– కమ్మర్ పల్లి రైతుల డిమాండ్
– వరద కాలువ ద్వారా సాగునీరు ఇవ్వాలి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెంటనే సన్న వడ్ల బోనస్ డబ్బులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు కమ్మర్ పల్లి రైతులు మాట్లాడారు. దిగుబడి తగ్గిన బోనస్ వస్తుందన్న ఆశతో సన్న వడ్లను ఎక్కువ మొత్తంలో రైతులు పండించారన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి సేకరించిన సన్న వడ్ల ధాన్యానికి వెంటనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరామ్ సాగర్ వరద కాలువపై ఆధారపడి పెద్ద మొత్తంలో రైతులు పంటలు సాగు చేస్తారని, కానీ ఇటీవల భారీ వర్షాల మూలంగా గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండిపడడంతో ప్రస్తుతం వరద కాలువలో నీరు లేకుండా పోయిందన్నారు.
వెంటనే అధికారులు మొద్దు నిద్ర వదిలి వరద కాలువలోకి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రవి సీజన్లో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమైన వేళ వరద కాలువలో ఉన్న నీరు కాస్త రోజురోజుకు అడుగంటి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం గత మూడు నెలల నుండి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమని రైతులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వరద కాలువకు మరమ్మత్తులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతులందరం కలిసి ఆందోళనలు చేపట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. త్వరగా రైతుల డిమాండ్లను, సమస్యలను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపట్టడానికి తేదీని ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ రైతులు సంత నడిపి రాజేశ్వర్, కొమ్ముల రాజన్న, బద్దం రాజశేఖర్, కొర్రె చిన్నయ్య, జమీల్, కొత్తపల్లి రఘు, సురకంటి సంతోష్, సింగిరెడ్డి ముత్యంరెడ్డి, కొమ్ముల పెద్ద బాలయ్య, భామని రాజన్న, జడల చిన్న రాజన్న, కోనయ్య, తదితరులు పాల్గొన్నారు.



