Sunday, October 19, 2025
E-PAPER
Homeకథథాంక్యూ సార్‌..!

థాంక్యూ సార్‌..!

- Advertisement -

తెల్లవారు జామున ఆరయ్యింది. ఫాతిమా నిద్రలేచి చీపురు పట్టుకొని బయటకు వచ్చింది. ఇంటి ముందు ఊడ్చి కల్లాపి చల్లి, గిన్నెలు కడిగి వంటకు కావల్సిన ఏర్పాటు చేస్తోంది. రోజూ ఈ పాటికి నిద్ర లేచి ఇంటి పనుల్లో సాయం చేసే 12 ఏండ్ల కూతురు షహనాజ్‌ ఇంత పొద్దెక్కినా నిద్ర లేవలేదు. ఏమైంది అనుకుంటూనే పని చేసుకుంటుంది.
చూస్తుండగానే టైం ఎనిమిది కావొస్తోంది. షహనాజ్‌ ఇంకా లేవలేదు. కూతురు ముఖంపై ఉన్న దుప్పటిని తీసి ‘లే.. నిద్రలే.. బడికి వెళ్ళావా? టైం చూడు ఎంత అయ్యిందో’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఫాతిమా వంట చేస్తూనే ‘బేటి లేచావా’ గట్టిగా అరవడంతో ‘ఆ లేస్తున్నా’ అని లేచి బాత్రూంలోకి వెళ్లింది. ‘కనీసం దుప్పటి కూడా మడత పెట్టకుండా ఏంటీ ఈ పిల్ల, ఈరోజు ఇలా చేస్తుంది, ఏమైంది?’ అనుకొని తనే మడతపెట్టి పక్కన పెట్టి వంటింట్లోకి వెళ్ళింది.
బాత్రూం నుండి నీరసంగా బయటికి వస్తున్న కూతుర్ని చూసి ‘క్యా హువా బేటీ, తబ్యాతో ఠీక్‌ హైనా?’ అంటూ కంగారు పడింది. ‘హా ఠీక్‌ హై అమ్మీ’. ‘మరెందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నావు’. ‘కుచ్‌ బి నహి అమ్మి’ అంటూ టవల్‌ తీసుకొని స్నానానికి వెళ్లింది.
షహానాజ్‌ స్నానం చేసి వచ్చి స్కూల్‌ డ్రెస్‌ వేసుకొని అద్దం ముందు నిల్చొని పౌడర్‌ రాసుకుంటుండగా అప్పుడే బయట నుండి వచ్చిన ఆమె తండ్రి రహీం కుర్చీలో కూర్చుంటూ ‘క్యా బేటీ ఖానా ఖాయే’ ప్రేమగా అడిగాడు.
‘నై అబ్బా, ఆజ్‌ బూక్‌ నహి’ అని స్కూల్‌ బ్యాగ్‌ తీసుకొని అమ్మానాన్నలకు టాటా చెప్పి అరకిలో మీటర్‌ దూరంలో ఉన్న ప్రైవేట్‌ పాఠశాలకు బయలు దేరింది.
కుర్చీలో కూర్చున్న రహీం కూతురు పోయిన వైపు అలాగే చూస్తుండిపోయాడు. ఫాతిమా వచ్చి ‘ఏం చూస్తున్నారు, అలాగే గుమ్మం వైపు’ అని ఆసక్తిగా అడిగింది. ‘ఏమీ లేదు ఈరోజు ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది’ అని ఫాతిమాతో అన్నాడు. ‘అదేంటో నాకు తెలుసు’ ఫాతిమా అంటే ‘ఏంటో చెప్పు’ అన్నాడు రహీం. ‘షహనాజ్‌ రోజూ స్కూల్‌కి వెళుతూ నీకు ముద్దు ఇచ్చేది, కానీ ఈరోజు ఇవ్వలేదు. ఇదే కదా మీరు ఆలోచిస్తున్నది’ అన్నది.
‘అరే నువ్వు భలే గమనించావే’ అన్నాడు రహీం.
‘ఈరోజేంటో షహనాజ్‌ కాస్త విచిత్రంగా కనిపిస్తుంది’ బాధపడుతూ అన్నది.
‘అదేం లేదులే రాత్రి ఎక్కువ సేపు చదువుకుంది కదా అందుకే అలా ఉన్నట్టుందిలే. అనవరంగా నువ్వు కంగారు పడకు. నేను అలా పంచాయతీ ఆఫీసు వరకు వెళ్లి వస్తాను’ అని బయలుదేరాడు.

అంగన్వాడి టీచర్‌గా పని చేస్తున్న ఫాతిమా స్నానం చేసి లంచ్‌ బాక్స్‌ కట్టుకొని స్కూల్‌కి బయలుదేరింది

షహనాజ్‌ స్కూల్లో మూడు పీరియడ్లు పూర్తయ్యాయి. నాలుగవ పీరియడ్‌ సైన్స్‌ క్లాస్‌. టీచర్‌ శేఖర్‌ క్లాస్‌ రూమ్‌లోకి వచ్చారు. శేఖర్‌ టీచర్‌ చూడడానికి పొట్టిగా, నల్లగా, బట్టతలతో ఉంటారు.
టీచర్‌ క్లాసులోకి వచ్చిన వెంటనే షహనాజ్‌ ఆయన ఆకారంపై ఏదో ఒక కామెంట్‌ చేసేది. కానీ ఈరోజు షహనాజ్‌ నుండి కానీ, ఇతర పిల్లల నుండి ఎటువంటి కామెంట్‌ రాలేదు. శేఖర్‌ ఒక సెకండ్‌ అనుమానంగా చూసి క్లాస్‌ ప్రారంభించాడు.
క్లాస్‌ కొనసాగుతున్నప్పుడు శేఖర్‌, షహనాజ్‌నే గమనిస్తున్నాడు. మామూలుగా అయితే క్లాస్‌ జరుగుతున్నప్పుడు షహనాజ్‌ కుదురుగా ఉండదు. ఈలోపు లంచ్‌ బెల్‌ మోగింది. పిల్లలందరూ తమ లంచ్‌ బ్యాగులు తీసుకొని కారిడార్‌లోకి పరిగెత్తారు. కానీ షహనాజ్‌ క్లాస్‌రూంలోనే కూర్చొని ఉంది. అది చూసిన శేఖర్‌ ఆమె దగ్గరికి వెళ్లి ‘ఏంటి షహనాజ్‌ లంచ్‌ తెచ్చుకున్నావా, ఏం కూర తెచ్చుకున్నావు’ అడిగితే ‘కాకరకాయ తెచ్చుకున్న సార్‌’ అన్నది. ‘సరే క్లాస్‌ విన్నావా’ అని అడిగాడు. ‘హా విన్నా సార్‌’ అన్నది. ‘ఏం విన్నావో చెప్పు’ అన్నాడు శేఖర్‌. రెండుసార్లు మెల్లిగా దగ్గి మౌనంగా ఉండిపోయింది.

‘ఏంటి ఈరోజు నీరసంగా కనిపిస్తున్నావు’ అన్నారు సార్‌. ‘ఏమో తెలియదు సార్‌’ సమాధానం ఇచ్చింది. ‘సరే ఇక భోజనం చెరు’ అని స్టాఫ్‌ రూమ్‌కి వెళ్లిపోయాడు. షహనాజ్‌ సగం బాక్స్‌ మాత్రమే తిని బెంచ్‌పై పడుకున్నది.

రహీంకి షహనాజ్‌ ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుండి షహనాజ్‌ చదువులో చాలా చురుగ్గా ఉండేది. ఆటల్లో అల్లరిలో కూడా ఫస్టే. ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమెంటే టీచర్లందరికీ చాలా ఇష్టం. శేఖర్‌సార్‌పై కామెంట్‌ చేసినా పెద్దగా పట్టించుకునే వాడు కాదు. అలాంటి పిల్ల ఇప్పుడు ఎందుకు అలా వుంది?

లంచ్‌ బెల్‌ ముగిసింది. ఐదవ పీరియడ్‌ జరుగుతున్నప్పుడు షహనాజ్‌కి కడుపునొప్పి వచ్చింది. ప్రిన్సిపల్‌ రహీంకి ఫోన్‌ చేసి స్కూల్‌కి పిలిపించారు. రహీం వెంటనే వచ్చి ‘క్యా హువా బేటీ’ అడిగాడు. షహనాజ్‌కి తండ్రంటే ఎంత ప్రేమో అంతకన్నా ఎక్కువ భయం. ‘పతానై అబ్బా’ సమాధానం ఇచ్చింది. ‘సరే వెళ్దాం పద’ అని ఇంటికి తీసుకెళ్లాడు. ఈలోపు ఫాతిమా జీలకర కలిపి మజ్జిగతో గుమ్మం దగ్గర ఎదురుచూస్తోంది. షహనాజ్‌ వచ్చీ రాగానే కంగారుగా ‘క్యా హువా బేటీ, ఆవో అవో బైటో’ అని కూర్చోబెట్టుకొని తన చేతిని కడుపుపై పెట్టి ‘జ్యాదా దరద్‌ హౌరా క్యా’ అడిగింది.
అవును అన్నట్టు మౌనంగా తల ఊపింది. ఫాతిమా వెంటనే వంట గదిలోకి వెళ్లి మజ్జిగ తీసుకువచ్చి తాగించి, పడుకోబెట్టి మళ్లీ అంగన్వాడీకి బయలుదేరింది. రహీం బయటకి వెళ్లకుండా షహనాజ్‌కి తోడుగా ఉండి పాత నవారు మంచాన్ని బాగు చేసే పనిలో పడ్డాడు.
మరుసటి రోజు యధావిధిగా మళ్లీ స్కూల్‌కి వెళ్ళింది షహనాజ్‌. అలా ఒక వారం రోజులు గడిచాక మళ్లీ కడుపునొప్పి వచ్చింది. స్కూల్‌ వాళ్లు మళ్లీ రహీంకి ఫోన్‌ చేయడంతో ఈసారి అతనితో పాటు ఫాతిమా కూడా స్కూల్‌కి వచ్చింది. షహనాజ్‌ని తీసుకొని సీదా ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్‌ ప్రియాంక స్కూల్‌ వీధిలోనే క్లినిక్‌ నడుపుతున్నది. కానీ దానికి తాళం వేసి ఉంది. రహీం కంగారుగా డాక్టర్‌కి ఫోన్‌ చేసి ‘మేడం నేను రహీంని’ అన్నాడు. కంగారులో అతనికి మాటలు కూడా సరిగా రావడం లేదు. అప్పుడు డాక్టర్‌ ‘చెప్పు రహీం, ఏమైంది కంగారు పడకు’ అన్నది.
ఈలోపు ఫాతిమా ఫోన్‌ తీసుకొని ‘మేడం నేను ఫాతిమాని. షహనాజ్‌కి కడుపునొప్పి వస్తే మీ క్లినిక్‌కి తీసుకొని వచ్చాం. తాళం వేసి ఉంది, మీరు ఎప్పుడు వస్తారు మేడం’ అడిగింది. ‘పర్సనల్‌ పని వల్ల ఈరోజు నేను రావట్లేదు’ సమాధానమిచ్చింది డాక్టర్‌. ఫాతిమా కంగారుగా ‘మరి ఎలా మేడం, మీరు తప్ప మాకు ఎవరూ పరిచయం లేరు. వేరే హాస్పిటల్లో పెద్ద టెస్టులు అంటారు. దానికి వేల రూపాయలు ఖర్చు అవుతాయి. మేము అంత పెట్టుకోలేం’ అని దీనంగా చెబుతుంటే.. ‘పర్లేదు ఫాతిమా, మీరు కంగారు పడకండి. షహనాజ్‌ని తీసుకొని మా ఇంటికి రాగలరా’ అని అడిగింది ప్రియాంక.
‘సరే మేడం’ అని ఫోన్‌ కట్‌ చేసి ఆటోలో ముగ్గురు డాక్టర్‌ ఇంటికి వెళ్లారు. ‘రా షహనాజ్‌ ఏమైంది చెప్పు’ అని డాక్టర్‌ అడిగింది. కామ్‌గా డాక్టర్‌ వైపు షహనాజ్‌ అలాగే చూస్తుంటే ‘కడుపు నొప్పి వచ్చిందని స్కూల్‌ నుండి ఫోన్‌ వస్తే సీదా తీసుకొని వచ్చాం’ అన్నాడు రహీం. ‘నొప్పి ఎక్కడా’ అని తన ఎడమ చేతిని షహనాజ్‌ భుజం మీద వేసి కుడి చేయి కడుపు మీద పెట్టి అడిగింది. ‘ఇక్కడా? ఇక్కడా?’ డాక్టర్‌ చేయిని కడుపుపై పెట్టి నొక్కుతూ అడిగింది.
డాక్టర్‌ చేయి కడుపుకి కుడి వైపు తాకగానే షహనాజ్‌ ‘ఆ..ఆ’ అన్నది. అక్కడ నొప్పి ఉందని గ్రహించి రహీం ఫాతిమాల వైపు చూసి ‘ఇంతకుముందు ఎప్పుడైనా నొప్పి వచ్చిందా’ అడిగింది. వారం రోజుల కిందట ఇలాగే నొప్పి వస్తే మజ్జిగలో జీలకర్ర కలిపి తాగిస్తే తగ్గింది మేడం’ అన్నాడు రహీం. డాక్టర్‌ షహనాజ్‌ కళ్ళను టార్చ్‌ వేసి చూసి ‘ఒక బ్లడ్‌ టెస్ట్‌ చేద్దాం, రిజల్ట్‌ వచ్చాక మందులు ఇస్తాను’ అన్నది.
‘బ్లడ్‌ టెస్ట్‌కి ఎప్పుడు రావాలి మేడం’ ఫాతిమా డాక్టర్‌ వైపు వంగి అడిగింది. ‘రేపు ఉదయం 6 గంటలకి క్లినిక్‌కి రండి. నేను స్టాఫ్‌కి చెప్పి పెడతాను’ అన్నది. ‘మరి రేపు పాపను స్కూల్‌కి పంపొచ్చా’ అడిగింది ఫాతిమా. ‘రేపు ఒక్కరోజు వద్దులే, రిజల్ట్‌ వచ్చాక నేనే చెప్తాను’ అన్నది డాక్టర్‌.

రహీం ఫాతిమా ఇద్దరూ లేచి డాక్టర్‌కి దండం పెట్టి ‘మేడం షహనాజ్‌కి ఏం కాదు కదా’ అని భయంగా అడిగారు. ‘మీరేం కంగారు పడొద్దు. ముందు టెస్టులు రానివ్వండి’ అంటూ డాక్టర్‌ వారికి ధైర్యం చెప్పి పంపించింది. షహనాజ్‌ భుజాలపై చేయి వేసి ఇంటికి వెళ్లి మజ్జిగ తాగి పడుకో అని ముద్దుగా చెప్పింది.

మరుసటి రోజు ఉదయాన్నే క్లీనిక్‌కి వెళ్లి శాంపిల్‌ ఇచ్చారు. సాయంత్రానికి రిజల్ట్‌ వచ్చింది. రిపోర్ట్స్‌ తీసుకుని డాక్టర్ని కలవడానికి వెళ్లారు. రిపోర్ట్స్‌ చూసి ‘నీకు రక్తం చాలా తక్కువగా ఉంది. 11 నుండి 12 ఉండాల్సింది 4 శాతం మాత్రమే ఉంది. అందుకే నీవు అంత నీరసంగా ఉన్నావు. ఇలా అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతావు’ అన్నది.
‘అవునా మేడమ్‌! మరి రక్తం ఎక్కించాలా’ అడిగాడు రహీం. ‘అదేం వద్దులే కానీ చిన్న అమ్మాయి కదా మళ్లీ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఉంది. నేను కొన్ని టాబ్లెట్స్‌ ఇస్తాను అవి వాడండి. అలాగే రక్తం పట్టే కూరలు, పండ్లు చెబుతాను, అవి తినిపించండి’ అన్నది డాక్టర్‌.
‘సరే మేడం, ఫీజు ఎంత మేడం’ అని నోట్లో గులుగుతూ జేబులో చేయి పెట్టాడు రహీం. ‘ఫీజుది ఏముందిలే ముందు పాపకి తగ్గనివ్వు’ అన్నది డాక్టర్‌ ప్రియాంక. రహీం, షహనాజ్‌ ఇంటికి బయలుదేరారు
ఐదు రోజులు షహనాజ్‌ స్కూల్‌కి వెళ్లలేదు. సంధ్యా, షహనాజ్‌ ఎందుకు రాలేదో నీకు తెలుసా, నీ పక్కనే కూర్చుంటుంది కదా?’ అడిగాడు శేఖర్‌ సార్‌. ‘ఏమో సార్‌ నాకు తెలియదు. మొన్న అయితే హాస్పిటల్‌కి వెళ్లడం చూశాను. కానీ నేను ఏం మాట్లాడలేదు సార్‌, ఆరోగ్యం బాగాలేదేమో సార్‌’ అన్నది సంధ్య.
తిరిగి స్కూల్‌కి వచ్చిన షహనాజ్‌ను ప్రేయర్‌లో గమనించిన శేఖర్‌ ‘ప్రేయర్‌ అయ్యాక స్టాఫ్‌ రూమ్‌కి వచ్చి నన్ను కలువు’ అన్నాడు. ప్రేయర్‌ అయ్యాక స్టాఫ్‌ రూమ్‌ దగ్గరికి వెళ్లి ‘మే ఐ కమిన్‌ సార్‌’ అన్నది షహనాజ్‌. ‘లోపలికి రా’ అన్నారు శేఖర్‌. ‘ఏంటి వారం రోజుల నుండి స్కూల్‌కి రాలేదు ఏమైంది నీకు?’ అడిగాడు. ‘ఆరోగ్యం బాగాలేదు సార్‌’ అన్నది.
‘ఏమైంది? డాక్టర్‌ ఏమన్నారు?’ అడిగారు శేఖర్‌. ‘రక్తం తక్కువగా ఉందంట సార్‌’ అన్నది.
‘రక్తం ఎందుకు తగ్గిందంటా’ అన్నాడు. ‘ఏమో తెలియదు సార్‌’ అని తల వంచుకొని సమాధానం ఇచ్చింది.
‘నేను చెప్పనా ఎందుకు తక్కువ ఉందో’ అన్నారు సార్‌. షహనాజ్‌ మౌనంగా ఉంది. ‘నువ్వు బలపాలు, చాక్‌పీస్‌లు తింటావు కదా’ అడిగాడు శేఖర్‌. షహనాజ్‌ కళ్ళు తేలేసి చేతివేళ్లను తడుముకుంటూ తలను అడ్డంగా ఊపుతూ ‘లేదు సార్‌’ అని మెల్లగా సమాధానం చెప్పింది. ‘నిజం చెప్పు’ అన్నాడు. ‘నిజమే సార్‌’ అన్నది. ‘ఈమధ్య దొంగతనాలు కూడా చేస్తున్నట్టున్నావు’ అన్నాడు సార్‌.
ఉలిక్కిపడిన షహనాజ్‌ భయంతో ‘నేనా! లేదు సార్‌’ అని మెల్లిగా సమాధానం ఇచ్చింది. ‘మరి ఎక్కడ ఏం దొంగతనం చేశావో చెప్పమంటావా’ అన్నాడు శేఖర్‌. షహనాజ్‌ బిక్క మొహం వేసుకొని నిలబడింది. ‘రెండు వారాల కిందట మన స్కూల్‌ వెనుక వీధిలో ఉన్న బాలాజీ సూపర్‌ మార్కెట్లో ఏం జరిగింది?’ అడిగాడు శేఖర్‌. ‘ఏంటి సార్‌, ఏం జరగలేదు సార్‌ అని కంగారుగా అన్నది. ‘ఆ సూపర్‌ మార్కెట్లో ఏం దొంగతనం చేశావు’ అడిగారు శేఖర్‌. ‘నేనా, అదేం లేదు సార్‌’ అంటూ భయంగా తలవంచుకుంది.
‘ఇటు చూడు, నన్ను చూడు. ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? నువ్వు బలపాలు దొంగతనం చేశావు. నాకు తెలియదనుకున్నావా’ అడిగారు శేఖర్‌. ‘నేనా అదేం లేదు సార్‌’ అన్నది.
మూడు వారాల కిందట…
ఆరోజు ఆదివారం. చికెన్‌ కొనుక్కొని మసాలా కోసం బాలాజీ సూపర్‌ మార్కెట్‌కి వెళ్ళాడు శేఖర్‌. సరుకులు తీసుకుని బిల్‌ కట్టడానికి కౌంటర్‌ వద్దకు వచ్చాడు. ‘క్యా సార్‌, కైసే హై.. సబ్‌ కుచ్‌ ఠీకే’ అడిగాడు సూపర్‌ మార్కెట్‌ ఓనర్‌ హరినాథ్‌ చౌదరి. ‘ఆ సబ్‌ కుచ్‌ ఠీక్‌ హే సెట్‌, ఆప్‌ కైసే హై?’ అని తిరిగి ప్రశ్నించాడు శేఖర్‌. ‘ఠీక్‌ హై’ సార్‌ అంటూ ‘క్యా సార్‌ ఆప్‌కి స్కూల్‌ బచ్చీ పరేషాన్‌ కర్రే, చోరీ కర్రీ, ఐసా కరేతో కైసా’ అన్నాడు హరినాథ్‌ చౌదరి..
‘కోన్‌ హమారా స్కూల్‌ కే బచ్చే? క్యా కరే?’ అడిగాడు శేఖర్‌. ‘ఠైరో దికాతాహు’ అని తన జేబులో నుండి ఫోన్‌ తీసి కెమెరా రికార్డింగ్‌ ఓపెన్‌ చేసి చూపించాడు. అది చూసి నమ్మలేక పోయాడు. ఆ వీడియోలో షహనాజ్‌ సరుకుల బుట్ట పట్టుకొని సరుకుల్ని కొంటున్నట్టు నటిస్తూ ఆ కింద ర్యాకులో ఉన్న బలపాలు, చాక్‌ పీసులు తీసుకోవడానికి వంగింది. మెల్లిగా జేబులో వేసుకోవడం వీడియోలో క్లియర్‌గా కనబడింది. ‘ఏ బచ్చి అచ్చి పడితే హై, క్లాస్మే ఫస్ట్‌ ఆతే హై, ఏ కామ్‌ హోరా’ అన్నాడు శేఖర్‌. ‘మై బాత్‌ కర్తా హూ సెట్‌’ అంటూ వెళ్లిపోయాడు.
ప్రస్తుతం
శేఖర్‌ చెప్పిన విషయం విని షహనాజ్‌ కంగారు పడింది. ‘అబద్దాలు ఎప్పుడైనా దాచాలంటే దాగవు షహనాజ్‌. ఎప్పటి నుండి ఈ అలవాటు, దీనివల్ల నీ ఆరోగ్యం ఎంతగా పాడయ్యిందో చూడు. మీ నాన్నకు చెప్పమంటావా? అన్నాడు. ‘వద్దు సార్‌, మళ్లీ ఇంకెప్పుడూ అలా చేయను. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు సార్‌’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ‘అంత భయం ఉన్న దానివి అలా ఎందుకు చేశావు’ అన్నాడు. షహనాజ్‌ ఏమీ మాట్లాడలేదు.
షహనాజ్‌ ముందే రహీంకి ఫోన్‌ చేశాడు శేఖర్‌. కానీ తీయలేదు. ‘సరే మీ నాన్నకి చెప్పు నేను రమ్మనమన్నానని’ అంటుండగా రహీం నుండి ఫోన్‌ వచ్చింది. ‘నమస్తే సార్‌’ అన్నాడు రహీం. ‘ఏంటి రహీం బాగున్నావా’ అడిగాడు సార్‌. ‘బాగున్నా సార్‌ చెప్పండి సార్‌ ఫోన్‌ చేశారు’.
‘ఏం లేదు మీతో మాట్లాడాలి’ అంటూ షహనాజ్‌ వైపు చూశాడు. ‘నాన్నకి చెప్పొద్దు సార్‌, ప్లీజ్‌’ అంటూ మెల్లగా చెప్పింది. ‘ఏమీ లేదు, మీ అమ్మాయి గురించి మాట్లాడాలి’ అంటూ చైర్‌లో నుండి లేచి ఫోన్‌ స్పీకర్‌కి చెయ్యి అడ్డం పెట్టి ‘షహనాజ్‌ నీతో తర్వాత మాట్లాడతా’ అని నడుచుకుంటూ వెళ్లిపోయాడు. షహనాజ్‌ కూడా క్లాస్‌ రూమ్‌కి వెళ్లిపోయింది. ‘సార్‌ నాన్నకు ఏం చెప్పాడో, ఇకపై బలపాలు, చాక్‌పీస్‌లు తినకూడదు. దొంగతనం కూడా చేయకూడదు’ అని మనసులో అనుకుంటూ బెంచి మీద చేతులు పెట్టి ఆలోచిస్తూ కూర్చుంది. స్కూల్‌ టైం అయిపోయింది. మెల్లిగా నడుచుకుంటూ భయం భయంగా ఇంటికి చేరింది. ఫాతిమా కూతురి కోసం గారెలు చేసి పెట్టింది.
పోయినేడాది తన పుట్టిన రోజున ‘నాన్న నాకు కుక్క పిల్లని కనుక్కోరా, నేను దాంతో ఆడుకుంటాను’ అని అడిగింది. అప్పుడు డబ్బులు లేక కొనలేకపోయాడు. ఈసారి పుట్టినరోజుకైనా కుక్క పిల్లని తెచ్చి కూతురికి ఇవ్వాలని పైసా పైసా పోగుచేసి 3000తో కొనుక్కొచ్చాడు. స్కూల్‌ నుంచి వచ్చాక చూపిద్దామని’ రహీం ఎదురు చూస్తున్నాడు.
ఇంతలో షహనాజ్‌ భయం భయంగా లోపలికి వచ్చింది. ఎదురుగా కుక్కపిల్ల కనిపించింది. కానీ షహనాజ్‌ ముఖంలో సంతోషం లేదు. బ్యాగు పక్కన పెట్టి డ్రెస్‌ మార్చుకోవడానికి రూమ్‌కి వెళ్లింది. అరగంటైనా బయటకు రాలేదు. ‘తనకిష్టమైన కుక్క పిల్లను చూసి కూడా మౌనంగా ఉందేంటి’ అనుకొని ‘బేటీ షహనాజ్‌’ అంటూ రూమ్‌లోకి వచ్చాడు రహీం. షహనాజ్‌ అటు తిరిగి పడుకొని ఉంది.
‘క్యా హువా బేటీ, తబ్యాత్‌ ఠీక్‌ నహీ క్యా’ అని ప్రేమగా అడిగాడు. ‘దొంగతనం గురించి ఏం అనట్లేదు ఏంటి’ అని తండ్రి వైపు తిరిగింది. ‘కుచ్‌ నై అబ్బా’ అంటూ తండ్రిని వాటేసుకుంది. ‘తుమారే లియే కుత్తా లయా హు’ అంటూ షహనాజ్‌ను హాల్లోకి తీసుకొచ్చాడు. ‘థాంక్యూ అబ్బ’ అని కుక్క పిల్లని బయటికి తీసుకెళ్లి చెట్టుకి కట్టేసి ‘దొంగతనం గురించి సార్‌ నాన్నతో చెప్పలేదు’ అనుకోని హాయిగా కుక్కపిల్లతో ఆడుకుంది.
మరుసటి రోజు తన పుట్టినరోజు కావడంతో కొత్త డ్రెస్‌ వేసుకొని తండ్రి తెచ్చిన చాక్లెట్స్‌ తీసుకొని స్కూల్‌కి వెళ్ళింది. ప్రేయర్‌ అయ్యాక స్టాఫ్‌ రూమ్‌లో పేపరు చదువుతున్న శేఖర్‌ సార్‌ దగ్గరకు వెళ్లి ‘మే ఐ కమిన్‌ సార్‌’ అడిగింది. ‘రా షహనాజ్‌, విష్‌ యు హ్యాపీ బర్త్‌ డే’. ఒక ఫైవ్‌ స్టార్‌ చాక్లెట్‌ సార్‌కి ఇచ్చి ‘థాంక్యూ వెరీ మచ్‌ సార్‌’ అని ఇంకా ఏదో చెప్పబోతున్నట్టు గొణిగింది. ‘ఏంటో చెప్పు షహనాజ్‌’ అన్నారు సార్‌. ‘ఇంకెప్పుడూ బలపాలు, చాక్‌పీస్‌లు తినను సార్‌, దొంగతనం కూడా చేయను. ఇకపై ఎప్పుడూ మీపై కామెంట్‌ చేయను సారీ సార్‌’ అని నాన్నకి చెప్పనందుకు ‘థాంక్స్‌ సార్‌’ అన్నది. ‘సరే’ అని నవ్వుతూ షహనాజ్‌ వైపు చూసి ‘క్లాస్‌కి వెళ్ళు’ అన్నాడు.
‘సరే సార్‌’ అనుకుంటూ తన ఫ్రెండ్స్‌కి చాక్లెట్లు ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ క్లాస్‌కి వెళ్ళింది.

  • శరత్‌ సుదర్శి, 7386046936
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -