అరవై ఏండ్లుగా ఆమె పాట తెలుగు పిల్లల నాల్కల మీద నర్తిస్తోంది. మొన్నటి తాతలు-అమ్మలు, నిన్నటి తల్లితండ్రులు.. నేటి మనవలు మనవరాళ్ళు ఈ బాల గీతాన్ని తమదిగా పాడుకుంటున్నారు. అయితే నిన్నమొన్నటి వరకు ఈ గీతం ప్రచారం పొందినంతగా గీత రచయిత్రి గురించి తెలియకపోవడానికి అనేక కారణాలుండొచ్చు. పైడిమర్రి రాసిన ‘ప్రతిజ్ఞ’ గురించి మనకు తెలిసిందే కదా! మూడు తరాల పిల్లలు పాడుకున్న ఈ పాట ఇవ్వాళ్ళ తెలుగుల వారసత్వ సంపద.. ఎల్లలు దాటి తెలుగు పిల్లలందరికీ చేరిన వెలుగుల చిచ్చుబుడ్డి.. ఆ బాల గేయం ‘చిట్టి చిలకమ్మ ‘… దీనిని రాసింది శ్రీమతి బల్ల సరస్వతి.
నేటి జనగామా జిల్లా బచ్చన్న పేట మండలం కట్కూర్ గ్రామంలో 4 ఏప్రిల్, 1944న పుట్టారు బల్ల సరస్వతి. పాటను, పద్యాన్ని, చక్కని కంఠాన్ని సరస్వతమ్మకు వారసత్వంగా ఇచ్చింది తల్లి శ్రీమతి పాశికంటి లక్ష్మమ్మ. చదవాలి, ఎదగాలని స్ఫూర్తినిచ్చింది తండ్రి పాశికంటి రామదాసు. కుటుంబ వారసత్వం చేనేత వృత్తి అయినా తండ్రి తాపీ మేస్త్రీగా పనిచేశారు. మెట్టినింట్లో భర్త బల్ల సోమయ్య కుటుంబానిది చేనేత వృత్తి. సరస్వతి ఏడవ తరగతి చదివి, టీచర్ ట్రైనింగ్ పూర్తిచేశారు. మూడున్నర దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయినిగా పని చేశారు. ఉద్యోగం చేస్తూనే ఎస్.ఎస్సీ., బి.ఎడ్‌లు చదివారు. బాల్యం నుండి అమ్మ పాడిన పాటలు, రామదాసు కీర్తనలు, పద్యాలతో పాటు ”చిన్న చెంబులోన శీకాయ ఉదకంబు/ అల్లంబు బెల్లంబు అరటిపండు/ తేనెలో మాగిన తియ్య మామిడిపండు/ అమ్మరో నాకింత బువ్వ పెట్టు…’ వంటివి వీరికి గేయంపట్ల ఆసక్తిని, ఆకర్షణను కలిగిచాయి.
1962లో ఉమ్మడి మెదక్‌లోని నర్సంపేట తాలూకా గురజాల హామ్లెట్‌లోని గుంటూరుపల్లిలో సింగిల్ స్కూల్ టీచర్‌గా తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించిన సరస్వతి అక్కడి పిల్లల కోసం వందలాది పాటలు రాశారు. అందరు తెలంగాణ కవుల్లాగే వీరు కూడా వాటిని రికార్డు చేసుకోలేదు. కవిత్వం, గేయాలు రాసి, వచన రచనలు చేసిన వీరు రెండు పుస్తకాలను ప్రచురించారు. మొదటి పుస్తకం ‘శిశిరధ్వని’ కవితా సంపుటి. తన ఒక కవితలో పుస్తకం గురించి రాస్తూ ”లాలలు పోసి జోలలు పాడిన అమ్మలా/ జీవనది లాంటి నాన్నలా అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది” పుస్తకం అంటారు. మరోచోట విశ్రాంత ఉపాధ్యాయుడిని గురించి రాస్తూ…. ”.. ధీర గంభీర జలనిధివి” అని చెబుతారు. తెలంగాణ గురించి ”ఒట్టు పెట్టి చెబుతున్న ఒస్తది తెలంగాణ” అంటూ గట్టిగా చెప్పి బల్ల సరస్వతి రెండవ పుస్తకం తన పుట్టినిల్లు, మెట్టినింటి ఏడుతరాల కథ ‘కలనేత’ ఉద్గ్రంధం. ఈ కలనేత పడుగుపేకల చేనేత జీవితాలను తమ కుటుంబాల నేపథ్యంగా అద్భుతంగా వర్ణించిన గ్రంథం. ఇది రచయిత్రిగా వీరికి విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టింది. తన బడి పిల్లలకు పాఠాలు అర్థమయ్యేలా బోధించేందుకు తనకు తానుగా రూపొందించుకున్న పద్ధతి ‘పాట’లతో పాఠాలు బోధించడం. పిల్లలకు వివిధ విషయాలను బోధించేందుకు కథలను కూడా చెప్పేవారు. ఈమె గుంటూరుపల్లిలో ఉంటున్నప్పుడు తన బడి పిల్లల కోసం అలవోకగా వ్రాసిన గేయం- ”చిట్టీ చిలకమ్మ/ చిన్నీ చిలకమ్మా/ అమ్మ కొట్టిందా/ తోట్లో కెళ్ళావా/ పండు తెచ్చావా/ పాపాయి కిచ్చావా/ గూట్లో పెట్టావా/ గుటుక్కు మింగావా”. ఈ గేయం పాడి వినిపించాక పిల్లల సంతోషానికి పట్టపగ్గాలు లేవంటారు కవయిత్రి. తన పిల్లల సంతోషం కోసం పాడిన ఈ గేయం ఆనోటా ఈనోటా ఇంటింటికి పాకింది. తాను చేసిన ప్రయాణాలను తన బడిపిల్లలకు కథలుగా, నాటికలుగా చెప్పి పరిచయం చేయడమనే విద్య ఈ అమ్మకు బాగా తెలుసు. తాను తిరుపతికి వెళ్ళిన ముచ్చట తన పిల్లలకు నాటిక-సంభాషణ రూపంగా అర్థమయ్యేలా చెప్పిన దాన్ని ఇప్పటికీ యాది చేసుకుంటారు. ఇంకా పాటలతో పాటు పనుల ద్వారా, ఆటల ద్వారా, పక్షులు, చెట్లు వంటి ప్రకృతిలోని విషయాల ద్వారా తాను పాఠాలను చెప్పానంటారు సరస్వతమ్మ. ఇవేకాదట తాను బోధించిన సాంఘిక శాస్త్రం పాఠాలను, గణితపు లెక్కలను కూడా గేయాలుగా బోధించడం చేశారీ టీచరమ్మ.
తల్లి నుండి పాటను వారసత్వంగా తెచ్చుకున్న సరస్వతమ్మ అచ్చంగా పాటల పుట్ట. కుటుంబ ఉత్సవాలు మొదలుకుని అనేక సమయ సందర్భాలకు అనేక గేయాలను రాసి పాడేవారు. వాటిని పుస్తకంగా తెస్తే మరో అద్భుతం ఆవిష్కృతం కాక మానదు. దొరుకుతున్న వీరి బాల గేయాల్లో బంగారు తునకలాంటి గీతాలను చూద్దాం… ‘ఒకటి.. రెండు… మూడు’తో పాటు, ‘చిట్టి చిట్టి మిరియాలు’ మొదలైనవి వాటిలో ఉన్నాయి. ”ఒకటి ఒకటి ఒకటి/ మానవులంతా ఒకటి/ రెండు రెండు రెండు/ మనకు కళ్ళు రెండు/ మూడు మూడు మూడు/ శివుడికి కళ్ళు మూడు/ నాలుగు నాలుగు నాలుగు/ ఆవుకు కాళ్ళు నాలుగు/ ఐదు ఐదు ఐదు/ చేతికి వేళ్ళు ఐదు/ ఐదు ఐదు ఐదు/ అన్నీ కలిస్తే పది” వీరు పిల్లల కోసం రాసిన మరో మంచి గీతాల్లో ఒకటి. బాల గేయకారిణిగా బల్ల సరస్వతమ్మకు మిక్కిలి ఖ్యాతి తెచ్చిన గీతాల్లో మరొకటి… మనందరికి బాగా తెలిసింది… ‘చిట్టి చిట్టి మిరియాలు/ చెట్టు కింద పోసి/ బొమ్మరిల్లు కట్టి/ అల్లవారింటికి చల్లకు వోతె/ అల్లవారి కుక్క బౌబౌ మనెను/ నా కాళ్ళ గజ్జెలు గల్లు మనెను….” గీతం. తన మాటల్లోనే చెప్పాలంటే తాను ప్రతి పాఠానికి, ప్రతి సందర్భానికి ఒక గేయం రాసింది సరస్వతమ్మ. త్వరలో బల్ల సరస్వతమ్మ తన బాలగీతాలన్నింటిని ఒకచోట చేర్చి తేవాలని కోరుకుందాం. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్
9966229548