భారతదేశ ఆర్థిక వృద్ధిలో వ్యవసాయం ముఖ్యమైనది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక. అయితే విస్తృత ఆర్థిక చర్చలలో గ్రామీణ మహిళల భాగస్వామ్యాన్ని మనం సరిగా గుర్తించడం లేదు. నేడు పరిస్థితులు మారుతున్నాయి. అయినప్పటికి ఓ మహిళను ‘నువ్వేం చేస్తున్నావు’ అంటే ‘ఏమీ లేదు’ అనే సమాధానం వస్తుంది. ఆమె భర్తతో ‘మీ భార్య ఏం చేస్తుంది’ అడిగితే అతను కూడా ‘ఏమీ లేదు’ అనే చెప్తాడు. కానీ ఆమె పాడి పశువులను చూసుకుంటుంది. పొలంలో చురుగ్గా పనిచేస్తుంది. ఇంట్లో ఉంటూనే అనేక వృత్తులు చేసి ఆదాయాన్ని సమకూరుస్తుంది. కుటుంబాన్ని చూసుకుంటూనే ఈ పనులన్నీ చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ కూడా మహిళల నోటి నుంచి ఏండ్లుగా ”ఏమీ లేదు” అనే సమాధానం మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూనే ఉంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్రమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా గ్రామీణ కుటుంబాలు ఆర్థిక పరిస్థితులను తట్టుకొని ఎలా నిలదొక్కుకుంటున్నాయో మనం చూడవచ్చు. ఇందులో మహిళల భాగస్వామ్యం ఎంతో ఉంది. అనేక ఇబ్బందులను ఎదుర్కొని తమ కుటుంబం బలంగా నిలబడడానికి మహిళా శ్రామికశక్తి విశేషంగా సహాయపడింది. దీనికి కారణం ‘బహుళ ఆదాయ వనరులు’. కొత్త ఆర్థిక విధానాల్లో భాగంగా ఇంట్లో ఉండే మహిళలు ఆర్థిక వృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారు. ఒకవేళ మహిళలు వ్యాపార కార్యకలాపాల్లో చురుకుగ్గా పాల్గొనలేకపోతే చాలా కుటుంబాల ఆదాయం గణనీయమైన తగ్గిపోయేది.
పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు
గ్రామాలలో పరిమితమైన వనరులు ఉన్నప్పటికీ అక్కడి మహిళలందరూ తమ భవిష్యత్తు గురించి ఎంతో ఆశతో ఉన్నారు. తమ కుటుంబాలకు తిండి పెట్టడం, విద్యను అందించడం, సంరక్షణ కోసం వారి ప్రణాళికల గురించి స్పష్టంగా ఉన్నారు. వారిని ఎవరైనా కదిలిస్తే వీటన్నింటి గురించి ఎంతో ఉత్సాహంతో పంచుకుంటారు. వాస్తవానికి ఈ సంకల్పం అనేది ఒక అంటువ్యాధి. ఇది ఒకరి నుండి మరొకరికి కచ్చితంగా అంటుకుంటుంది. మహిళలకు తమ కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడం తప్ప వేరే దాని గురించి ఆలోచించడం లేదు. తమ సామాజిక, ఆర్థిక వాస్తవికతను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు. అంటే లక్షలాది మంది మహిళలు కుటుంబ భవిష్యత్తును భద్రపరిచే బాధ్యతను స్వీకరిస్తున్నారు.
మహిళలే ఎక్కువ
రాబోయే కాలంలో శ్రామిక మహిళలు దేశ ఆర్థిక అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించబోతున్నారు. ఆర్థిక లావాదేవీలైన ఆదాయం, ఖర్చులకు సంబంధించి మహిళలు పోషించే పాత్రను మనం స్పష్టంగా చూడవచ్చు. భారతదేశ వ్యవసాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నప్పటికీ విస్తృత ఆర్థిక చర్చలలో గ్రామీణ మహిళల గురించి అసలు చర్చే ఉండడం లేదు. అయితే నేడు పరిస్థితులు మారుతున్నాయి. ఇపీఐసీ వరల్డ్, రీఇమాజినింగ్ లోకల్ ఎకానమీస్ రిపోర్ట్ (2025) ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం 87శాతం మంది ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాలలో ఎక్కువ మంది మహిళలు పాల్గొంటున్నారని నివేదించారు.
నిర్ధిష్ట ఆశయసాధనకు
మనదేశంలో మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా, మహిళా సీఈఓలతో పాటు మహిళా డైరెక్టర్ల బోర్డుల నేతృత్వంలో కోట్లాది విలువైన టర్నోవర్‌లను కలిగి ఉన్న మొదటి మహిళా నేతృత్వంలోని రైతు ఉత్పత్తి కంపెనీలకు నిలయం. సాధారణంగా అక్కడి మహిళలు పురుషుల ముందుకు రావాలంటే తలపై ముసుగు ధరించి ఉంటారు. అలాంటి వారిలో గత 10-15 ఏండ్లుగా చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు తలదించుకుని నిలబడిన ఆ పురుషులతోనే ఆర్థిక విషయాల గురించి చర్చలు జరుపుతున్నారు. వారిలో ఒక నిర్దిష్ట ఆశయసాధనకు ఇది దారితీసింది. గత రెండు దశాబ్దాలుగా సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా మహిళల ఆర్థిక చేరికలో అనేక మార్పులు వచ్చాయి. మహిళా శ్రామిక శక్తిని సిద్ధం చేశాయి.
ఇంట్లో ఉంటూనే
క్షేత్ర స్థాయిలో మనం చూస్తే ప్రసవించిన వారాలలోపే తిరిగి పనిలోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్న యువ తల్లులను మనం చూడవచ్చు. ఇటు ఇంట్లో బాధ్యతలు చూస్తూనే బహుళ ఆర్థిక కార్యకలాపాలలో వివిధ దశల్లో పని చేస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఇంట్లో వుండి చేసే పశుపోషణ, దుకాణాలు, దర్జీ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ విధంగా గ్రామీణ మహిళలు ఇంట్లో ఉంటూనే చేస్తున్న అనేక పనుల ప్రభావం భారతదేశ ఆర్థిక దృశ్యాన్ని పునర్నిర్మిస్తుంది. కొత్త వృద్ధి తరంగాన్ని రేకెత్తిస్తోంది. కనుక ఆదాయ వనరుల వైవిధ్యీకరణకు మహిళలు కీలకం. దీని ఫలితంగా కుటుంబాన్ని వారు మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇపీఐసీ నివేదిక (2024) ప్రకారం, 247 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు బహుళ ఆదాయ మార్గాలు ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతున్నాయి.
కీలక నిర్ణయాల్లో…
ఖర్చులు, పెట్టుబడి వంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారో కూడా మనం తెలుసుకుందాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం, 80శాతం మంది మహిళలు నూతన ఇల్లు కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలలో పాల్గొంటున్నారు. నేడు వ్యవసాయం, కుటుంబ వ్యాపారం, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి ప్రధాన ఖర్చుల చుట్టూ కీలక నిర్ణయం తీసుకోవడంలో కూడా మహిళలు పాల్గొంటున్నారు. తమ పిల్లలను చదువుతోపాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం చేసేందుకు ముందుకువస్తున్నారు. ఇది కేవలం ఒక సామాజిక దృగ్విషయం మాత్రమే కాదు. గత 20 ఏండ్లలో 20 లక్షలకు పైగా ఇండ్లలో ఆర్థిక నిర్ణయం తీసుకునే స్వభావం మహిళల్లో అభివృద్ధి చెందింది. రాబోయే కాలంలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. ఇంత పెద్ద స్థాయిలో ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న మహిళా శ్రమను గుర్తించాలి. ”ఏమీ లేదు” అనే సమాధానం వెనుక దాగి ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలి.
ఆమె ఏమీలేదు అంటే..!?
- Advertisement -
- Advertisement -