కార్మికుల్ని కట్టుబానిసలు చేసేందుకే 4 లేబర్‌కోడ్‌లు
హక్కుల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ
ప్రత్యామ్నాయ విధానాలపై కార్మికుల్లో రాజకీయ చైతన్యం
సీఐటీయు రాష్ట్ర 5వ మహాసభల సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో ‘నవతెలంగాణ’ ప్రత్యేక ఇంటర్య్వూ
పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఒక్క కలంపోటుతో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లు తెచ్చింది. ఫలితంగా కార్మిక వర్గ హక్కులకు ఎన్నడూ లేని రీతిలో భంగం వాటిల్లుతోంది. కార్మిక పక్ష పాతులుగా నిలవాల్సిన ఓ వర్గం మీడియా యాజమాన్యాల కొమ్ముకాస్తూ, మోడీ భజనను విశ్వవ్యాప్తం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ దుర్నీతిని అడ్డుకొని, తిప్పికొట్టాల్సిన బాధ్యత యావత్ కార్మికలోకంపై ఉంది. ‘పోరాడితే పోయేదేం లేదు..బానిస సంకెళ్లు తప్ప’ అనే శ్రామికవర్గ జగన్నినాదం కార్మికుల ఐక్యతకు ఆయుధంగా నిలవాలి. ఆ దిశగానే సీఐటీయూ రాష్ట్ర ఐదవ మహాసభలు ఈ నెల 7నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో ‘నవతెలంగాణ’ ప్రతినిధి ఎస్ వెంకన్న ప్రత్యేక ఇంటర్య్వూ..
నవతెలంగాణ : నాలుగు లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకు ఎలాంటి నష్టం ఉంటుంది?
పాలడుగు భాస్కర్ : మూడోసారి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను దుందుడుకుగా అమలు చేస్తున్నది. కార్మిక వర్గం దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. అప్ర జాస్వామికంగా నాలుగు లేబర్‌కోడ్ లను తెచ్చింది. ఇవన్నీ పూర్తిగా పెట్టుబడిదారులు, కార్పొరేట్ల లాభాలను రెట్టింపు చేయడం కోసం ఉద్దేశించినవే. సంపద సృష్టికర్తలైన కార్మికవర్గ ప్రయోజనాలను కాలరాచేలా లేబర్‌కోడ్‌లు ఉన్నాయి. వీటి అమలు వల్ల కార్మికుల నిజవేతనాలు పడిపోతాయి. పని భారం పెరుగుతుంది.
రాష్ట్రంలో పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వేరైనా, వాటి ఆర్థిక విధానాలు ఒక్కటే. సిరి పూర్ పేపర్ మిల్లును ప్రయివేటుకు అప్ప జెప్పారు. ములుగు జిల్లా కమలాపూర్ లోని ఏపీ ర్యాన్ అనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మూతపడింది. బోధన్‌లో నిజాం షుగర్స్ స్క్రాప్‌తో సహా మొత్తం అమ్మేశారు. వీటన్నింటిని పునరుద్దరిస్తామని అన్ని పార్టీలు ఎన్నికల వాగ్దా నాలు చేశాయి. ఒక పార్టీ తర్వాత మరో పార్టీకి అదికార మార్పిడి జరిగినా, ఆ హామీలేవీ అమ ల్లోకి రాలేదు. నిరుద్యోగం పెరిగి, పని కోసం పోటీ పడే వారి సంఖ్య పెరుగు తుంది. కార్మికుల బేర సారాల శక్తి తగ్గిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సహా బూర్జువా పార్టీలన్నింటిదీ కార్మికవర్గానికి వ్యతిరేక మైన ఆర్ధికవిధానాలే. ఈ విషయాలను దేశ, రాష్ట్ర కార్మికవర్గం గుర్తించాలి. ప్రత్యామ్నాయ రాజకీయ, ఆర్థిక విధానాలకు అండగా నిలవాలి. వారి భవిష్యత్‌కు వారే దారులు వేసుకోవాలి.
శ్రమజీవుల్లో మహిళల భాగస్వామ్యం ఎలా ఉంది?
రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది కార్మికులున్నారు. వారిలో పర్మినెంట్ ఉద్యోగులు నామమాత్రమే. ఎక్కువగా కాంట్రాక్టు, క్యాజువల్, ట్రైనీ, ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లారుమెంట్, పీస్‌రేటు, లాంగ్‌టర్మ్ అప్రెంటీస్ వంటి అనేక పేర్లతో కార్మికులు పనిచేస్తున్నారు. ఫార్మా, ల్యాబ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్స్ తదితర రంగాల్లో 60 శాతానికిపైగా మహిళా కార్మికులే పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో పనిచేసేవారిలోనూ మహిళలే ఎక్కువ. వారికి గౌరవవేతనమే తప్ప, ఉద్యోగ భద్రత లేదు. మహిళా శ్రామిక శక్తి అన్ని రంగాల్లోకీ విస్తరిస్తున్నది. నిత్యవసర వస్తువులు సహా అన్నింటి ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో కార్మికుల జీతాలు పెరగలేదు. దీనితో అనివార్యంగా మహిళలు కార్మికులు, ఉద్యోగులుగా మారక తప్పట్లేదు. ఈ సందర్భంగా పని ప్రదేశాల్లో వారు అనేక వివక్షలకు గురువుతున్నారు.
కనీస వేతనాల జీవోల జారీ కోసం సీఐటీయు ఎలాంటి పోరాటాలు చేసింది?
రాష్ట్రంలో అనేక పోరాటాల తర్వాత ఐదు రంగాల్లో కనీస వేతనాల సవరణ జరిగింది. కానీ, యాజమాన్యాల ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లు విడుదల చేయకుండా నాన్చుతున్నది. దీనిపై ఇతర ట్రేడ్ యూనియన్లతోనూ, స్వతంత్రంగానూ అనేక పోరాటాలు చేస్తున్నాం. క్షేత్రస్థాయి కార్మికుల మధ్య ఈ అంశాన్ని చర్చనీయాంశం చేయగలిగాం. వలసకార్మికులు దోపిడీకి గురవుతున్న తీరును సమాజానికి అర్థమయ్యేలా చెప్తున్నాం. హక్కుల కోసం వారు క్రమంగా వారు పోరాటాల్లోకి వచ్చేలా చేయడంలో కొంతమేర విజయం సాధించాం. అయితే ఈ కృషి మరింత పెరగాల్సి ఉంది.
ఏ తరహా పోరాటాలు చేశారు?
పదేండ్ల కాలంలో చలో ఢిల్లీ, మహాధర్నాలు, జైల్‌భరోలు, సార్వత్రిక సమ్మెలు సహా అనేక రూపాల్లో పోరాటాలు చేశాం. వాటిలో కార్మికులను భాగస్వాముల్ని చేశాం. కనీస వేతనాల జీవోల అమలు కోసం భవిష్యత్ కార్యాచరణపై మహాసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
కార్మికవర్గానికి రాజకీయ చైతన్యాన్ని అందించకుండా, ఆర్థిక పోరాటాలకే పరిమతమవుతున్నారన్న విమర్శ ఉంది. నిజమేనా?
ఆ విమర్శ పాక్షిక వాస్తవం. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి చెన్నై మహాసభలోనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. సాధారణ కార్మికులు ఎదుర్కొంటున్న వేతన సమస్య, ఉద్యోగ, సామాజిక భద్రత, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలను ప్రస్తావిస్తూనే, పాలకులు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలనూ వారికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధానాల అమల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మా ప్రధాన శత్రువు. కార్మికులు కూడా జీతం, జీవితం, రాజకీయం వేర్వేరు అనే భావిస్తున్నారు. దాన్ని మరింత విస్త్రుతం చేసి, కార్మికవర్గానికి రాజకీయ చైతన్యం కల్పించే పనిలో మరింత పురోగతి అవసరమే! దానికోసం ప్రస్తుత మహాసభల్లో చర్చించి, కార్యాచరణను రూపొందించుకుంటాం.
భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?
తాత్కాలిక ప్రయోజనాలు ఆశచూపి, ప్రలోభాలకు గురిచేసి కార్మికుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం అన్ని రంగాల్లోనూ జరుగుతున్నది. ఐక్య, స్వతంత్ర పోరాటాల ద్వారా దీన్ని తిప్పికొట్టాల్సిన గురుతర బాధ్యత సీఐటీయూపై ఉంది. శ్రామిక మహిళల సమస్యలు, స్కీమ్ వర్కర్లు, ఇతర కార్మికవర్గానికి జరుగుతున్న అన్యాయాలపై కచ్చితంగా కార్యాచరణ తీసుకుని ముందుకు సాగుతాం. ప్రతి కార్మికునికీ చేరువయ్యేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాల జీవోల జారీపై ఐక్య, స్వతంత్ర పోరాటాలను తీవ్రతరం చేస్తాం. ప్రత్యామ్నాయ సంస్కృతిని మరింత విస్తరింపజేస్తాం. కార్మికుల్లో రాజకీయ చైతన్యం కల్పించే దిశగా ముందుకుసాగుతాం.
ప్రభుత్వరంగంపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యూహాత్మకంగా ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. జాతీయ బ్యాంకుల విలీనం, బీమా రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, ఉద్యోగుల పెన్షన్ బిల్లుల్ని షేర్ మార్కెట్‌లో పెట్టడం వంటి అనేక ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తు న్నారు. దీనివల్ల క్రమేణా ప్రభుత్వరంగం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఆ స్థానాన్ని ప్రయివేటు, కార్పొరేట్ శక్తులతో భర్తీ చేయాలనేది బీజేపీ ఆర్థిక, రాజకీయ విధానం. దాని అమలు కోసమే మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది.
ఎన్నికల సమయంలో బీజేపీ ఇస్తున్న హామీలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి కదా! దాన్ని ప్రజలు ఎందుకు గుర్తించట్లేదు?
బీజేపీ రాజకీయ విధానం ‘మేకవన్నె పులి’ వంటిది. ఎన్నికల సమయంలో ఆపార్టీ ఇచ్చే వాగ్దానాలకు, అమలు చేసే విధానాలకు మధ్య పొంతనే ఉండదు. దేశభక్తి పేరుతో దేశాన్ని విదేశీ పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసేలా విధాన నిర్ణయాలు తీసుకొని, అమల్లోకి తెస్తున్నారు. ప్రతిఘటించే కార్మికవర్గాన్ని కూడా కులం, మతం, ప్రాంతం పేరుతో విడగొట్టాలనే కుట్రలు చేస్తున్నారు. అయితే ఈ భ్రమలన్నీ తాత్కాలికమే. విద్వేష విధానాలతో ముప్పువాటిల్లుతుందని కార్మికవర్గం గుర్తిస్తే, వీరి ఆటలకు అడ్డుకట్టపడినట్టే. సీఐటీయూ ఆ దిశగానే కార్మికుల హక్కులు, ఆందోళనలతో పాటు వారికి రాజకీయ అవగాహన కల్పించే దిశగా కృషి చేస్తున్నది.
దేశంలో పరిశ్రమల విస్తరణ ఎలా ఉంది?
గడచిన ఐదేండ్లలో దేశంలో 2,04,268 ప్రయివేటు కంపెనీలు మూతపడ్డాయని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. దీన్నిబట్టి దేశంలో పారిశ్రామిక విస్తరణ ఎంత అథోగతిలో ఉందో అర్థమవుతోంది. ఆ కంపెనీలపై ఆధారపడిన కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి ఏంటి? వారికి సంబంధించిన ఏ వివరాలు కేంద్రం వద్ద లేవు. వారంతా రోడ్డునపడినట్టే కదా! దేశంలో కొత్త కంపెనీల ఊసే లేదు. ఫలితంగా ఇప్పటికే ఉన్న నిరుద్యోగుల సంఖ్యకు వీరంతా అదనంగా జోడింపబడ్డారు. దేశంలో తీవ్రమైన ఉద్యోగ, ఉపాది సంక్షోభం తలెత్తుతున్నది. దీనికి ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలే కారణం.
పోరాటాలతోనే పాలకులకు సమాధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



