Sunday, July 20, 2025
E-PAPER
Homeసందర్భంతెలంగాణ వీణాధ్వని దాశరథి

తెలంగాణ వీణాధ్వని దాశరథి

- Advertisement -

”నేనురా తెలగాణ నిగళాలు తెగదొబ్బి
నాకాశమంత యెత్తరచినాను
నేను రాక్షసిగుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను”

అంటూ నిజాం ఉక్కుపిడికిలిలో బందీయైన తెలంగాణ తల్లికి తన కవిత్వంతో విముక్తి గీతం పాడిన మహాకవి దాశరథి కష్ణమాచార్య. ఉమ్మడి వరంగల్‌ జిల్లా చినగూడురు గ్రామంలో 1925 జులై 22న వేంకటాచార్యులు, వేంకటమ్మ దంపతులకు జన్మించిన దాశరథి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి కలాన్నే బలంగా ప్రయోగించిన ధీరకవి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ ఇంగ్లీష్‌ సాహిత్యం చదువుకున్న దాశరథి తెలుగు, సంస్కతం, ఆంగ్లం, తమిళం, ఉర్దూ, పారశీ, మరాఠీ, ద్రవిడం, మలయాళం భాషల్లో పండితుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం.. వంటి 40కి పైగా పుస్తకాలు రాశాడు.

పద్యాన్ని అత్యంత పదునైన ఆయుధంగా వాడిన కవి ఆయన. పదేళ్ల వయస్సులోనే కలం పట్టి అరాచక పాలనను ఎదిరిస్తూ కవితనారంభించాడు. చైతన్యఝరిలా పరుగులెత్తించే పదబంధాలు ఆయనవి. అవి ఆనాటి నుండి ఈనాటి వరకూ ఆ వాడిదనాన్ని, వేడిదనాన్ని కోల్పోలేవు. అన్యాయం కనిపిస్తే చీల్చి చెండాడుతూనే ఉన్నాయి.
‘అనాదిగా సాగుతుంది అనంత సంగ్రామం/ అనాధుడికి ఆగర్భ శ్రీనాథుడికీ మధ్య’
అంటూ సామాన్య మానవుని పక్షాన నిలబడి మానవకళ్యాణాన్ని సాధించిన మహనీయమైన కవితాశక్తి ఆయనది. గంభీరమైన కంఠస్వరంతో ఉద్యమాలను నడిపించినవాడు. మధురమైన శబ్దభావ బంధాలతో కవితలల్లి పాఠకుల హదయాలను రంజింపజేసినవాడు దాశరథి. అసలు తెలంగాణను సాహిత్యంలో పెట్టిన మొట్టమొదటి కవి ఆయనే. రైతుదే తెలంగాణం అని గర్జించి, అరాచకపాలన పాలిట ధ్వజమెత్తిన కవి ఆయన.
నిరంతరం మనోఘర్షణలతో, కులమత విద్వేషాలతో, ధనిక పేదవర్గాల సమస్యలతో అల్లాడి, పరప్రభుత్వం నీడలో దుర్భరమైన జీవితాల్ని గడిపిన ప్రజలను తన కవితా వస్తువులుగా స్వీకరించాడు దాశరథి.

‘ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి/ ఉగ్రవాద నగనాద రుగబాధ తొలగాలి/ శాంతివేద సౌమ్యవాద కాంతిరేఖ వెలగాలి’ అంటూ దేశం శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలనే కాంక్ష దాశరథి కవిత్వంలోనే కాదు ఆయన ప్రతిమాటలోను ఒక గేయమై వినిపిస్తుంది.
”జగత్తులో నేడు సగం/ దగాపడుట మానుకొంది/ పేదజనం నేడు మొగం/ తుడుచుకోని మేలుకొంది” అంటూ తెలంగాణ బానిస సంకెళ్ల నుండి విముక్తిపొందిన వేళ పొంగిపోయాడు. నిలువెత్తు పద్యమై సాగిపోయాడు. స్వేచ్ఛా ప్రయాణానికి మారు పేరే తెలంగాణమంటూ మంగళగీతి పాడాడు. తన మాతభూమియైన తెలంగాణకు తన ‘రుద్రవీణ’ కావ్యాన్ని అంకితం చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకున్నాడు.
”ననుగనిపెంచినట్టి కరుణామయి నా తెలగాణ! నీ గహాం/ గణ వనసీమలో బరుసు కంపలు నాటిన మా నిజాము రా/ జును పడిదోసినట్టి రణశూరుల వెచ్చని నెత్రుచుక్కలే/ మణికత దీపమాలికల మాదిరి నీకు వెలుంగు లిచ్చెడిన్‌”

పై పద్యం వల్ల దాశరథికి మాతభూమిపై గల భక్తి ప్రస్ఫుటమవుతుంది. ఇది తెలంగాణకు దాశరథి పట్టిన పద్యాల హారతి..
ఇలాంటి రసిక జనైకవేద్యమైన పద్యాలు, గేయాలు దాశరథి కవిత్వంలో మణిరాశులుగా మెరుస్తాయి.
సామాజిక స్పందనను, మానవతా దక్పథాన్ని కలిగి ఉండాలనే భావనను ప్రజలలో కల్గించే ప్రయత్నం చేస్తున్న తీరు కూడా ఆయన కవితల్లో కనిపిస్తుంది. కక్షలతో కాకుండా ప్రతి మనిషి కరుణతో ఎదుటివాన్ని జయించాలి. కారుణ్యం చిలికే హదయంతో పోటీపడే దుర్మార్గుడు కూడా సన్మార్గుడైపోతాడు అని చెప్తున్నాడు దాశరథి ఈ గేయం ద్వారా..
”కత్తిపట్తి గెలిచినట్టి/ ఘనుడగు వీరుండెవ్వడు?/ మెత్తని హదయం దాడికి/ తుత్తునియలు కానిదెవడు?”
కరకురాతి గుండెగల వాన్ని కూడా కరిగించగల కవితాచైతన్యం దాశరథి సొంతం. అక్షర తూణీరాలను ధరించి, అశాంతిపై యుద్ధానికి సిద్ధమైన ఆయన శాంతియై కదిలే పరమహంస.
పద్యం, గేయమే కాదు వచనకవిత, గజల్‌, రుబాయి, సినిమాపాట, నవల, వ్యాసం, కథ, విమర్శ ఇలా అన్ని ప్రక్రియల్లో రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యంలో తనదైన ముద్రను పదిలపరిచాడు. అంగారం,శృంగారం రంగరించి తెలుగుతల్లి మెడలో పూలదండగా సింగారించాడు.
”కోటి తెలుగుల బంగారుకొండ క్రింద/ పరచుకొన్నట్టి సరసులోపల వసించి/ ప్రొద్దు ప్రొద్దున అందాలపూలుపూయు/ నా తెలంగాణ తల్లి కంజాతవల్లి”.
కంజాతం అంటే పద్మం. సూర్యుడు ఉదయించినపుడే పద్మం వికసిస్తుంది. ఇక్కడ స్వేచ్ఛాభానుడు ఉదయించాడు కనుకనే తెలంగాణ అనే పద్మం వికసించిందని చమత్కరించాడు దాశరథి.

ఆయన దాదాపు నలభై కవితా సంపుటాలు రాశాడు. అన్నీ ఉత్తుంగశిఖరాలే.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినవే..
చారిత్రక భౌతికవాదాన్ని చాటిచెప్పే పద్ధతి దాశరథి కవిత్వంలో అణువణువున కనిపిస్తుంది. కమ్యూనిజం వంటి భావాలతో తన ఇమేజిజాన్ని చాటి చెప్పిన దాశరథి కారల్‌మార్క్స్‌లో గల ఉత్ప్రేరితమైన ఉప్పెనలాంటి భావాలు తనలో జీర్ణించుకున్నవాడు.
‘నిజం తెలిసి భుజం కలిపి నిండు మదిని సాగాలి’ అంటూ నిర్మలమైన మనస్సుతో సాగిపోతూ తనతోటి వారిని కూడా కదలిసాగమన్నాడు.
దాశరథి కవిత్వంలో జాతీయోద్యమ భావాలు త్రివర్ణపతాకాలై రెపరెపలాడుతాయి. ఒక్కొక్క భావం ఒక్కో హిమాలయాన్ని అధిరోహిస్తుంది. మహాత్మాగాంధీ, జవహార్‌ లాల్‌ నెహ్రూ వంటి జాతీయోద్యమ నాయకులను పలుమార్లు కలిసి దేశభక్తిని వారి ప్రసంగాలు విని దేశభక్తిని నరనరాల్లో జీర్ణించుకుని భారతీయతను చాటాడు.
‘హిమశైల కిరీటమై సముద్ర పాదపీఠమై/ గంగ యమున గోదావరి కష్ణవేణి సహితమై/ విలసిల్లే మన తల్లి భరతమాతకు జోహార్‌!’ అంటూ హిమాలయమే కిరీటంగా, సముద్రమే పాదపీఠంగా, గంగ, యమున, గోదావరి, కష్ణవేణి వంటి జీవనదులతో, సస్యశ్యామలంగా అలరారే మన భారతమాతకు గౌరవపూర్వకంగా వందనం చేస్తున్న జాతీయకవి దాశరథి.

