Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపదేండ్ల ప్రస్థానం

పదేండ్ల ప్రస్థానం

- Advertisement -

ఎవరి చెమట చుక్కల వలన ఈ సమాజం కొనసాగుతుందో, ఎవరు ఈ లోకానికి అన్నం పెడుతూ తాము మాత్రం ఆకలితో అలమటిస్తున్నారో, ఎవరు ఉత్పత్తికి నెత్తురు దారపోస్తూ సంపదకు దూరంగా దారిద్య్రంలో మగ్గుతున్నారో, అదిగో.. ఆ కష్టజీవుల గుండెచప్పుడై ఆవిర్భవించింది నవతెలంగాణ. వేసే ప్రతి అడుగూ తలవంచని ధైర్యానికి సంకేతం. రాసే ప్రతి వాక్యం తిరుగులేని నిజానికి ప్రతీక. ఏనాడూ సంచలనాల కోసం వెంపర్లాడలేదు. అధికారానికి లొంగలేదు. రాజకీయ, వాణిజ్య ఒత్తిడులకు వెరవలేదు. విలువలకు కట్టుబడి సాగిన ఈ పదేండ్ల ప్రయాణం ఒక చిరస్మరణీయ సందర్భం.
మార్కెట్‌ మాయాజాలంలో మాధ్యమాలన్నీ అత్యంత ఆందోళనకరమైన మార్పులకు గురవుతున్న కాలమిది. నేడు మీడియాలో అత్యధిక భాగం కార్పొరేట్‌ ప్రయోజనాలకే వంతపాడుతోంది. రాజకీయ వత్తిళ్లకు లొంగి, అధికారం ముందు వంగిపోతోంది. ప్రజలను మరచి పాలకవర్గాల పలుకులకూ ప్రకటనలకూ వాహకంగా మారిపోతోంది. కుప్పలుగా వార్తలను ఉత్పత్తి చేస్తూ వాస్తవాలను విస్మరిస్తోంది. ఇలాంటి అనేకానేక ప్రతికూలతల మధ్య… ప్రజలే అజెండాగా నిజాలను గొంతెత్తి నినదించింది నవతెలంగాణ. ప్రత్యామ్నాయ జర్నలిజానికి పతాకగా రెపరెపలాడుతూ ఈ పదేండ్లు పూర్తిచేసుకుంది.
ఈ ప్రయాణమంతా నిప్పుల మీద నడకే. ఎందుకంటే.. ఇప్పుడు రాజ్యం దృష్టిలో నిజాలు రాసే కలాలన్నీ మారణాయుధాలే. హక్కుల గురించి నిలదీసే ప్రశ్నలన్నీ రాజద్రోహాలే. ఇలాంటి సవాళ్ల మధ్య సత్యాన్వేషణ సాగించింది నవతెలంగాణ. పాత్రికేయ విలువల నిర్మాణంలో ప్రామాణికతకు చిరునామాగా నిలబడింది. శాస్త్రీయ విశ్లేషణలకు నూతన ఒరవడులు అద్దింది. నిజాన్ని నిర్భయంగా ప్రకటించే నైతిక స్థైర్యాన్ని తన తొలి పేజీ నుంచే పాఠక హృదయాల్లోకి ప్రవహింపజేస్తోంది. ఎవరు ఈ తలక్రిందుల సమాజాన్ని చక్కదిద్దేందుకు తపిస్తున్నారో, దోపిడీ పీడనలు లేని నూతన సమాజాన్ని సృష్టించేందుకు పోరాడుతున్నారో.. వాళ్లకు అక్షరాలను ఆలంబనగా అందిస్తోంది.
పత్రిక ప్రచురించే వార్తలూ వ్యాసాలూ కథనాలేవీ ఉబుసుపోక రాసేవి కావు. కాలక్షేపం కోసం రాసేవి అంతకంటే కావు. జనం పట్ల ప్రేమ, వాళ్ళ పోరాటాల పట్ల సంఘీభావం ఉన్నప్పుడే వాటి వెనుకున్న వ్యథలేమిటో అర్థమవుతాయి. వాటిలో ఎటువంటి మొహమాటాలుండవు. శిల్పం వెనుకో, ప్రయోగాల వెనుకో దాక్కోవటం అస్సలు ఉండదు. అవి సూటిగా నగంగా సత్యాన్ని బహిర్గతం చేస్తాయి. ఎందుకంటే ఇది కేవలం ఓ జర్నలిస్టిక్‌ జర్నీ కాదు. ప్రజల ఆశలు, ఆవేదనలు, ఆశయాలతో మమేకమై సాగే ఒక నిబద్ధ పాత్రికేయ యాత్ర.
