నవతెలంగాణ-హైదరాబాద్: టెలివిజన్ న్యూస్ ఛానళ్లకు సంబంధించిన టెలివిజన్ రేటింగ్ పాయింట్స్(టీఆర్పీ)ను తెలియజేసే నివేదికలను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ప్రేక్షకాదరణను అంచనా వేసే సంస్థ(బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(BARC))కు కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాలపాటు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకూ టీఆర్పీ ప్రక్రియను నిలిపివేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
కాగా.. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇటీవల కొన్ని టీవీ న్యూస్ ఛానళ్లు అనవసర సంచలానత్మక, ఊహాజనితమైన కథనాలు వెలువరించడాన్ని కేంద్రం గమనించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజల్లో అనవసర ఆందోళనలు, అపోహలు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కథనాల వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.



