నవతెలంగాణ-హైదరాబాద్: అంగోలాలో ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నిరసనల్లో కనీసం 22 మంది మృతి చెందారని, 197 మందికి గాయాలయ్యాయని అంగోలా ప్రభుత్వం ధృవీకరించింది. ఆ దేశ రాజధాని లువాండాతోపాటు మరో ఆరు ప్రావిన్స్‌లలో ప్రజలు పెద్దఎత్తున ఆయిల్ ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. మరణించిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.
అంగోలా ప్రభుత్వం ఇంధన సబ్సిడీలను దశలవారీగా తొలగించే ప్రయత్నానికి పూనుకుంది. దీంతో ఆయిల్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. మూడింట ఒకవంతు లీటర్‌కు 300 – 400 క్వాన్జాన్‌లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇంధన సబ్సిడీలు ఎత్తివేయడంతో.. ఛార్జీలు 50 శాతం మేర పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టాక్సీ, మినీబస్ అసోసియేషన్స్ మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఈ పిలుపు మేరకు ప్రజలు పెద్ద ఎత్తున నిరనల్లో పాల్గొన్నారు. నిరసనల్లో పాల్గొన్నవారిలో 22 మంది మృతి చెందారని అంతర్గత మంత్రి మాన్యుయెల్ హోమెమ్ ప్రకటించారు. అల్లర్లు, దోపిడీలు, భద్రతా దళాలపై దాడులకు పాల్పడినందుకు 1,214 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
కాగా, బుధవారం జరిగిన నిరసనల్లో దుకాణాలు, బ్యాంకులు, బస్సులు, ప్రయివేటు వాహనాలు ధ్వంసమమయ్యాయి. అంగోలా అశాంతి నెలకొంది. మరోవైపు అంగోలాను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది. ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అంగోలా ఉంది. అయినప్పటికీ ఆ దేశానికి ఆర్థిక కష్టాలున్నాయి. దాదాపు సగం జనాభా రోజుకు 3.61 డాలర్లకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. అదీగాక ఐఎంఎఫ్ అంగోలాకిచ్చే సబ్సిడీలను తొలగించింది. దీంతో 2023 నుంచి ఆ దేశంలో అశాంతి నెలకొంది. ఆర్థిక సంక్షోభాన్ని, యువత నిరుద్యోగాన్ని, పర్యావరణ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని సామాజిక కార్యకర్తలు అంగోలా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.