Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపదవే పరమావధి!

పదవే పరమావధి!

- Advertisement -

– కోర్టులు అక్షింతలు వేసినా రాజీనామా చేయని విజయ్‌ షా
– చర్యకు వెనకాడుతున్న బీజేపీ నాయకత్వం
భోపాల్‌:
సైనికాధికారి కల్నల్‌ సోఫియా ఖురేషీని లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్‌ బీజేపీ మంత్రి విజయ్‌ షాపై న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఆయన పదవి నుండి వైదొలగడం లేదు. మతపరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా షా క్షమాపణను తోసిపుచ్చుతూ విచారణ జరపాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. సిట్‌ విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ ఆయన పదవే పరమావధిగా భావిస్తూ దానిని పట్టుకొని వేలాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సహా పలువురు బీజేపీ నాయకులు విజయ్‌ షా తప్పిదాన్ని వేలెత్తి చూపినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయన వ్యాఖ్యలను ఖండించడం కానీ, ఆయన రాజీనామాను కోరడం కానీ జరగలేదు. పార్టీలో అంతర్గత జవాబుదారీతనం లోపించిన విషయాన్ని ఈ ఉదంతం బయటపెడుతోంది.
ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మాత్రం షాను వెనకేసుకొస్తూ వితండవాదం చేస్తున్నారు. నిందను కాంగ్రెస్‌ పైకి నెట్టి కోర్టు ఆదేశాలను తమ ప్రభుత్వం పాటించిందని తెలిపారు. విద్వేష ధోరణికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ సైతం చర్యకు ఉపక్రమించినప్పుడు రాజకీయ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? ఈ నెల 12న జరిగిన ఓ బహిరంగ సభలో కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉగ్రవాదుల సోదరిగా షా అభివర్ణించారు. ఆమె ముస్లిం గుర్తింపును ఉగ్రవాదంతో ముడిపెట్టారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి గుర్తుగా తిరంగ యాత్రలు చేపట్టిన బీజేపీ…అదే సమయంలో సైనికాధికారిపై మతపరమైన వ్యాఖ్యలు చేసిన మంత్రిని రక్షిస్తోంది. విజయ్‌ షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఇండోర్‌లోని మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని 152, 196 (1) (బీ), 197 (1) (సీ) సెక్షన్ల ప్రకారం షాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన విజయ్‌ షా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నదీ తెలియడం లేదు. ద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలని 2023 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. తన ఆదేశాలను పాటించని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటానని హెచ్చరిం చింది. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలలో విద్వేష ప్రసంగాల కేసులు అత్యధిక సంఖ్యలో నమోదైనప్పటికీ అనేక మంది నాయకులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ‘షా చేసింది ద్వేషపూరిత ప్రసంగం కాదు. అది సైన్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి. మతపరమైన దూషణలకు మించి జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి వారిపై చర్యలు తీసు కోవాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో చెప్పింది. కానీ ఏమీ జరగడం లేదు’ అని న్యాయవాది ప్రత్యూష్‌ మిశ్రా చెప్పారు. విజయ్‌ షా వివాదాన్ని రేకెత్తించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2013లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో చౌహాన్‌ తన భార్య సాధనా సింగ్‌ను ఉద్దేశించి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీనిపై రచ్చ జరగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే నెలల వ్యవధిలోనే మళ్లీ మంత్రి పదవి పొందారు. విజయ్‌ షా శక్తివంతమైన గిరిజన నాయకుడు. ఆయన 1990 నుండి హర్సద్‌ శాసనసభ స్థానానికి ప్రతినిధ్యం వహిస్తున్నారు. అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కాబట్టి ఆయనపై బీజేపీ నాయకత్వం చర్య తీసుకోక పోవచ్చు. ఇదిలావుండగా రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజ్‌భవన్‌ వెలుపల నల్లని యూనిఫామ్‌ ధరించి షా రాజీనామాను డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారిపై దాడి కూడా చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad