Tuesday, November 18, 2025
E-PAPER
Homeజాతీయంసీజేఐపై దాడి దారుణం

సీజేఐపై దాడి దారుణం

- Advertisement -

అది 30 కోట్ల మంది దళితులపై జరిగిన దాడి
దాడులకు పాల్పడే వారికి గుణపాఠం చెప్తాం
న్యాయ, పోలీసు వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్‌ వివక్షను ప్రదర్శించాయి
మనుధర్మాన్ని రుద్దాలనే వారెవరైనా మాకు శత్రువులే : ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బి.ఆర్‌ గవాయ్‌పై జరిగిన దాడిపై ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది దేశంలోని 30 కోట్ల మంది దళిత ప్రజలపై జరిగిన దాడేనని అన్నారు. దళితులపై దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. సీజేఐ బి.ఆర్‌ గవాయ్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం జంతర్‌ మంతర్‌ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుందనీ, అయితే అందుకు విరుద్ధంగా దళితుల మీద దాడులకు పాల్పడుతున్నవారిపై చట్టపరమైన వ్యవస్థలు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించవా? వారిపై చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. న్యాయ, ఢిల్లీ పోలీసు వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తమ కర్తవ్యాలను అమలు చేయడంలో పూర్తి వివక్షతను చూపెట్టాయని అన్నారు. ఎన్నో సంఘటనలపై పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకొని సుమోటోగా కేసులు తీసుకున్న వ్యవస్థలు.. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అధిపతి అయిన జస్టిస్‌ బి.ఆర్‌ గవాయ్‌పై దాడి జరిగితే ఎందుకు మౌనం వహించాయని ప్రశ్నించారు.

ఘటన జరిగి నెల గడిచినా కనీసం చట్టపరంగా ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వివక్షతను చూపుతున్న చర్య, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైన చర్య అని అన్నారు. దళితుల మీద దాడులకు పాల్పడితే సహించే రోజులు పోయాయని తెలిపారు. ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులకు పాల్పడే వారికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. తమ పోరాటం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకో వడానికి, న్యాయ వ్యవస్థ స్వతంత్రను కాపాడుకో వడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే జరుగుతుందని అన్నారు. రాజ్యాంగంతోనే దళితు లకు మానవ హక్కులు లభించి, మనుషులుగా గుర్తింపు పొందారని వివరించారు. దళితులు ఉన్నత స్థాయికి ఎదగడానికి రాజ్యాంగమే కారణమని, దళితులు ఇలా ఉన్నత స్థాయికి ఎదగడాన్ని కొంత మంది జీర్ణించు కోలేకపో తున్నారని అన్నారు.

అందుకే రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శిం చారు. రాజ్యాంగాన్ని తొలగించి, దానిస్థానంలో మను ధర్మాన్ని ప్రజల మీద రుద్దాలని చేసే వారెవరైనా తమకు బద్ద శత్రువులే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్థానంలో రాచరిక వ్యవస్థ తీసుకొచ్చే మనుధర్మాన్ని సహించేది లేదని అన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ అధ్యక్షత వహించగా, ఎంఆర్‌పీఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేశ్‌ మాదిగ, సొట్ట నరేంద్ర బాబు మాదిగ, కడార్ల నవీన్‌ చారి, ఎంఆర్‌పీఎస్‌ నార్త్‌ ఇండియా ఇంచార్జ్‌ రుద్రపోగు సురేశ్‌, కర్నాటక నుంచి నర్సాప్ప మాదిగ, మహారాష్ట్ర నుంచి అజిత్‌, ఉత్తరాఖండ్‌ నుంచి ఆశిశ్‌ కుమార్‌, తమిళనాడు నుంచి లోకేశ్‌, హర్యానా నుంచి సత్యపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -