పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం మొదటిరోజు ప్రశాంతంగా జరిగాయి జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో 7307 మంది విద్యార్థులకు గాను 99.89% హాజరుశాతంతో 7299 మంది విద్యార్థులు హాజరయ్యారు. 8మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. మొదటిరోజు పరీక్ష సజావుగా సాగిందని జిల్లా విద్యాధికారి . డా. బి. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి,కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 బి ఎన్ ఎస్ ఎస్ (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.
వీల్ చైర్ పై టెన్త్ పరీక్షలకు హాజరైన విద్యార్థి
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ద్విచక్ర వాహనంపై ప్రమాదానికి గురై కాలు, చేతికి గాయం కావడంతో స్క్వాడ్ అనుమతితో ఎగ్జామ్ కి హాజరు అయ్యారు ఫిబ్రవరి మాసంలో సిరిసిల్ల చెందిన రహమాన్ అనే విద్యార్థి బైక్ ప్రమాదానికి గురయ్యాడు ఈ సమయంలో 10వ తరగతి పరీక్షలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని మరొకరి సాయంతో పరీక్ష రాశాడు విద్యార్థికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.




