Thursday, February 12, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపొరాటాల కొనసాగింపే.. నేటి అఖిల భారత సమ్మె

పొరాటాల కొనసాగింపే.. నేటి అఖిల భారత సమ్మె

- Advertisement -

మన దేశ చరిత్రలో అఖిల భారత ప్రధాన సమ్మెలు కొత్తవి కావు. వేతనాల పెంపుదల, పని గంటలు, కార్మిక చట్టాల రక్షణ కోసం శ్రామిక వర్గం ఎన్నోసార్లు సమ్మెబాట పట్టింది. ఇవన్నీ శ్రామిక వర్గపు చైతన్యాన్ని ముందుకు నడిపే ప్రాముఖ్యత గల పోరాటాలే. నేడు జరగబోయే అఖిల భారత సమ్మె ఆ పోరాటాల కొనసాగింపే. కానీ, ఆ కొనసాగింపులోనే ఒక నిర్ణయాత్మక మలుపు కూడా.. ఎందుకంటే ఈ సమ్మె జరుగుతున్నది ఒక సాధారణ కాలంలో కాదు. దేశం నేడు తీవ్రమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభంలోకి కూరుకు పోయింది. పాలక వర్గాలు అనుసరించిన కార్పొరేట్‌ – పక్షపాత విధానాల కారణంగానూ, మనువాద భావజాలంతో ముడిపడ్డ కమ్యూనల్‌ రాజకీయాలే అందుకు కారణం. ఉత్పత్తి వర్గాల శ్రమ పెరుగుదల ఈ సంక్షోభానికి అసలైన మూలం. వ్యవసాయం, పరిశ్రమలు అపార సంపదను సష్టించాయి. కానీ, ఆ సంపద ప్రజల చేతుల్లో నుంచి దోపిడీకి గురై కొద్దిమంది కార్పొరేట్ల చేతుల్లోనే కేంద్రీకతమైంది. ఈ ఆర్థిక అసమానతలను దాచిపెట్టేందుకు మోడీ ప్రభుత్వం కులం,మతం పేరుతో ప్రజలను చీల్చే కమ్యూనల్‌ విభజన చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది.

గత సమ్మెల్లో ప్రధానంగా ”ఈ విధానాన్ని మార్చండి” అనే డిమాండ్‌ ఉంది. నేడు ఆ ప్రశ్న అక్కడ ఆగడం లేదు. ప్రశ్న దేశ దిశ మీద, రాజ్య స్వభావం మీద నిలబడింది. మోడీ ప్రభుత్వం చేస్తున్నది సంస్కరణ కాదు, ఇది ఒక సంపూర్ణ రాజకీయ ప్రాజెక్టు. కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలు జాతీయ ఉద్యమ ఆకాంక్షల వారసత్వంగా త్యాగాలతో సాధించుకున్న హక్కులు, రక్షణలు, చట్టాలను ఒక్కొక్కటిగా కాదు, మొత్తం వ్యవస్థనే రద్దు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. కార్మిక చట్టాల రద్దుతో ప్రారంభమైన ఈ దాడి లేబర్‌ కోడ్స్‌, ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం, విద్యుత్‌, విత్తన బిల్లు లు, వ్యవసాయంపై కార్పొరేట్‌ ఆధిపత్యానికి దారివేసే విధానాల వరకు విస్తరించింది.ఇవి విడివిడిగా జరిగిన చర్యలు కావు. ఇవి సంక్షోభాన్ని ప్రజల మీద మోపే, కార్పొరేట్లను కాపాడే, మనువాద ఆధిపత్యాన్ని బలపరచే ఒకే రాజకీయ వ్యూహంలోని భాగాలు. ఈ సంక్షోభానికి సమాధానంగా ప్రజల సంక్షేమాన్ని విస్తరించాల్సిన చోట, మోడీసర్కార్‌ ప్రజల మీదే యుద్ధం ప్రకటించింది.
ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ఈ యుద్ధ ప్రకటనకు అధికారిక ముద్ర వేసింది. గ్రామీణ పేదలకు ఖర్చు ”భారం”గా, కార్పొరేట్‌ లాభాల పరిరక్షణను ”జాతీయ కర్తవ్యంగా” చూపించింది.అంటే విషయం స్పష్టం. ఈ సంక్షోభానికి కారణం పాలక వర్గాల విధానాలైతే, దానిభారం మోయాల్సిందిగా నిర్ణయిం చబడింది ప్రజలేనని.గత సమ్మెల్లో శ్రామిక వర్గం తన జీవన పరిస్థి తులపై పోరాడింది. ఈ సమ్మెలో శ్రామికవర్గం దేశ భవిష్యత్తు, రాజ్య స్వభావం కోసం పోరాడుతోంది. లొంగిపోయి బానిసలుగా మారాలా? లేదా సంక్షోభాన్ని సష్టించిన విధానాలనే ఎదిరించి దేశాన్ని కాపాడుకోవాలా? ఈ ప్రశ్నకు శ్రామిక వర్గం సమిష్టిగా ఇచ్చే సమాధానమే ఫిబ్రవరి 12 అఖిల భారత జనరల్‌ సమ్మె.

ఇటీవలి పార్లమెంట్‌ సమావేశాలు ఈ దాడికి మరింత స్పష్టమైన ముద్రవేశాయి. చర్చ లేకుండా, ప్రజా వ్యతిరేక స్వరాలు వినిపించకుండా, వినాశకారక విధానాలను ఒకటి తర్వాత ఒకటి ఆమోదింపజేశాయి. కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్స్‌, వ్యవసాయంపై కార్పొరేట్‌ ఆధిపత్యాన్ని బలపరిచే నిబంధనలు, విద్యుత్‌, విత్తనాలపై ప్రజా నియంత్రణను బలహీనపరిచే బిల్లులు. ఇవన్నీ పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య వేదికగా కాకుండా కార్పొరేట్‌ ఆదేశాలకు అచ్చువేసే యంత్రంగా మార్చిన విధానాలే. అలాగే పార్లమెంట్‌లో ఆమోదం కోసం తెచ్చిన విద్యుత్‌ బిల్లు గ్రామీణ ప్రజలపై మరో దాడి.ఉచిత కరెంట్‌కు స్వస్తి పలకడం, సబ్సిడీలు ఆర్థికభారంగా ప్రకటించడం, విద్యుత్‌ను ప్రయివేటు సరుకుగా మార్చడం ఈ బిల్లు ఉద్దేశం. వ్యవసాయానికి ఉచిత లేదా సబ్సిడీ కరెంట్‌ లేకపోతే పంట సాగు అసాధ్యం. సాగు లేకపోతే పనిలేదు. పని లేకపోతే గ్రామాల్లో జీవితం లేదు. విద్యుత్‌ ప్రయివేటీకరణ అంటే గ్రామాలను చీకట్లోకి నెట్టడం. ఇది అభివద్ధి కాదు, గ్రామీణ సమాజాన్ని ఖాళీ చేసే విధానం.

హక్కు నుంచి..భిక్షగా ‘ఉపాధి’
2005లో అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ పేదలకు చిన్న ఉపశమనం కాదు. గ్రామీణ శ్రమపై శతాబ్దాలుగా సాగుతున్న చరిత్రాత్మక దోపిడీకి ఇది ఒక పరిమిత రాజకీయ అడ్డుకట్ట. ఈ చట్టం కింద ఇప్పటివరకు రూ.9.98 లక్షల కోట్లకు పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయాల్సి వచ్చింది. దాని ద్వారా 4700 కోట్ల పనిదినాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించబడ్డాయి. ఈ పనిదినాల్లో 52 నుంచి 58 శాతం మహిళలే పనిచేశారు. 36 శాతం వరకు ఎస్సీ-ఎస్టీలు భాగస్వాములయ్యారు. అందరూ ఒకే పనిలో కలిసి పనిచేసే పరిస్థితి చేయడం, గ్రామీణ శ్రామికుల మధ్య వర్గ ఐక్యతకు దారితీసింది.ఇదే మనువాద వ్యవస్థకు కంటగింపుగా మారింది. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత ఉపాధి చట్టాన్ని నేరుగా రద్దు చేయలేకపోయినా,నిర్వీర్యం చేయడం ప్రారంభించింది. నిధులు కత్తిరించింది. పనిదినాలు తగ్గించింది. వేతనాలు ఆలస్యం చేసింది. చివరికి 2025 నాటికి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, విబిజిరామ్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. చట్టం గ్రామీణ పేదలకు దయగా కాకుండా హక్కుగా ఉండేది. కానీ, కొత్త పథకంలో ఉపాధి హక్కులేదు, పనిదినాల హామీలేదు, వేత నానికి చట్టబద్ధ రక్షణ లేదు. అంటే, పని ఇవ్వకపోయినా ప్రభుత్వానికి బాధ్యత లేదు. పేదలు ప్రశ్నించడానికి ఏ ఆయుధం మిగలదు. ఇందులో కీలక మార్పు – ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ బాధ్యత నుంచి రాష్ట్రాలపై నలభై శాతం భారం మోపే కేంద్ర స్పాన్సర్డ్‌ స్కీమ్‌గా మార్చింది. అంటే, పేదల ఉపాధి భద్రతను రాష్ట్రాల ఆర్థిక స్థితిపై ఆధారపెట్టడం. ఇది హక్కు నుంచి భిక్షగా మార్చే ప్రక్రియ. గత కొన్ని దశాబ్దాల్లో గ్రామాల్లో ఒక నూతన ధనిక వర్గం ఎదిగింది. మోడీ పాల నలో ఈ వర్గం ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా బలపడింది. ఈ వర్గానికి ఉపాధి హామీ చట్టం ఒక అడ్డంకి. ఎందుకంటే అది కార్మికులను పూర్తిగా వారి ఆధీనంలో ఉండనివ్వలేదు. అందుకే ఈ వర్గాన్ని సంతప్తిపరచడానికే మోడీ ప్రభుత్వం ఉపాధి హామీని తుంగలో తొక్కింది. ఈ ఆర్థిక దాడికి హిందుత్వాన్ని రాజకీయ కవచంగా వాడుతున్నది. ఉపాధి ప్రశ్న రాకుండా చేయడానికి మతం, కులం పేరుతో గ్రామీణ పేదలను చీల్చుతున్నది.

సంక్షోభంలో గ్రామీణ పేదలు
గ్రామీణ ప్రాంతాల్లో నేడు కనిపిస్తున్న సంక్షోభం ఆదాయలు పడి పోవటమే కాదు, ఇది జీవించడానికి అవసరమైన మౌలిక గౌరవాల సంక్షోభం. ఇల్లు, చదువు, వైద్యం- ఈ మూడు లేకపోవడమే వారిని అత్యవసర పరిస్థితికి నెట్టబడింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఇటీవలి గణాంకాలు మరింత కఠినంగా బహిర్గతపరిచాయి. మొదటిసారిగా రైతుల కన్నా గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఏడాదిలోనే సుమారు 5,600 మంది రైతులు, అదే సమయంలో ఆరువేల మందికి పైగా గ్రామీణ పేదలు, కూలీలు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. గ్రామీణ పేదలు ఎందుకు మరణం అంచుకు నెట్టబడ్డారు? కోట్లాది కుటుంబాలకు స్వంత ఇల్లు లేదు. ఉన్నచోట్ల చెదిరిన గోడలు, లీకుల పైకప్పులు, నీరు, పారిశుద్ధ్యం లేని స్థితి. కేంద్ర ప్రభుత్వం ”ఇళ్లు ఇచ్చాం” అని సంఖ్యలు చూపుతుంది. కానీ ఆ ఇళ్లు ఉపాధి లేని ప్రాంతాల్లో, వైద్యం-చదువు లేని చోట్ల కేవలం కాంక్రీట్‌ పెట్టెలుగా మిగులుతున్నాయి. ఐక్య రాజ్యసమితి(యుఎన్‌ఓ) చెప్పే ”గౌరవనీయ నివాసం” అంటే కేవలం నాలుగు గోడలు కాదు. నీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, చదువు, వైద్యం, ఉపాధికి చేరువలో ఉండే ఇల్లు. ఈ ప్రమాణాలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. ఎందుకంటే ఇవి గ్రామీణ పేదలకు హక్కులుగా కాదు, దయగా ఇవ్వబడుతున్న పథకాలుగా మారాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు ఖాళీగా ఉన్నాయి.డాక్టర్లు లేరు, ఔషధాలు లేవు, ప్రయివేటు వైద్యం మాత్రం పేదలకు అప్పుల గోతిగా మారింది. ఒక అనారోగ్యం ఒక కుటుంబాన్ని పూర్తిగా అప్పుల్లోకి నెట్టే స్థితి. ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యం చేయబడ్డాయి. దీంతో చాలామంది ప్రయివేటును ఆశ్రయిస్తున్న దుస్థితి. కానీ, గ్రామీణ పేదలకు ఈ ఖర్చు భరించలేనిది. చదువులేక, ఉపాధి అవకాశాలు లేక గ్రామీణ యువతకు వలసబాట పడుతోంది. పట్టణాలకు వెళ్లిన గ్రామీణ పేదలు చౌకకూలీలుగా మారుతున్నారు. తక్కువ వేతనాలు, అస్థిర పనులు, అనారోగ్య జీవితం – ఇదే వారి ”నగర భవిష్యత్తు”. అంటే గ్రామాల్లో ఉపాధి, ఇల్లు, చదువు, వైద్యం నాశనం చేసి ప్రజలను పట్టణాలకు నెట్టడం ఈ పాలన విధానం.

దేశంపై టారిఫ్‌ల విపత్తు
ఇప్పటికే ఉపాధి సంక్షోభం, ఆహార భద్రతకు ముప్పు, భూములు – వనరుల దోపిడీతో గ్రామీణ పేదల జీవితం అంచుల మీద నడుస్తున్న వేళ మోడీ ప్రభుత్వం మరో విపత్తును తెచ్చింది. అది – అమెరికాతో కుదుర్చుకున్న టారిఫ్‌ (వాణిజ్య) ఒప్పందం. ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు, గ్రామీణ ప్రజల మీద ఇప్పుడు అంతర్జాతీయ దోపిడీ భారం కూడా పడబోతోంది. ఈ ఒప్పందం పేరు వాణిజ్యం. దాని అసలు అర్థం మాత్రం భారత గ్రామాల తలుపులు అమెరికా కార్పొరేట్‌ వ్యవసాయానికి తెరవడం. అమెరికా ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది. భారత మార్కెట్‌లోకి అమెరికన్‌ పంటలు, పాలు, పత్తి, సోయాబీన్‌ ఆయిల్‌ ఎక్కువగా ఎగు మతి చేస్తామని. మరి భారత రైతుల పరిస్థితి? గిట్టుబాటు ధర లు కూలిపోతాయి. ఎంఎస్‌పి, ప్రభుత్వ కొనుగోళ్లు ”వాణిజ్యానికి అడ్డంకి”గా మార తాయి. స్థానిక మార్కెట్లు విదేశీ సరుకులతో నిండి పోతాయి. గ్రామీణ ఉపాధి మరింత క్షీణిస్తుంది. ఇది కేవలం రైతన్న ల సమస్య కాదు. ఇది వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీల జీవన ప్రశ్న. ధరలు పడిపోతే పంట సాగు తగ్గుతుంది. సాగు తగ్గితే పని దినాలు తగ్గుతాయి. పని దినాలు తగ్గితే ఆకలి పెరుగుతుంది. అంటే, అమెరికా టారిఫ్‌ ఒప్పందం గ్రామీణ పేదల కంచంలోని బువ్వను నేరుగా తీసేసే విధానం. ఇదంతా జరుగుతున్న వేళ మోడీ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. సార్వభౌమాధికారంపై ప్రజల జీవనాధారాలపై ఇంత పెద్ద దాడి జరుగుతున్నా పార్లమెంట్‌లో నిజాలు చెప్పే ధైర్యం లేదు. ఇది వాణిజ్య ఒప్పందం కాదు. ఇది జనజీవనాన్ని అతలాకుతలం చేసే సంక్షోభం.

అందుకే, మోడీ సర్కార్‌ వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడాలి. నేటి సమ్మెలో గ్రామీణ శ్రామిక వర్గం ఐక్యమై తమ వంతుగా నడుం బిగించాలి. ఈ సమ్మె ఆర్థిక పోరాటం కాదు, మనకాలపు జీవన మార్గపు పిలుపు. ఇది మనందరి కర్తవ్యం. నియంత పోకడల్ని, అంధకారంలోకి నెట్టే నిరంకుశపు చట్టాల్ని, కూకటి వేళ్లతో పెకిలించాల్సిన ఆవవ్యతకతను చరిత్ర మనకు అందచేసిన అతిపెద్ద బాధ్యత.

బి.వెంకట్‌
9490098045

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -