నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల డిమాండ్‌కు తలొగ్గి ఎట్టకేలకు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్, పెహల్గాం ఉగ్రదాడి అంశాలపై మోడీ సర్కార్ చర్చకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా మధ్యాహ్నాం 2గంటలకు లోక్ సభ పునర్ ప్రారంభంకాగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ పై చర్చను ప్రారంభించారు. సుదీర్ఘ ప్రసంగం అనంతరం విపక్షాలు పలు ప్రశ్నలను సంధించాయి. ఈక్రమంలో యుద్ధం సమయంలో శత్రవుల ఫైటర్ జెట్లు ఎన్ని ధ్వంసమైయ్యాయని ప్రశ్నను లెవనెత్తాయి. ప్రతిపక్షాల సందేహాలకు స్పందించిన రాజ్ నాథ్ సింగ్ ..ఈ తరహా ప్రశ్నలు అడగకూడదని, దేశ సమైక్యతను, జాతీయ భద్రతను దృష్టాలో ఉంచుకొని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలేమని, ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్న సరైంది కాదని చెప్పారు.
“ప్రతి దేశంలో, పౌరులు ప్రతిపక్షానికి ప్రభుత్వానికి వేర్వేరు విధులను అప్పగిస్తారు. ప్రభుత్వం పాత్ర పౌరుల కోసం పనిచేయడం, ప్రతిపక్ష పాత్ర పౌరులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం. ప్రతిపక్షంలోని కొంతమంది సభ్యులు మన విమానాలలో ఎన్ని కూలిపోయాయో అడుగుతున్నారు? వారి ప్రశ్న మన జాతీయ భావాలను తగినంతగా సూచించడం లేదని నేను భావిస్తున్నాను” అని సింగ్ అన్నారు.పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న ప్రారంభించిన సైనిక చర్య “విజయవంతమైంది” అని చెబుతూ, ఆపరేషన్ సిందూర్‌ను సింగ్ మరింత ప్రశంసించారు.