– టెక్నాలజీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అమెరికాకు ఆదర్శం
– అమెరికా విద్యుత్ నిపుణుల బృందం : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ జి.చిన్నారెడ్డితో భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో అమలవుతున్న విద్యుత్ విధానాలు, టెక్నాలజీ, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, నిపుణులైన విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది పని తీరు అమెరికాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అమెరికా దేశ ప్రముఖ విద్యుత్ రంగ నిపుణులు ఎడ్‌స్కాట్, మైక్ హెండార్సన్, కాన్ స్టసిరెన్, బడ్ ఏరూక, వంగూర్ అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. మంగళవారం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజా భవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో అమెరికా విద్యుత్ నిపుణుల బృందం భేటీ అయ్యింది. తెలంగాణలో అమలవుతున్న విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, సిబ్బంది నైపుణ్యం గురించి తెలుసుకుని అమెరికా బృందం మెచ్చుకుంది. ఇక్కడి విద్యుత్ పద్ధతులను అమెరికాలో అమలు చేసేందుకు తమ దేశ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి అమెరికా నూతన టెక్నాలేజీని అందజేస్తామని హామీనిచ్చారు. అమెరికాలోని విద్యుత్ అంశాలపై ఆ బృందాన్ని అడిగి చిన్నారెడ్డి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారెడ్డి నేతృత్వంలో అమెరికా బృంద సభ్యులు ఎస్పీడీసీఎల్ సీఎండీ ముసారఫ్ అలీతో సమావేశమయ్యారు.