విచ్చలవిడిగా బెల్టు షాపుల నిర్వహణ
పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం
మాములు, గా తీసుకుంటున్న ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా..మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, కొయ్యుర్, వళ్లెంకుంట, ఎడ్లపల్లి, కొండంపేట, రుద్రారం, నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. మద్యం పంపిణీ, రవాణా, అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిఉంది. కానీ ,మాములు, గా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇతర జిల్లాల నుంచి మండలానికి మద్యం సరఫరా కాకుండా అడ్డుకోవడానికి అవసరం అయిన చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో ఎప్పటికప్పుడు బెల్ట్ దుకాణాలను తనిఖీలు చేయాల్సి ఉంది.
కానీ మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ హడావుడి ఎక్కువగా కన్పించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఆరు వరకు బెల్ట్ దుకాణాలు ఉండటం సర్వసాధారణం. ప్రతి దుకాణం జోరుగా నడవడంతో పాటు ఒక్కో బాటిల్పి రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి బెల్ట్ దుకాణాలకు మద్యం రవాణాతో పాటు పోటీలో ఉండే అభ్యర్థులు పంపిణీ చేయడానికి సరఫరా చేస్తున్నా..మద్యం భారీగా పట్టుబడిన దాఖలు కనిపించడం లేదు.సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేయడానికి టోకెన్ల విధానం వాడుతుంటారు. ఈ ఎన్నికల్లో టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మద్యం దుకాణంపై నిఘా ఏర్పాటు చేసి ఎవరైనా ఈ విధానం అమలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
దీంతో పాటు బాల్క్ గా సేల్స్ ఉండరాదు. ఇళ్లలో, పాత భవనాలలో మద్యం నిల్వలు ఉంటే తనిఖీలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై ఆశించినస్థాయిలో నిఘా కానీ సోదాలు కనిపించడం లేదు. గ్రామాల్లో చిన్న చిన్న కిరాణ దుకాణాలు బార్లను తలపిస్తున్నాయి. అన్ని పార్టీలు బహిరంగంగానే మద్యం తరలిస్తున్నా.. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగాలనే ఉద్దేశంతో సదరుశాఖ అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది.



