Sunday, August 3, 2025
E-PAPER
Homeమానవిస్నేహ బంధం అపురూపం

స్నేహ బంధం అపురూపం

- Advertisement -

జీవితంలో స్నేహమనే తోడు లేకుండా ఎవరూ తమ జీవితాన్ని కొనసాగించలేరు. రక్త సంబంధం కాకపోయినా అంతకంటే గొప్పది స్నేహం. స్నేహానికి అంతరం ఉండదు. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ ‘స్నేహం’ తరతరాలకు తరగని బంధం. కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో చెప్పుకోగలగడం స్నేహానికి ఉన్న గొప్పదనం. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా కొందరు స్నేహితులు తమ ఆత్మీయ నేస్తాలతో గల బంధాన్ని మానవితో పంచుకున్నారు.

స్నేహితులు ఉండాలి
నాన్న కన్నన్‌ నాయర్‌. అమ్మ శారద నాయర్‌. మా సొంత ఊరు కేరళ. నాన్న ఆర్మీలో పనిచేసేవారు. అమ్మ ప్రిన్సిపాల్‌గా చేసేవారు. నాన్న ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలు తిరిగాను. నేను పుట్టింది ముంబయిలో. నా విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. నాకున్న మంచి స్నేహితురాలు షీలా. మాది 28 ఏండ్ల స్నేహ బంధం. ఆమె భర్త అర్జున్‌కి ఒక స్టూడియో ఉండేది. ఆ స్టూడియోలో యాడ్‌ ఫిలిమ్స్‌ చేయడానికి నేను వెళుతుండేదాన్ని. షీలా కూడా తన పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చేది. ఖాళీ సమయం దొరికితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాళ్ళం. అలా జరిగిన మా పరిచయం కాస్త స్నేహంగా మారి మేమిద్దరం ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లడం మొదలుపెట్టాం. ఒక సారి అర్జున్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లి తిరిగి వస్తుంటే కర్నూలు దగ్గర రోడ్‌ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ సమయంలో నేను తనకి చాలా అండగా నిలబడ్డాను. ధైర్యం చెప్పాను. భర్త చనిపోయాక షీలా చాలా ఒంటరైపోయింది. ఇంట్లో ఉండలేకపోయేది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మరీ ఒంటరితనం ఫీల్‌ అయ్యేది. ఒక్కొక్కసారి నా దగ్గరే ఉండేది. శని, ఆదివారాలు వస్తే పిల్లల్ని తీసుకొని మా ఇంటికే వచ్చేది. హైదరాబాదులో తనకు రావాల్సిన బాకీలు కొన్ని ఉంటే వసూలు చేసుకుంది. కొందరు ఇవ్వకుండా ముఖం చాటేశారు. అన్నీ సెటిల్‌ చేసేసుకుని వారి సొంత ఊరు ఊటీ వెళ్ళిపోయింది. అక్కడ వాళ్లకు టీ ప్లాంట్స్‌ ఉన్నాయి. నాకు స్పెషల్‌ చైల్డ్‌. నేను ఎప్పుడు షూటింగ్స్‌కి వెళ్లినా పాపను తన దగ్గరే వదిలి వెళ్ళేదాన్ని. ఎంతో ఓపిగ్గా చూసుకునేది. తను ఊటీ వెళ్ళిపోయినా రెండు మూడు రోజులకి ఒకసారి ఫోన్‌ చేసి నా యోగక్షేమాలన్నీ కనుక్కుంటూ ఉంటుంది. నన్ను ఊటీ రమ్మంటూ ఉంటుంది. కొద్ది రోజుల కిందట వెళ్లి తన దగ్గర కొన్నాళ్ళు ఉండి వచ్చాను. షీలాకు నాకూ మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. మా జీవితాలు తెరిచిన పుస్తకాలు.. ఇంతకంటే ఏమి చెప్పలేను. స్నేహితులు అనే వాళ్ళు మన జీవితంలో తప్పకుండా ఉండాలి. అయితే ఆ బంధానికి సరైన అవగాహన కలిగి ఉండాలి.
– ఇందు ఆనంద్‌, సినీ నటి

మన గురించి ఆలోచించే వారే
నాన్న నల్లూరి సుధీర్‌ కుమార్‌. పాతతరం వారికి నాన్నగారు బాగా తెలుసు. దూరదర్శన్‌, ఆల్‌ ఇండియా రేడియోలో వారు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేశారు, ఐదు నంది అవార్డులు గెలుచుకున్నారు. అమ్మ విజయలక్ష్మి, టీచర్‌గా చేస్తున్నారు. తను కూడా గాయని, దూరదర్శన్‌లో పాటలు పాడేవారు. నాకు ఒక అక్క. పేరు రమ్య శృతి. తనుకూడా ప్రొఫెషనల్‌ సింగర్‌. నాకు ఫ్రెండ్స్‌ చాలా మంది ఉన్నప్పటికీ బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే సబిత. మేమిద్దరం ఏడేండ్లుగా స్నేహితులం. నాకొక మ్యూజిక్‌ గ్రూప్‌ ఉంది. తను అందులో సభ్యురాలు. మొదట్లో నాకు సభ్యురాలిగానే పరిచయం. గ్రూప్‌ సభ్యులందరం కలిసి ప్రతి ఏడాది పిక్నిక్‌, విహార యాత్రలు.. ఇలా సరదాగా వెళుతుంటాం. ఇలా వెళ్ళినప్పుడు మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. నా మంచి కోరుకునే వాళ్లలో తానే ముందుస్థానంలో ఉంటుంది. అలాంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టం. స్నేహితులు ఎంత మంది ఉన్నా మన గురించి ఆలోచించే వాళ్ళు ఎందరుంటారు? ఎవరి జీవితాలు వారివి. ఎదుటి వారి గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంది? కానీ తను అలా కాదు, నా పుట్టినరోజుకి సర్ప్రైజ్‌ చేయడం, నేను తిన్నాన లేదా కనుక్కోవడం, కొద్దిగా డల్‌గా ఉంటే ‘ఎందుకు అలా ఉన్నావు’ అంటూ అడగటం, నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం చేస్తూ వుంటుంది. నేను గాయనినే కాదు బుల్లి తెర నటిని కూడా. నటిగా ఒత్తిడి ఎంత ఉంటుందో తను అర్ధం చేసుకుంటుంది. అందుకు తగ్గట్టుగా నా ఒత్తిడి దూరం చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రతిరోజు శుభోదయం అనే సందేశంతో తన పలకరింపు ప్రారంభం అవుతుంది. నాకు ప్రతి విషయంలో తను సహకారం అందిస్తుంది. మా స్నేహం ఎప్పటికి ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ..
– శృతి, బుల్లితెర నటి

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపచేసే ఏకైక పదం స్నేహం. ఎన్నో బంధాలు మనకు సంబంధం లేకుండా మన జీవితంతో ముడిపడి ఉంటాయి. అయితే స్నేహితులను మాత్రం మనమే పెంచుకోవాలి. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకొని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. స్నేహాన్ని వర్ణించటానికి తెలుగు భాషలోని పదాలు సరిపోవేమో.. అంత మధురమైనది స్నేహం. నిజమైన స్నేహం కష్ట కాలంలో తెలుస్తుందంటారు. ఇది అక్షర సత్యం. స్నేహమనే మాధుర్యంలో ఒకరిపై ఒకరు చూపించే శ్రద్ధ, తన పట్ల తాను అశ్రద్ధ వహిస్తే కోప్పడుతూ కురిపించే మమకారాలెన్నో, స్నేహం అనే బంధంలో పంచుకునే బాధ లెన్నో. నిజమే ఎప్పుడు మనసు కలత చెందినా, ఇతరుల వల్ల మనసు గాయపడినా స్నేహితులకు చెప్పుకుని ఓదార్పు పొందుతాము. బంధంగా పుట్టకపోయినా, అనుబంధంగా రూపుదిద్దుకొని కలిసిన సమయం నుండి కడదాకా నీడనిచ్చేది స్నేహం. నిజమైన స్నేహాన్ని గుర్తిద్దాం.. కలకాలం ఉండేలా కాపాడుకుందాం…
– పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -