హైదరాబాద్‌లో సీఐ జలంధర్‌రెడ్డి, సీసీఎస్ బృందం సభ్యుల సహకారం
నవతెలంగాణ -కల్వకుర్తి
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పలు ఇండ్లల్లో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జైలులో ఉన్న అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డిని విచారించేందుకు కల్వకుర్తి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ సమయంలో నాగిరెడ్డి నవంబర్ 13న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దీంతో ముగ్గురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి నాగిరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌లో సీఐ జలంధర్‌రెడ్డి, సీసీఎస్ బృంద సభ్యుల సహకారంతో సోమవారం రాత్రి అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డిని అరెస్టు చేసి కల్వకుర్తి పోలీసులకు అప్పగించారు. ఇతను దాదాపు 45 కేసులలో నిందితుడిగా ఉన్నాడు. మద్యం మత్తులో కారు నడిపి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టి భార్యాభర్తల మృతికి కారణమైన నాగిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.