వర్గం, కులం, మతం, జెండర్‌, ప్రాంతం… ఇలా ఎన్నెన్నో విభజన రేఖల నడుమ బతుకుతున్న సమాజమిది. అసమానతలు పునాదిగా ఆధిపత్య వ్యవస్థలను సృష్టించే శక్తులు ఒకవైపు… వాటిని పెకలించటానికి పోరాడే మనుషులు మరొక వైపు. వారి నడుమ యుగాలుగా ఎడతెగని పోరు! ఈ పోరులో రెండవ పక్షం వహిస్తుంది నవతెలంగాణ. సామ్రాజ్యవాదం సృష్టిస్తున్న అనేకానేక కొత్త ముఖాల్లో కనిపించని క్రూరత్వాన్ని ఎప్పటికప్పుడు పసికడుతూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. దాని వికృత దోపిడీ రూపాల బండారాన్ని ఎండగడుతుంది. ఈ ప్రత్యేకతే, ఈ దృష్టికోణమే పత్రికను విజయపథంలో నడుపుతోంది.
లక్ష్య సాధనలో పదేండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భమిది. అయితే అధిగమించాల్సిన బలహీనతలు, అందిపుచ్చుకోవాల్సిన నైపుణ్యాలు ఎప్పుడూ ఉంటాయి. సమకూర్చుకోవాల్సిన వనరులూ ఇంకా మిగిలి ఉండవచ్చుగాక. కానీ సంకల్ప బలంతో సాగిన ఈ పదేండ్ల కాలం కేవలం ఒక గణాంకం కాదు. ముందే చెప్పినట్టు ఇది సవాళ్ల మధ్య సాగిన ఓ నిబద్ధ ప్రయాణం. మనుషులను కలిపే అంశాలకన్నా విభజించే లక్షణాలే ఎక్కువైన ప్రస్తుత కాలంలో ఒక సామూహిక ప్రయాణాన్ని సవ్యంగా సాగించటం అంత సులభమేమీ కాదు. అయినా సరే నవతెలంగాణ నిలబడుతోందంటే అందుకు కారణం ప్రజల మద్దతు. సిబ్బందీ, విలేకరుల నిర్విరామ కృషి ”ఐ యామ్‌ ఫైటర్‌ విత్‌ ఎ పెన్‌”. నా కలం ఎప్పుడూ అభ్యుదయ శక్తులకు అంకితం. నా ఆయుధమైన కలంతోనే నేను యుద్ధం చేయగలను” అంటాడు శ్రీశ్రీ. సరిగ్గా ఇదే ఒరవడిలో సాగే విలేకరుల సైన్యం, ఇతర పాత్రికేయ బృందం, సిబ్బందే నవతెలంగాణకు ఎనలేని బలం. ఆదరించే పాఠకులూ ప్రజలూ ప్రగతిశీలురైన మేధావులు అదనపు బలగం.
ఇదొక దీర్ఘయానం. నవతెలంగాణకు పదేండ్లే కావొచ్చు. కానీ ఎనబయ్యేండ్ల క్రితమే జనశక్తిగా మొదలై, ప్రజాశక్తిగా విస్తరించి, నేడు నవతెలంగాణగా కొనసాగుతున్న మహాప్రస్థానమిది. భ్రమలు చికిత్సకందని కంటి పొరలుగా కమ్ముకుంటున్న చోట… నైరాశ్యంలో నీడ కూడా కనిపించకుండా చీకటి చుట్టుముట్టిన చోట… తర్కం గతి తప్పిన చోట… మనిషి చలనం కోల్పోతున్న చోట… నిత్యం ఓ సత్యవాక్కై సాగుతున్న యుద్ధగీతమీ ప్రయాణం. ఈ పదవ వార్షికోత్సవం ఓ మైలురాయి. ఇది మమ్మల్ని రెట్టించిన ఉత్తేజంతో కర్తవ్యాలకు పునరంకితం చేస్తుంది. మా ఈ మహాయజ్ఞంలో మా వెన్నంటి నిలుస్తున్న అశేష ప్రజానీకానికి అక్షరాభివందనాలు. పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ర‌మేష్ రాంప‌ల్లి
ఎడిటర్‌, నవతెలంగాణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -