– రూ.10 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నైవేలీ కార్పొరేషన్ సిద్ధం
– రాష్ట్ర ప్రభుత్వం భూమి చూపెట్టాలి
– పొలాల్లో సోలార్ పంప్ సెట్ల ఏర్పాటు కోసమే పీఎం కుసుం పథకం : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు నైవేలీ కార్పొరేషన్ లిమిటెడ్ సిద్ధంగా ఉందనీ, భూములు కేటాయించాలని రాష్ట్ర సర్కారుకు లేఖ రాసినా ఇప్పటి వరకూ ముందుకు రాలేదని చెప్పారు. వెంటనే భూములను కేటాయించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నదనీ, 500 గిగావాట్ల ఉత్పత్తిలో 74 శాతం థర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుదుత్పత్తి జరుగుతున్నదని తెలిపారు. దేశంలో 22 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు కంపెనీలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద నిల్వ ఉందని వివరించారు. రైతుల పొలాల్లో సోలార్ పంప్ సెట్లు పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుం పథకం తీసుకొచ్చిందనీ, తద్వారా రైతులే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు. గృహ అవసరాల కోసం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా సౌర విద్యుత్ అందించే కార్యక్రమం ద్వారా నిర్దేశించిన సమయం కన్నా ముందే లక్ష్యాలను చేరుకున్నామని చెప్పారు. ఇండ్లపై ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసుకుని విక్రయించుకునే వీలుందన్నారు. తెలంగాణకు 450 మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల డీసెంట్రలైజ్డ్ పవర్ గ్రిడ్‌కు కేంద్రం అనుమతిచ్చిందన్నారు. 40 వేల సోలార్ రూఫ్ టాప్ యూనిట్లను కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి హామీనిచ్చారనీ, అందులో 20 వేల యూనిట్లను మొదటి విడతలో ఇన్ స్టాల్ చేస్తామని వివరించారని తెలిపారు. ఎన్టీపీసీలో రెండో విడతలో భాగంగా 3,800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు మొదలయ్యాయనీ, అందులో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం తెలంగాణకే కేటాయిం చామనీ, అయితే, రాష్ట్ర సర్కారు మూడో వంతు మాత్రమే కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిందని చెప్పారు. ఎన్టీపీసీ ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్ ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పవర్ డిస్కంలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయనీ, కేసీఆర్ హయాంలో వాటిని అప్పుల ఊబిలోకి నెట్టేయగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తున్నదని విమర్శించారు. రూ.30 వేల కోట్ల మేర బకాయిలు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. గత మార్చిలో 17100 మెగావాట్ల డిమాండ్ రాష్ట్రంలో వచ్చిందనీ, ఆ మేరకు సరఫరా చేసేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి రూ.42 వేల కోట్ల బకాయిలు పడిందనీ, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకే ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవిని కాంగ్రెస్ సర్కారు కట్టబెట్టిందని విమర్శించారు.
ఎన్టీపీసీ విద్యుత్‌ను తెలంగాణే కొనాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



