లేబర్ కోడ్‌లు, విద్యుత్, వీబీ జీ రామ్‌జీ, విత్తన చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి
రైతు ఉద్యమ స్ఫూర్తితో రద్దయ్యే వరకు పోరాడాలి : బి.వెంకట్
వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ నిరసన
సెంట్రల్ సిటీ కమిటీ ఆఫీస్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి తీసుకువచ్చిన ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్‌లను, వీబీ జీ రామ్‌జీ, విత్తన, విద్యుత్ సవరణ చట్టాలను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక, అఖిల భారత కిసాన్ సభ కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ సెంట్రల్ సిటీ కమిటీ ఆఫీసు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇక్కడ జరిగిన సభకు సీఐటీయూ నగర కార్యదర్శి జె. కుమార్ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బి. వెంకట్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ.. నాలుగు నల్ల లేబర్‌కోడ్‌లను తీసుకువచ్చి కనీస హక్కులు లేకుండా చేస్తోందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలు రద్దయ్యే వరకు రైతు ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీలు సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాముడి పేరుతో రాజకీయం..
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నదని, రాముడు పేరుతో రాజకీయాలు చేస్తూ పేద ప్రజల నోట్లో మట్టి కొట్టే విధానాలను తీసుకొస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకించకపోతే దేశంలో ఉన్న పేద, బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులకు రాబోయే కాలంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రమాదకరమైన బిల్లులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలి
ఈ బిల్లులకు వ్యతిరేకంగా గ్రామపంచాయతీల్లో రాష్ట్రంలో గెలిచిన మెజార్టీ కాంగ్రెస్ సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం చేయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో నిరసనలు చేపట్టి దీనిని దేశవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. ప్రసాద్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు సునీత, టీపీఎస్‌కే గౌరవాధ్యక్షులు జి.రాములు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్, పీఎన్‌ఎం రాష్ట్ర నాయకులు జగ్గరాజు, సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం.దశరథ్, కోశాధికారి కె.అజయ్ బాబు, ఉపాధ్యక్షులు జి. రాములు, జి.నరేష్, సహాయ కార్యదర్శులు సి.మల్లేష్, టి.మహేందర్, ఏ.రాజు, నగర నాయకులు ఆర్ అశోక్, డీఎల్ మోహన్, ఎం సత్యనారాయణ, ఎండీ ఆసిఫ్, బి.లక్ష్మణ్, కే సతీష్, రవీందర్, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి అశోక్ రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకటేష్, నగర కార్యదర్శి జావిద్, కేవీపీఎస్ నగర కార్యదర్శి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.



