– పత్తికి ఎంఎస్పీ క్వింటాకు రూ.10,075 ప్రకటించాలి
– ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారమివ్వాలి : ఎస్కేఎం నేతల డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ముడిపత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం నేతలు రాకేశ్ తికాయత్, హన్నన్ మొల్లా, రాజన్ క్షీరసాగర్, ప్రేమ్ సింగ్ గెహ్లావత్, పి.కృష్ణప్రసాద్ మాట్లాడారు. పత్తికి ఎంఎస్పీ సి2ం50 శాతంతో క్వింటాలుకు రూ.10,075 చొప్పున ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున పరిహారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి నష్టం చేసే ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్టీఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసే నోటిఫికేషన్ పత్రాలను దహనం చేయాలని పిలుపునిచ్చారు. పత్తి పండించే గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించి, సీ2ం50 శాతం ఎంఎస్పీకి తీర్మానాలను గ్రామసభల్లో ఆమోదించాలని సూచించారు. మండల స్థాయిలో మహాపంచాయతీలు నిర్వహించాలని, పార్లమెంట్ సభ్యుల కార్యాలయాలకు, నివాసాలకు మార్చ్‌లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఎస్కేఎం ప్రతినిధులు విదర్భలో పర్యటించనున్నారు.
1991 నుంచి వ్యవసాయాన్ని ప్రభావితం చేసే నయా ఉదారవాద సంస్కరణలు అమలు చేసిన తరువాత అప్పుల కారణంగా రైతు ఆత్మహత్యలు సర్వసాధారణంగా మారాయని నేతలు తెలిపారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఇప్పటివరకు 4.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం అటువంటి డేటాను నిర్వహించే బాధ్యత నుంచి విరమించుకుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వంలో రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, కానీ గత 11 ఏండ్లుగా మోడీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి రుణ మాఫీ పథకాన్ని అందించలేదని పేర్కొన్నారు. అయితే రూ.16.11లక్షల కోట్ల కార్పొరేట్ రుణాన్ని మాత్రం రద్దు చేసిందని తెలిపారు. 2025 మార్చి-ఏప్రిల్ రెండు నెలల్లోనే మహారాష్ట్రలో 479 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయని మంత్రి మకరంద్ జాదవ్ 2025 జులై 4న రాష్ట్ర శాసనసభకు తెలియజేశారని గుర్తు చేశారు. 2025 మార్చిలో మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలలో 250 ఆత్మహత్యలు జరిగాయని మంత్రి తెలుపారన్నారు. 2025 ఏప్రిల్‌లో రాష్ట్రంలో 229 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయని అన్నారు. 2014 నుంచి నష్ట పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎస్కేఎం డిమాండ్ చేస్తోందని తెలిపారు.