Sunday, December 7, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసంక్షోభంలో టెక్స్‌టైల్‌ రంగం

సంక్షోభంలో టెక్స్‌టైల్‌ రంగం

- Advertisement -

మార్కెట్‌ సౌకర్యంలేక ఇబ్బందులు
ప్రభుత్వ ఆర్డర్లు నిరంతరం కొనసాగాలి
అనారోగ్య సమస్యలతో సతమతం
అరకొరగా బడ్జెట్‌ కేటాయింపులు
అమలుకు నోచుకోని ఎన్నికల హామీలు
పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టెక్స్‌టైల్‌ పరిశ్రమ పట్ల ప్రభుత్వాలకు ఇప్పటి వరకు ఒక విధానమంటూ లేదు. దీంతో ఆ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆ కష్టాలు తొలగే దారి దొరక్క కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన హృదయ విధారక సంఘటనలు మరవలేనివి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ చేనేత బోర్డు, జాతీయ వస్త్ర బోర్డులను రద్దు చేసింది. యూపీఏ పాలన నుంచి అమల్లో ఉన్న హౌస్‌-కమ్‌-వర్క్‌షాప్‌ పథకం, మహాత్మాగాంధీ బునాకర్‌ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఆరోగ్య బీమా పథకాలను కూడా నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. అంతేకాకుండా, చేనేత, పవర్‌ లూమ్‌ వస్త్రాలు, ముడి పదార్థాలపై 12 శాతం జీఎస్టీని విధించింది.

రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్‌, సిద్దిపేట, వరంగల్‌, హన్మకొండ, నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, మహాబూబ్‌నగర్‌ తదితర జిల్లాలో సుమారు 1.80లక్షల పవర్‌లూమ్‌లు ఉన్నాయి. 80వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అనుబంధ వృత్తిలో మరో 40వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యల ఫలితంగా ఇప్పుడు ఈ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు అంటే 12గంటలు నిరంతరాయంగా నిలబడి పని చేయాలి. శబ్దకాలుశ్యం. దారం నుంచి వచ్చే డస్ట్‌.. తదితర అంశాల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారు. కంటి చూపు మందగించటం, కీళ్లనొప్పులు, నడుమునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తటంతో ఆస్పత్రుల చుట్టూ తిరగటం పరిపాటిగా మారింది.

సంక్షేమ పథకాల అమలులో లోపాలు..
సంక్షేమ పథకాలను పవర్‌లూమ్‌ కార్మికులకు అమలు చేయటంలో తీవ్ర లోపం ఉన్నది.వీరికి గుర్తింపు కార్డులే లేవు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర బీమా సౌకర్యాలు వీరికి అందటం లేదు. వృత్తి సంబంధిత అనారోగ్యాలు కీళ్ల నొప్పులు, దృష్టిలోపాలు, పోషకాహార లోపం వేదిస్తు న్నాయి. సరైన ఆరోగ్య భద్రత లేకపోవటం ఒక ప్రధాన సమస్యగా ఉంది.

బడ్జెట్‌ కేటాయింపులు..
అరకొర బడ్జెట్‌ కేటాయింపులతో వారి సమస్యలు పరిష్కారం కాకుండా ఎక్కడవక్కడే మూలుగుతున్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేత, మరమగ్గాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రూ.12వందల కోట్లు కేటాయించింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు (రూ.371 కోట్లకు) గణనీయంగా తగ్గాయని కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిశ్రమ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.

హామీలు అమలు చేయాలి
మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చినంక వాటికి తిలోదకాలిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలకు అర్డర్లు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తున్నది. బడ్జెట్‌లో కోతవిధించింది. పరిశ్రమను అభివృద్ధి చేసే స్థాయిలో కేటాయింపులు లేవు. పని గ్యారంటీ లేకపోవటం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 365రోజులు పని కల్పించేందుకు అవకాశాలున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాటాలకు సన్నద్ధం అయితే తప్ప ప్రభుత్వం కార్మికుల వైపు చూసే స్థితి లేదు. 42 రోజుల సమ్మె ఇది రుజువు చేసింది. -కూరపాటి రమేష్‌, రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌

ఉపాధి కొరత..
చాలా ప్రాంతాల్లో మరమగ్గాల యాజమానులు కూలీ రేట్లు పెంచటానికి నిరాకరిస్తున్నారు. తక్కువ కూలీ రేట్లతో రోజువారి జీవనం గడపడం కష్టంగా మారింది. ప్రభుత్వ ఆర్డర్లు లేకపోవటం, లేదా ఆలస్యం కావటం వల్ల మరమగ్గాలు మూతపడుతున్నాయి. సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పార్కులు మూతపడి వేలాది మంది కార్మికులు ఉపాది కోల్పోయారు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -