– నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి : న్యూమిస్ మ్యాటిక్స్ జాతీయ సెమినార్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
న్యూ మిస్ మ్యాటిక్స్ (నాణేల అధ్యయనం), వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఏర్పాటుచేసిన దక్షిణ భారతదేశ నాణేలు, ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంస్థల మధ్య సహకారం పెరగాలనీ, యువ పరిశోధకులు అంతర శాస్త్రీయ అధ్యయనాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. న్యూ మిస్ మ్యాటిక్స్ వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందంజలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. వారసత్వ ఆధారిత పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్‌గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని వివరించారు. దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపరకు ప్రసిద్ధి గాంచిందని చెప్పారు. సామ్రాజ్యాలు ఉదయించడం, ఆస్తమించడం చూసిన ఈ శాఖకు ఇది నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి అని చెప్పారు. ఈ సదస్సు తెలంగాణకే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకూ గర్వకారణమని అన్నారు. ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, లోహశాస్త్రం, చరిత్ర అన్ని కలిసే ఈ అద్భుత రంగాన్ని ఎంచుకున్నందుకు పరిశోధకులు, విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ డైరెక్టర్ అర్జునరావు, న్యూ మిస్ మ్యాటిక్స్ ఇండియా సొసైటీ చైర్మెన్ డి రాజారెడ్డి, న్యూ మిస్ మ్యాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీలు పిఎన్ సింగ్, బింద దత్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందా ఎన్ ఎర్లీ హిస్టారిక్ సైట్ ఇన్ తెలంగాణ, ఆర్ట్, ఆర్కిటెక్చర్, ఐకోనోగ్రఫీ ఇతర పుస్తకాలను వేదికపై ఉన్న ప్రముఖులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



