Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఅసలు సిసలు ఎన్నిక...

అసలు సిసలు ఎన్నిక…

- Advertisement -

రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను హననం చేసే కుయుక్తులు ఓ వైపు.. వాటిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న శక్తులు మరోవైపు… ఈ రెండింటి పోరులో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే అంశాలను పక్కన బెడితే ఈ రెంటిలో ఎవరు ఎటు నిలబడ్డారనేది కీలకం. గత లోక్‌సభ ఎన్నికల్లో నియంతృత్వ మోడీ సర్కారును గద్దె దించేందుకు ఏకమైన వివిధ పార్టీలు ఇండియా బ్లాక్‌గా ఏర్పడి పోరాడాయి. నయా ఫాసిజపు పోకడలున్న ఎన్డీయే కూటమిని అధికారం నుంచి దింపలేక పోయినా, దాని సీట్ల సంఖ్యను మాత్రం ఇండియా బ్లాక్‌ గణనీయంగా తగ్గించ గలిగింది. అదే విశ్వాసం, అదే నమ్మకంతో ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ బిడ్డ, తెలుగువాడైన జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని తమ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా బ్లాక్‌ ప్రకటించింది.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే గత నెల 21న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ తన పదవికి రాజీనామా చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఆ పదవికి ఎన్నిక అనివార్యమైంది. అనారోగ్య సమస్యల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నానని ధన్‌కర్‌ ప్రకటించినప్పటికీ అసలు కారణాలు వేరే ఉన్నాయనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారం పైనా, ఆయనపై రాజ్యసభలో ప్రతిపాదించిన అభిశంసన తీర్మానంపైనా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌ అభిశంసన కోసం తన ముందుకు వచ్చిన లేఖపైనా సభలో స్పందించటమే ఆయన కొంపముంచింది. వర్మ, యాదవ్‌లపై వచ్చిన అభిశంసనల తీర్మానాలకు సంబంధించి యాభై మంది సభ్యుల మద్దతుంటే ముందుకు వెళతానంటూ విస్పష్టంగా ప్రకటించటమే ధన్‌కర్‌కు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ రెండు తీర్మానాలను ప్రకటించిన వెంటనే ఆయన సభ నుంచి వెళ్లిపోవటం గమనార్హం. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ధనకర్‌ ప్రకటించటం… ఈ రెండు ఘటనల మధ్య ఏం జరిగిందనేది భారత రాజకీయాల్లో జరుగుతున్న విచిత్ర, విపత్కర పరిణామాలకు పరాకాష్ట. ఆ తర్వాత ధన్‌కర్‌ ఎక్కడున్నారో చెప్పాలంటూ శివసేన ఎంపీ సంజరు రౌత్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాయటం… ధన్‌కర్‌ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
భారత అత్యున్నత చట్ట సభ అయిన రాజ్యసభ అధ్యక్షుడికే ఇంతటి అవమానం జరిగిన క్రమంలో… ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం మాటేమిటి? అసలు ఈ పదాలను మోడీ సర్కారు పరిగణనలోకి తీసుకుంటుందా? సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తూ, వాటిని మున్సిపాల్టీలకంటే అధ్వాన్నంగా మార్చిన బీజేపీ, దాని పరివారం… నిధులివ్వాలని అడిగితే మేం చెప్పినట్టే నడుచుకోవాలి, మేం చెప్పిన పద్ధతుల్లోనే పథకాలను అమల్జేయాలి, లేదంటే మీకు ఒక్క పైసా కూడా ఇవ్వమంటూ రాష్ట్రాల మెడమీద కత్తి పెట్టటం అత్యంత దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం. పొద్దున లేస్తే హిందూ మతం, హిందూ ధర్మం ప్రమాదంలో పడ్డాయంటూ ఊదర గొట్టే కాషాయ నేతలు… ఈ దేశాన్ని రెండొందల ఏండ్లపాటు బ్రిటీష్‌ వారు, అంతకుముందు ఎంతోమంది ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఆ మతం ప్రమాదంలో పడలేదనే విషయాన్ని అంగీకరిస్తారా? మరి ఇప్పుడు అసలైన హిందువునని చెప్పుకునే మోడీ హయాంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందంటూ గగ్గోలు పెట్టటం దేనికి సంకేతం…? నిత్యజీవిత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి, పబ్బం గడుపుకోవాలన్నదే మోడీ ఎత్తుగడ. అందులో భాగంగా ఏం మాట్లాడేందుకైనా, ఏం చేయటానికైనా ఆయన పరివారం సిద్ధం.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే వచ్చిన ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు ఇండియా బ్లాక్‌కు ప్రతిష్టాత్మకం. దేశానికి, ప్రజలకు అత్యంత కీలకం. పార్లమెంటు, రాజకీయ విలువలు జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వేళ… కార్పొరేట్లు, మతోన్మాదుల గొలుసు కట్టు బంధపు విష కౌగిలిలో దేశం నలిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకునేందుకు ఇండియా బ్లాక్‌ తన ప్రతినిధిగా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని బరిలోకి దింపింది. 1988 నుంచి ఇప్పటిదాకా 37 ఏండ్లపాటు న్యాయవాద వృత్తిలో అపార అనుభవం గడించిన ఆయన్ను దేశ ఉపాధ్యక్షుడి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసుకోవటం ముదావహం. హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌ నుంచి సుప్రీంకోర్టు అదనపు న్యాయమూర్తి వరకు అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి వెలువరించిన పలు తీర్పులు మానవ హక్కులు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలకు చిరపరిచితులైన ఆయనకు ఆత్మప్రబోధానుసారం ఓటేసి, గెలిపించటం తెలంగాణ, ఏపీలోని ఎంపీలందరి విద్యుక్త ధర్మం. ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగ పరిరక్షణకు అది అత్యంత ఆవశ్యకం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad