నవతెలంగాణ-హైదరాబాద్: ఒడిశా బాలాసోర్‌లో ఉద్రిక్తత నెలకొంది. లెక్చరర్ లైంగిక వేధింపులకు ఓ విద్యార్థి కాలేజ్ లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీజు జనత దళ్ (బీజేడీ) ఇవాళ బలాసోర్ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈక్రమంలో భారీ యోత్తున చేపట్టిన ర్యాలీలో పార్టీశ్రేణులు, పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు తండోపతండాలుగా పాల్గొన్నారు. ఈక్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళనకారులు ఆ రాష్ట్ర బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలతో రోడ్లలపై బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళకారులపై జలపిరంగులు గుప్పించారు.
బాధితరాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, సీఎం మోహన్ చరణ్ తోపాటు విద్యాశాఖ మంత్రి కూడా వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ (అటానమస్) కళాశాలకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ క్యాంపస్‌లో తనను తాను నిప్పంటించుకుంది. విద్యార్థిని జూలై 14న ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 95 శాతం కాలిన గాయాలతో మరణించింది.
తనపై హెచ్‌వోడీ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థిని పదే పదే ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపాల్ మరియు కళాశాల అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. కాలేజ్ ఫ్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.