Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంగుజరాత్‌ ఎంపీల ఆస్తులు పెరిగాయ్‌

గుజరాత్‌ ఎంపీల ఆస్తులు పెరిగాయ్‌

- Advertisement -

ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో పోగేసుకుంటున్న ప్రజాప్రతినిధులు
1100 శాతానికి పైగా ఎగబాకిన బీజేపీ ఎంపీల సంపద : ఏడీఆర్‌ నివేదిక సమాచారం


గుజరాత్‌ : దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని పార్లమెంట్‌ సభ్యుల(ఎంపీ) ఆస్తులు పెరిగాయ్‌. దశాబ్ద కాలంలో గణనీయంగా పోగేసుకున్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రిపోర్టు వెల్లడించింది. 2014 నుంచి 2024 మధ్య తిరిగి ఎన్నికైన 103 మంది ఎంపీలలో 102మంది అఫిడవిట్లను ఏడీఆర్‌ పరిశీలించింది. ఈ దశాబ్ద కాలంలో గుజరాత్‌లో ఏడుగురు ఎంపీలు తిరిగి ఎన్నికయ్యారు. వారి వ్యక్తిగత సంపద వృద్ధి, క్షీణతలో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. ఏడీఆర్‌ నివేదిక సమాచారం ప్రకారం.. రాష్ట్రం నుంచి తిరిగి ఎన్నికైన ఎంపీలలో జామ్‌నగర్‌ ఎంపీ పూనమ్‌బెన్‌ ఆస్తులలో అత్యంత వేగవంతమైన పెరుగుదలను నమోదైంది. పదేండ్లలో ఆమె ఆస్తులు సుమారు రూ.130 కోట్లు పెరిగాయి. అయితే కేంద్రమంత్రి , గుజరాత్‌ బీజేపీ మాజీ అధ్యక్షడు సి.ఆర్‌. పాటిల్‌ ప్రకటించిన ఆస్తులలో గణనీయమైన క్షీణత కనిపించింది. పదేండ్లలో అవి సుమారు 47 శాతం తగ్గాయి.

గుజరాత్‌కు చెందిన ఇతర ఎంపీలు కూడా గణనీయమైన స్థాయిలో ఆస్తులను పెంచుకున్నారు. కచ్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ వినోద్‌ లఖమ్‌షి చావ్డా ఆస్తులు 2014లో సుమారు రూ.56లక్షలు ఉండగా.. అవి 2024లో రూ.7 కోట్లకు పైగా అమాంతం పెరిగాయి. ఈ పెరుగుదల 1100 శాతం కంటే ఎక్కువే కావటం గమనార్హం. బార్డోలి నియోజక వర్గానికి చెందిన ప్రభుభాయ్‌ నాగర్‌భాయ్‌ వసవా ఆస్తులు సుమారు రూ. 3.1 కోట్ల పెరుగుదలను నమోదు చేశారు. ఖేడాకు చెందిన దేవుసిన్‌ చౌహాన్‌, జునాగఢ్‌కు చెందిన రాజేశ్‌భాయ్‌ నారన్‌భాయ్‌ చుడాసమా కూడా దశాబ్ద కాలంలో ఒక్కొక్కరు రూ.2 కోట్లకు పైగా ఆస్తుల పెరుగుదలను నమోదు చేశారు.

ఎన్నికల అఫిడవిట్ల విశ్లేషణ ప్రకారం… ఈ 102 మంది ఎంపీల సగటు ఆస్తులు 2014లో రూ.15.76 కోట్లుగా ఉన్నాయి. ఇది 2019 నాటికి రూ.24.21 కోట్లకు పెరగగా.. 2024లో రూ. 33.13 కోట్లకు ఎగబాకింది. వరుసగా ఎన్నికైన ఈ ఎంపీల సగటు సంపద పదేండ్ల కాలంలో రూ.17.36 కోట్లు పెరిగింది. ఇక ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎంపీల ఆస్తులలో కూడా పెరుగుదల నమోదైంది. వారు 2014-2024 మధ్య తిరిగి ఎన్నికయ్యారు. వారి సగటు ఆస్తులు 2014లో రూ. 5.16 కోట్ల నుంచి 2024లో రూ.12.16 కోట్లకు పెరిగాయి. అంటే ప్రతి ఎంపీ సగటున దాదాపు రూ. 7 కోట్ల వరకు ఆస్తుల పెరుగుదలను నమోదు చేశారు. ఇది పదేండ్లలో సుమారు 135 శాతం పెరుగుదలకు సమానం కావటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -