నలుగురు మృతి..నిర్మాణదశలో ఉన్న నాలుగు అంతస్తులు..
ఫీటర్‌మార్టిజ్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలో నిర్మాణంలో ఉన్న ఆలయం కుప్ప కూలిన ఘటనలో భారత సంతతికి చెందిన ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, నిర్మాణ ప్రాజెక్టు మేనేజర్ విక్కీ జైరాజ్ పాండే (52) సహా నలుగురు చనిపోయారు. క్వాజులు నాటల్ ప్రావిన్స్‌లోని వెరులంలో రెడ్‌క్లిప్ వద్ద ఈ ఘటన గత శుక్రవారం చోటుచేసుకుంది. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారనే విషయంపై స్పష్టతలేదన్నారు. దీంతో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి శని, ఆదివారాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. టన్నులకొద్దీ శిథిలాలు ఉండటంతో.. వాటిని తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. ఇక్కడ స్థిరపడిన ఒక హిందూ కుటుంబం ‘న్యూ అహోబిలం’ పేరుతో నాలుగు అంతస్థుల ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. నిర్మాణ పనుల కొనసాగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో కార్మికులు, పలువురు ఆలయ అధికారులు విధుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.



