Monday, December 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి

సిడ్నీ బీచ్‌లో ఉగ్రదాడి

- Advertisement -

కాల్పుల్లో 11 మంది మృతి, 29 మందికి గాయాలు
ఆస్ట్రేలియాలో ఘటన
దుండగుడితో పర్యాటకుడి పెనుగులాట

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఇద్దరు సాయుధ దుండగులు బీభత్సం సృష్టించారు. బాండీ బీచ్‌లో పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఈ క్రమంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతిచెందగా.. 29 మంది గాయపడ్డారు. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కాల్పులు కలకలం రేపాయి. కాల్పులు మొదలైన వెంటనే అక్కడున్నవారు నేలపై పడిపోవడం, దాక్కోవడం, కొందరు సముద్రం వైపు పరుగులు తీయడం వంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు
గాయపడినవారిలో పర్యాటకులతో పాటు స్థానికులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారి సహా ఓ పోలీసు అధికారి ఉన్నట్టు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. గాయపడిన 29 మందిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని వారి పరిస్థితి విషమంగా ఉందని న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసు కమిషనర్‌ తెలిపారు. నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు దుండగులు సర్ఫ్‌క్లబ్‌ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

దుండగుడితో పర్యాటకుడి పెనుగులాట
కాల్పులు జరుపుతున్న దుండగుడిని ఓ పర్యాటకుడు అడ్డగించి అతడి చేతులో ఉన్న తుపాకీ లాక్కొని కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా ఒక దుండగుడు హతమయ్యాడు. మరొకడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది ఉగ్రదాడి
మృతిచెందిన దుండగుడికి చెందిన కారులో ఐఈడీని గుర్తించిన పోలీసులు వెంటనే బాంబ్‌ డిస్పోజల్‌ యూనిట్‌కు సమాచారమిచ్చారు. ఇది ఉగ్రదాడి అని న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసు కమిషనర్‌ తెలిపారు. చనిపోయిన దుండగడి కారులో ఐఈడీని గుర్తించామని చెప్పారు. కౌంటర్‌ టెర్రరిజంకు చెందిన బృందం దర్యాప్తు చేపడుతుందని వెల్లడించారు. సిడ్నీలోని యూదులను లక్ష్యంగా చేసుకొని దుండగులు కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసు కమిషనర్‌ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బాండీ బీచ్‌లో దాదాపు వెయ్యి మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన ప్రభుత్వం
బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, హింస, ద్వేషానికి ఆస్ట్రేలియాలో చోటులేదని అన్నారు. పోలీసులు, అత్యవసర ప్రతిస్పందన దళాలు సహాయక చర్యలు చేపడతున్నాయని చెప్పారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన బాండి బీచ్‌లో ఈ తరహా ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పర్యాటకులు భయాందోళనకు గురవుతుండగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మరోవైపు దుండగులు కాల్పుల ఘటనను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ దశాబ్దాలుగా పోరాడుతోందని, ఉగ్ర దాడులు ఎక్కడ జరిగినా భారత్‌ ఖండిస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -