Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయందుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత..కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ బంద్‌

దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత..కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ బంద్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒడిశాలోని కటక్‌లో దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి దుర్గామాత నిమజ్జన ఊరేగింపు కటక్‌ పట్టణంలోని దర్గా బజార్ ప్రాంతం గుండా కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్నది. అయితే డీజే విషయంలో నిమజ్జన ఊరేగింపును స్థానికుల్లో ఒక వర్గం అడ్డుకుంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది. ఊరేగింపులో ఉన్నవారు ప్రతిఘటించడంతో, ఘర్షణ కాస్తా పరస్పర దాడులకు దారితీసింది. దీంతో పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పులు పెట్టారు. ఆ ఘర్షణలో కటక్‌ డీసీపీ రిషికేశ్‌ ఖిలారీతో సహా ఆరుగురు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, జనాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అతి కష్టం మీద ఇరువర్గాలను తరిమికొట్టిన పోలీసులు.. నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పట్టణంలో ఆంక్షలు విధించారు.

అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ ఆదివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. నగరం తూర్పు శివార్లలోని బిద్యాధర్‌పూర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఘర్షణలు జరిగిన దర్గా బజార్ మీదుగా వెళ్లి, సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ సందర్భంగా రూట్‌లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారని, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలో పలు దుకాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -