Wednesday, July 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅది పిశాచి

అది పిశాచి

- Advertisement -

నిజంగా అది ‘సిగాచి’ కాదు. పిశాచి. నాలుగు డజన్లకు పైగా కార్మికుల కుటుంబాలను శోకసముద్రంలో ముంచిపోయింది ఈ రాకాసి ఫార్మా కంపెనీ. రాజకీయుల సంతాపాలైపోయినాయి. పాలకుల సాను భూతి ప్రవచనాలు గుట్టలుగా పోగుబడ్తున్నాయి. కమిషన్లను నియమిం చేసింది రాష్ట్ర సర్కారు. నాయకుల చెక్కర్లు మొదలైనాయి. ముగిసిపోతాయి కూడా. బహుశా క్రమంగా అందరూ మర్చిపోతారులే అనే భ్రమలో పాలకులున్నారు. ఎందుకంటే ఇలా ఎన్నిసార్లు జరగలేదు?! ఈ సారి జులై 9న సార్వత్రిక సమ్మెలో ఈ ఘటన కీలకపాత్ర పోషించబోతోంది. ఎవరెందుకు మర్చిపోతారు? ఎలా మరిచిపోతారు? మృతుల ప్రాణాలకు వెలకట్టడం కూడా ప్రారంభమైంది. దానిలో ప్రధాని పాట రెండు లక్షలట! ఆయన వరకు ఆయన ‘బిచ్చం’ విదిలించేశారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకరిపై ఒకరు బురదేసుకోవడం నడుస్తూనే ఉంది.


ఇంతమంది అయ్యగార్ల మధ్య రొయ్యల బుట్ట ఎలా మాయమైందో తెలీక కార్మికులు నెత్తిపట్టుకుంటున్నారు. పాశమైలారం మీద ఏ దేశం వాడూ బాంబులేయలే. లోపలి నుంచే విస్ఫోటనం జరిగింది. ఎటు చూసినా ఛిద్రమైన శరీర భాగాలు. అది బాంబుల వర్షం కురిసిన ‘గాజాస్ట్రిప్‌’ కాదు. టెహరాన్‌ నగరం కాదు. కాని యుద్ధానంతర మరుభూమిలా మారిపోయిందా ప్రాంతం. కుప్పకూలిన శిథిలాల కింద ఎందరున్నారో లెక్క తేలాల్సి ఉంది. మరణించిన, క్షత గాత్రులైన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.


మూడు పాలకపార్టీల (బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌) నేతల నోళ్లలో నుంచి అసలు విషయం బయటికి రాదు. కార్పొరేట్ల కోసం తాము రచించి, స్పాన్సర్‌ చేసిన విధానమే దీనికి కారణమని పేరంటంలో పిత్తిన ముత్తయిదువుల్లా నోరు విప్పట్లేదు. వీరికి తారక మంత్రం ‘సులభతర వ్యాపారం” విస్తరించడం. ఆశ్చర్యమేమంటే 2020 తర్వాత ప్రపంచ బ్యాంకు ఈ వివరాలు అందించడం ఆపేసింది. అప్పటికి మన దేశ ర్యాంకు 63. ఆనాటి మోడీ గారి మాటేం టంటే దాన్ని 50కి తీసికెళ్లాలని ”ఆయన పంతం” అని ‘మోడీయా’ టాంటాం వేసింది. దానిలో భాగమే అన్ని రకాల ఆంక్షలను తొలగించడం.

ఇదిగాక కార్మికులను ఇష్టారాజ్యంగా నియమించుకోవడం ఎక్కువైంది. అన్ని ఫ్యాక్టరీల్లో తాత్కాలిక కార్మికుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది. కాంట్రాక్టు కార్మికులంటే కొన్నైనా హక్కులుంటాయని నీట్‌ (నేషనల్‌ ఎంప్లాయబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్‌ మిషన్‌) పేర పాశమైలారంలో చాలాచోట్ల ఉన్నారు. అప్రంటీస్‌లు కూడా విచ్ఛలవిడిగా నియమిస్తున్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐలు కూడా లేకుండా గాడిద చాకిరీ చేయించుకుంటున్నారు. దీనికి తోడు తనిఖీలు లేని ‘సౌకర్యాలు’ వెరసి బిలియనీర్లు అధికంగా పెరుగు తున్నారు మన దేశంలో అని ఆక్స్‌ఫామ్‌ నివేదిక కూడా చెప్పింది.


కొత్త విధానంతో తనిఖీలన్నీ ఆగిపోయాయి. కార్మిక శాఖ తనిఖీలే కాదు, ఫ్యాక్టరీల శాఖ తనిఖీలూ ఆగి పోయాయి. దాంతో జరిగే ప్రమా దాలకు అంతే లేకుండాపోయింది. కార్మి కులే కాదు, కొన్ని సందర్భాల్లో అధి కారులు సైతం ప్రమాదాల్లో మరణి స్తున్నారు. తనిఖీలు సరిగా ఉండి ఉంటే, అంటే ఈ కార్పొరేట్‌ల అనుకూల విధానాలు లేకపోయుంటే తమ తోటి కార్మికులు సజీవంగా ఉండేవారని భోరుమంటు న్నారు ఆ కంపెనీ కార్మికులు. వారి గోడు జులై 9 దేశవ్యాపిత సమ్మెలో ప్రతి ధ్వనించాలి. కార్మికుల సంఖ్య ఆధారంగా లోరిస్క్‌, హైరిస్క్‌, మిడిల్‌ రిస్క్‌ కంపెనీలుగా విభజించడం ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ చేసిన బ్లండర్‌. ఆ రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఆధారంగా తనిఖీలు చేసే గడువు విధించడం తీవ్రమైన లోపం. ఈ విషయంలో కార్మిక సంఘాలు కేంద్రీకరించి పని చేయాలి. గతంలో కార్మిక సంఘాలు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేయాలన్న నిబంధన నేడు లేదు. సదరు యంత్రం బాగోగులు అక్కడ పనిచేసే కార్మికులకు తెల్సినంతగా మరొకరికి తెలియవు. అందుకే పెట్టుబడులపై ఎగబడటం కాకుండా కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్ధపెట్టాలి. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ విధానాన్ని అర్జంటుగా తొలగించాలి.


ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ తెస్తున్న లేబర్‌ కోడ్‌లను అర్థం చేసుకోవాలి. ఇంత ప్రమాదకర మందులు తయారు చేసే ఫ్యాక్టరీ లో అంబులెన్స్‌లు లేవు. కొన్ని పరిశ్రమల క్లస్టర్ల మధ్యలో నైనా అంబులెన్స్‌లు, దానిలో శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలి. బాయిలర్లు, ఫర్నేసుల వద్ద శిక్షణ పొందిన క్వాలిఫైడ్‌ సిబ్బంది ఉండటం లేదు. అన్‌పఢ్‌ వలస కార్మికులతో పనిచేయించుకోవడం యాజమాన్యాలకు రివాజుగా మారింది. అయిన కాడికి లాభాలు దండుకోవడానికి మరిగిన వారు ఏం చేస్తారు మరి!


పెట్టుబడి ఒక పిశాచని ఎంత అధ్యయనం చేస్తే ప్రపంచానికి చెప్పగలిగాడు మార్క్స్‌ తన క్యాపిటల్‌ గ్రంథం ద్వారా. ”ఒక పది శాతం లాభం తప్పనిసరిగా (ఆ పెట్టుబడిని) ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడ్తుంది. 20 శాతం లాభం వస్తుందంటే దానికి ఉత్సుకత వస్తుంది… వంద శాతం లాభం వచ్చేట్లయితే అన్ని మానవహకులనూ కాళ్లకింద నలిపేస్తుంది. 300 శాతం లాభం గ్యారంటీ వుంటే ఎంతటి దారుణాలకైనా అది దిగజారుతుంది.. చివరికి తన యజమానిని ఉరేయడానికైనా అది వెనుకాడదు” అన్నాడు మార్క్స్‌. ‘సిగాచి’ని 1867లోనే మార్క్స్‌ అధ్యయనం చేసినట్టున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -