Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం317 జీవో బాధిత ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం

317 జీవో బాధిత ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం

- Advertisement -

2 లేదా 3 ఏండ్ల వరకు డిప్యూటేషన్లకు అవకాశం
స్థానిక క్యాడర్‌లో ఎలాంటి మార్పు లేదు
ఉత్తర్వులు విడుదల


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. డిప్యూటేషన్లకు అవకాశమిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె రామకృష్ణారావు ఉత్తర్వులు (జీవోనెంబర్‌ 190) మంగళవారం విడుదల చేశారు. ఖాళీల లభ్యతను బట్టి జిల్లాల అధికారులు డిప్యూటేషన్లు కేటాయిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోపై అధ్యయనం కోసం 2022, ఏప్రిల్‌ నాలుగో తేదీన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిందని తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖ విభాగాధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశాలను నిర్వహించిందని పేర్కొన్నారు.

వారి అభ్యర్థనలు, ఫిర్యాదులను పరిశీలించి గతేడాది అక్టోబర్‌ 20వ తేదీన ప్రభుత్వానికి నివేదికను సమర్పించిందని వివరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల కష్టాల కారణంగా తాత్కాలికంగా బదిలీ లేదా డిప్యూటేషన్‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కానీ స్థానిక క్యాడర్‌లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ రకమైన బదిలీలు రెండు లేదా మూడేండ్లపాటు మాత్రమే ఉంటాయని వివరించారు. అవసరమైతే విభాగాల్లో రొటేషన్‌ ద్వారా మరింత మంది అర్హులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వొచ్చని సూచించారు. ప్రభుత్వ సిఫారసులకు అనుగుణంగా మొదట రెండేండ్లపాటు అవసరమైతే మరో ఏడాది పొడిగించొచ్చని కోరారు. పదవీకాలం ముగిసిన తర్వాత తప్పనిసరిగా మాతృక్యాడర్‌కు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. శిక్షా చర్యలు ఎదుర్కొంటున్న వారు అర్హులు కాదని తెలిపారు. టీఏ, డీఏ హక్కు ఉండబోదని స్పష్టం చేశారు.

ఆర్థికశాఖ అనుమతి అవసరమని పేర్కొన్నారు. ఒకసారి డిప్యూటేషన్‌ పొందిన ఉద్యోగికి మళ్లీ అర్హత ఉండబోదని వివరించారు. ఈ సౌకర్యం కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్న ప్రదేశం లేదా బదిలీ అయిన ఉద్యోగులకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. 317 జీవో బాధితులుగా ఉండి ఇప్పటి వరకు 21 జీవో, 243, 244, 245 జీవోల ద్వారా ప్రయోజనం పొందని వారికే వర్తిస్తుందని వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలో స్పౌజ్‌ (భార్యాభర్తలు), మ్యూచువల్‌ (పరస్పర), హెల్త్‌ (ఆరోగ్యం) కారణాలున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానికత కోల్పోయిన 317 జీవో బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డిప్యూటేషన్‌కు అర్హతలు
– 2021, జనవరి ఆరో తేదీన ఏ క్యాడర్‌లో ఉన్నారో ఆ ప్రాంతం, క్యాడర్‌లోనే పనిచేయాలి
– పరస్పర, స్పౌజ్‌, హెల్త్‌ కారణాలతో బదిలీ అయిన వారు అనర్హులు
– 317 జీవోలో మొదటి ఆప్షన్‌ ఇచ్చిన జిల్లాకు కేటాయించిన వారూ అనర్హులు
– 317 జీవో తర్వాత పదోన్నతి పొందిన వారికి వర్తించదు

ప్రభుత్వానికి ధన్యవాదాలు : ఉద్యోగ జేఏసీ
తెలంగాణ ఉద్యోగ జేఏసీ నిరంతర పోరాటం వల్ల మరో విజయాన్ని సాధించామని ఆ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 317 జీవో బాధితులకు డిప్యూటేషన్‌, బదిలీ కోసం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రివర్గ ఉపసంఘం చైర్మెన్‌ దామోదర రాజనర్సింహ, ఇతర మంత్రులు, సీఎస్‌ రామకృష్ణారావు, జీఏడీ ముఖ్యకార్యదర్శి మహేష్‌దత్‌ ఎక్కాకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రకటించారు.

నిబంధనలు సవరించాలి : టిగారియా
317 జీవో బాధితుల కోసం ప్రభుత్వం ఇస్తున్న బదిలీ లేదా డిప్యూటేషన్‌ తాత్కాలిక ప్రయోజనం మాత్రమేనని టిగారియా రాష్ట్ర బాధ్యులు మధుసూదన్‌, కె జనార్ధన్‌, ఎస్‌ గణేష్‌, బిక్షం యాదవ్‌ తెలిపారు. ఇది సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఈ డిప్యూటేషన్‌ విధానం ఎప్పటికైనా ఉద్యోగి మెడ మీద కత్తిలాంటిదేనని తెలిపారు. సర్వీస్‌ మొత్తంలో ఒకేసారి అనే నిబంధనను తొలగించాలని కోరారు.

ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్న అధికారులు : ఆర్‌యూపీపీటీఎస్‌
317 జీవో బాధితుల సమస్య పరిష్కారం విషయంలో ప్రభుత్వాన్ని సచివాలయ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్‌యూపీపీటీఎస్‌ అధ్యక్షులు శానమోని నర్సిములు ఆరోపించారు. రెండేండ్లపాటు డిప్యూ టేషన్‌ కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పదోన్నతి పొందిన వారికి కనీసం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ ఇచ్చే డిప్యూటేషన్‌కు అవకాశం లేదనడం దారుణమని పేర్కొన్నారు. ఈ జీవోను సవరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -