నవతెలంగాణ-హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక రైతులు ఆయనపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించి, తమ నిరసనను వినూత్నంగా తెలియజేస్తున్నారు. మరోవైపు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేయడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది.
ఈ పరిణామాలపై వరంగల్‌లో కడియం శ్రీహరి స్పందించారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. “ఎన్నికల్లో ప్రజలకు అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చాను. వారు నన్ను నమ్మి గెలిపించారు. కానీ, బీఆర్ఎస్ ఓడిపోవడంతో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించాను. అందుకే అధికార పార్టీతో కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని అనుకున్నాను” అని ఆయన వివరించారు.
గత ఏడాదిన్నరగా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని, తన విజ్ఞప్తి మేరకు దేవాదుల కాల్వల మరమ్మతులకు, ఇతర అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచి నిధులు కూడా మంజూరు చేశారని కడియం శ్రీహరి తెలిపారు. అయితే, ఆయన వివరణతో బీఆర్ఎస్ శ్రేణులు ఏకీభవించడం లేదు. కడియం ప్రజాతీర్పును అవమానించారని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. నియోజకవర్గంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికంగా కడియం శ్రీహరిపై ఒత్తిడి రోజురోజుకు పెరుగుతోంది.