మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి 
నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి 
అక్టోబర్ 21 వారోత్సవాల సేవా కార్యక్రమాలు
ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరం 
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం 
ప్రజలకు రక్షణ కల్పిస్తూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల ధీరత్వం మరవలేనిదని మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి తెలిపారు. పల్లెల్లో శాంతి నెలకొల్పడంలో ప్రజల భాగస్వామ్యం పోలీసులకు ఎంతో అవసరమని గుర్తు చేశారు. పోలీస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, పలు కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. 
విద్యార్థులు, యువకులు రక్తదానం చేసేందుకు వందలాదిగా ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21న లడక్ లో జరిగిన ఘటనలో అనేక మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. కొంతమంది చైనీస్ పోలీసు అధికారులకు చిక్కారని గుర్తు చేశారు. వారి కాల్పుల్లో మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను కూడా చైనీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. సుమారు మూడు వారాల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అనేక చర్చల అనంతరం మృతదేహాలతో పాటు వారి ఆధీనంలో ఉన్న పోలీసులను విడుదల చేశారని వివరించారు.
 1960 అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా విధి నిర్వహణలో అనేకమంది ఆయా సందర్భాల్లో పోలీసులు అమరులయ్యారని తెలిపారు. మంచాలలో పని చేసిన ఎస్ఐ సైదయ్య, కానిస్టేబుల్ సాయిలతో పాటు యాచారం పోలీస్ స్టేషన్ పేల్చివేసిన ఘటనలో అమరులైన పోలీసులకు త్యాగాలను కొనియాడారు. అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబాలను రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తమ పోలీసులు కలిసి కుటుంబ స్థితిగతులు తెలుసుకోవడం జరుగుతుందని వివరించారు. తమకు తోచిన సహాయాన్ని వారికి అందజేస్తున్నామన్నారు. ఇటీవల నిజామాబాదులో ఓ నిందితుని అరెస్టు చేసి వాహనంపై తీసుకువెళుతున్న క్రమంలో నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ను పొడిచి హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఆ కుటుంబానికి ప్రభుత్వ సహకారంతో తమ పోలీసు శాఖకు అండగా నిలుస్తోందని కుటుంబానికి భరోసా ఇచ్చారు. వారి అమరత్వాన్ని కొనియాడుతూ.ఈ వారోత్సవాల సందర్భంగా కొవ్వొత్తులు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఆపదలో ఉన్న అభాగ్యులను ఆదుకునేందుకు గాను రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి తమ వంతు సహకారాన్ని, మద్దతును తెలియజేస్తున్నామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పై యువత అప్రమత్తంగా ఉండాలని, ఈ అంశాన్ని తీసుకొని ఇంజనీరింగ్ కళాశాలలో  విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో స్త్రీ, పురుష బేధం చూపించవద్దని తెలియజేస్తూ పోలీసు సిబ్బందికి సైతం వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలో పాల్గొన్న వారి వివరాలను ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపరిచామని, రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. 
ప్రజలకు రక్షణ కల్పించడం కోసం విధి నిర్వహణలో పోలీసులు వెనకడుగు వేయకుండా ముందుకే సాగుతున్నామని తెలిపారు. మహిళలు, యువతులు, విద్యార్థిని విద్యార్థులకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. వారిని సన్మార్గంలో నడిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలతో మమేకమై పోలీసులు చేస్తున్న అనేక కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని గుర్తు చేశారు. తద్వారా పల్లెల్లో శాంతిని నెలకొల్పడం సాధ్యమవుతుందన్నారు. రక్తదాన శిబిరంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు ఎస్ఐలు కలిసి డీసీపీ సునీత రెడ్డి సమక్షంలో రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి రవికుమార్, నందీశ్వర్ రెడ్డి, మధు ఎస్ఐలు తదితరులు ఉన్నారు. 

 
                                    