యాంక్ దక్కించుకున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ అవార్డును ఆ సంస్థ ఎండీ కే.అశోక్ కుమార్ రెడ్డి స్వీకరించారు. అంతేకాక పలు విభాగాల్లో మొత్తం పది అవార్డులను తెలంగాణ రాష్ట్రం దక్కించుకుంది.
సౌత్ జోన్‌లో మూడు కేటగిరిల్లో కలిపి మొత్తం ఎనిమిది అవార్డులు దక్కాయి. కేటగిరి 1 లో 98,693 పనులతో ఆదిలాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 84,827 పనులతో నల్లగొండ, 84,549 పనులతో మంచిర్యాల ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. కేటగిరి 2లో వరంగల్, నిర్మల్, జనగాం లు వరుసగా మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. కేటగిరి 3లో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ లకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను ఆయా జిల్లాల కలెక్టర్లు అందుకున్నారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, నల్లగొండ అడిషనల్ కలెక్టర్ జే శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ పాటిల్, మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేందిర కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా అవార్డులను స్వీకరించారు.
జల సంరక్షణలో హైదరాబాద్‌కు రెండో స్థానం
నీటి సరఫరా, మురుగునీటి బోర్డు మున్సిపల్ కార్పొరేషన్ల విభాగంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ రెండో ర్యాంకు సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఏరియాలో జల సంరక్షణ చర్యలు చేపట్టినందుకు గాను రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.2 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో కేటగిరీ-2లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు దక్షిణ జోన్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచి రూ.కోటి చొప్పున బహుమతి గెలుచుకున్నాయి. అలాగే, కేటగిరీ-3లో భద్రాద్రి కొత్తగూడెం మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. మహబూబ్‌నగర్ మూడో ర్యాంకులో నిలిచింది. ఈ రెండు జిల్లాలకు చెరో రూ.25 లక్షల చొప్పున నగదు బహుమతి లభించింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు నోడల్ అధికారిగా వ్యవహరించిన కేంద్ర జల సంఘానికి చెందిన ఎ.సతీష్‌కు అత్యుత్తమ ప్రతిభ కనుబరిచినందుకుగానూ అవార్డు దక్కింది.
మన రాష్ట్రం దేశానికే ఆదర్శం: మంత్రి సీతక్క
‘జల్ సంచరు జన్ భగీదారీ’ 1.0 కార్యక్రమంలో బెస్ట్ స్టేట్ అవార్డును అందుకున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ విశిష్ట విజయంలో కీలక పాత్ర పోషించిన జిల్లా కలెక్టర్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు అభినందనలు తెలుపుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారుల కృషి, సమన్వయం, నిబద్ధత మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో మరింత గర్వించదగిన స్థాయికి తీసుకెళ్లాయని కొనియాడారు.
జాతీయ జల పురస్కారాల్లో తెలంగాణ నెంబర్ వన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



