నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ భారతదేశపు సీడ్ హబ్ గా మారిందని, దేశ అవసరాల్లో 60% విత్తనాన్ని తెలంగాణ నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1000కు పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని అన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా–ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025 లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సమ్మిట్ భారత్–ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగంలో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయం నకు భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారథిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా (పంటలకు పెట్టుబడి మద్దతు) విధానాన్ని వివరించారు. రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా, రైతు తనకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని, ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు.
అలాగే ఆఫ్రికా విత్తన మార్కెట్ విలువ దాదాపు USD 3.99 బిలియన్ గా ఉందని, భారత్–ఆఫ్రికా భాగస్వామ్యం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, రైతులు, పరిశోధకులు, విత్తన సంస్థలు కలిసి లాభపడవచ్చని అభిప్రాయపడ్డారు. చివరిగా, ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ICFA), ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ (AFSTA) మరియు ఇతర భాగస్వామ్య సంస్థలకు మంత్రి గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుండి, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.