శాంతిమాతను స్వాగతిస్తూ దాశరథి వినిపించిన శాంతిగీతి కాంతిని అంతటా ప్రసరింపజేస్తుంది. దాశరథి శాంతిని ”రావమ్మా శాంతమ్మా” అని పిలుస్తూ..
‘ఉగాదివై/ నా ఆశల పునాదివై/ సమరానికి సమాధివై/ నరహంతల విరోధివై/ జగాలలో ఆవరించు/ రణాల తలలుత్తరించు/ నా మనవిని చిత్తగించు’ అంటూ స్వాగతగీతిక ఆలపిస్తాడు. ఇక్కడ శాంతిని ఉగాదిలా రమ్మనడం నూతనోత్తేజితమైన భావనగా స్ఫురిస్తుంది. ఇలాంటి భావాలు రతనాలుగా తెలుగు క్షేత్రంలో పండించాడు దాశరథి.
కోటి రతనాలవీణగా తెలంగాణను మీటిన దాశరథి ‘నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి’ అని చివరిదాకా ప్రజాక్షేమాన్ని కోరినవాడు. ప్రజల సౌభాగ్యాన్ని కాంక్షించి కవిత్వాన్ని రాసినవాడు. జాతికి గీతిక పాడి, జాతిలో చైతన్యాన్ని రగిలించి, దేశభవిష్యత్తు మంగళదీపమై వెలగాలని ఆశించి, సాధించిన అభ్యుదయ కవిచక్రవర్తి దాశరథి. నిత్యచైతన్య కవితానిధిగా నిలిచిన ఆ మహాకవి కీర్తిశేషుడైనప్పటికీ తన కవిత్వంతో కీర్తివిశేషుడైనాడు.

సినీకవిగా దాశరథి స్థానం పదిలం. 1961లో ‘వాగ్దానం’ సినిమాలోని ”నా కంటిపాపలో నిలిచిపోరా నీవెంట లోకాల గెలువనీరా” అనే పాటతో సినీగీత రచయితగా ప్రస్థానం మొదలుపెట్టాడు. ‘ఇద్దరుమిత్రులు’ సినిమాలోని ”ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనులదానా” వంటి ప్రణయగీతాలు, ‘ఒకే కుటుంబం’ సినిమాలో రాసిన ”మంచిని మరచీ వంచన నేర్చీ నరుడే ఈనాడు వానరుడైనాడూ” వంటి ప్రబోధగీతాలు, ‘రంగులరాట్నం’ సినిమాలోని ”నడిరేయి యే జామునో స్వామి నినుజేర దిగివచ్చునో” వంటి భక్తిగీతాలు, ‘రాము’ సినిమాలోని ”మంటలు రేపే నెలరాజా! ఈ తుంటరితనము నీకేలా’, ‘మూగ మనసులు’ సినిమాలోని ”గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది” వంటి జానపదగీతాలు.. ఇలా దాదాపు 2000కి పైగా సినిమాపాటలు రాసి వెండితెరపై తన ముద్రను పదిలపరుచుకున్నాడు. రాష్ట్ర, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు, వివిధ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ఆస్థానకవిగా కొంతకాలం పనిచేశాడు. కవిగా, సినీగీత రచయితగా, బహుముఖ ప్రతిభావంతుడిగా పేరెన్నికగన్నాడు దాశరథి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
(జులై 22న మహాకవి దాశరథి శతజయంతి)
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
6309873682

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -