Sunday, December 14, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీమళ్లీ వచ్చేసింది పుస్తకాల సంబురం

మళ్లీ వచ్చేసింది పుస్తకాల సంబురం

- Advertisement -

ఈనెల 19న 38వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన ప్రారంభం అవుతుంది. పది రోజులపాటు తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో కొనసాగే ఈ ప్రదర్శన కోసం ప్రచురణకర్తలు, పుస్తక పంపిణీదారులు, కవులు, రచయితలు, పాఠకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ డిజిటల్‌ ప్రపంచంలో పుస్తకాలను నిజంగా కొని చదివేవారు ఉన్నారా !!? పెరిగిన సాంకేతికత ప్రచురణ రంగాన్ని కూడా ఊహించని కుదుపులకులోను చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్న మనల్ని అందరినీ గత కొంతకాలంగా వేధిస్తుంది. భౌతికంగా పుస్తక ప్రచురణ ఎన్ని రంగులలో హంగులతో చేయవచ్చో పాఠక లోకానికి పరిచయం చేసే సమయంలోనే డిజిటల్‌ యుగం తన్నుకొచ్చింది. వెనువెంటనే వచ్చిన ఈ పరిణామాలకు తోడు కోవిడ్‌ ప్రభావం ప్రచురణ, పత్రికా రంగాన్ని తీవ్రమైన ఒత్తిడికి లోనుచేసింది. అయితే ఈ ఒత్తిడి తాత్కాలికమేనని వర్తమాన అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి. పాఠకుని చేతుల్లోని పుస్తకానికి ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. పాఠకుల అవసరం మేరకు ఒకవైపు డిజిటల్‌ మరొకవైపు ప్రింట్‌ పుస్తకాలు వారి జ్ఞానతష్ణను తీరుస్తున్నాయి. ఈ రెండూ బండి చక్రాల్లా పాఠకలోకాన్ని పుస్తకాల తోటలోకి తీసుకుపోతున్నాయి. ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా జరిగే ఫ్రాంక్‌ ఫర్డ్‌ బుక్‌ ఫెయిర్‌తో సహా మనదేశంలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద కలకత్తా బుక్‌ ఫెయిర్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వహణలో కొనసాగే న్యూఢిల్లీ వరల్డ్‌ బుక్‌ ఫెయిర్‌, చెన్నై ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌తో సహా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లకు వచ్చే పుస్తక ప్రేమికులే ఇందుకు నిదర్శనం.

పాఠకుల దాహార్తికై
పుస్తక ప్రదర్శనల ద్వారా ఒక ప్రాంతం లేదా ఒక రాష్ట్రం లోని సాహిత్యం, సంస్కతి, చరిత్ర మరో ప్రాంతం వారికి చేరువవుతుంది. వివిధ భాషల్లోని పుస్తకాలకు ఇది వేదిక అవుతుంది. ప్రచురణ కర్తలు, రచయితలు, పాఠకుల మధ్య చర్చకు దోహదపడుతుంది. ఇక్కడ లెక్కకు మిక్కిలి పాత కొత్త పుస్తకాలు మనల్ని చుట్టుముడుతూ డిస్కౌంట్లు ఊరిస్తూ ఉంటాయి. అరుదైన, అమూల్యమైన పుస్తకాలు లభిస్తూ పాఠకుల దాహార్తిని తీరుస్తుంటాయి.


శాశ్వత ప్రాంగణం
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ప్రతి సంవత్సరము నిర్వహించే ఈ పుస్తక ప్రదర్శనను మొదట 1985వ సంవత్సరంలో అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసింది. ఏ యేటి కాయేడు పెరుగుతున్న పాఠకుల స్పందన మేరకు పుస్తక ప్రదర్శన ప్రాంగణాలు మారుతూ వచ్చాయి. నిజాం కళాశాల ప్రాంగణం, పబ్లిక్‌ గార్డెన్స్‌, పీపుల్స్‌ ప్లాజా, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌, కేశవ మెమోరియల్‌ మైదానంలో ఆయా వెసులుబాటునుబట్టి జరుపుతూ వస్తున్న బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ఇలా కాకుండా శాశ్వతంగా ఒక ప్రాంగణం ఉండాలని ప్రభుత్వంతో మాట్లాడి ఎన్టీఆర్‌ స్టేడియాన్ని (తెలంగాణ కళాభారతి) ఏర్పాటు చేసుకున్నది. గత దశాబ్ద కాలంగా ఈ స్టేడియంలోనే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కొనసాగుతుంది.

విభిన్న పుస్తకాలు
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ తన అనుభవాలను దష్టిలో ఉంచుకొని ఒక సంవత్సరానికి మించి మరొక సంవత్సరం ప్రచురణకర్తలకు, సందర్శకులకు సౌకర్యాలను మెరుగుపరుస్తూ తన లక్ష్యసాధనలో ముందుకు పోతుంది. గత సంవత్సరం 350 కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేయగా సందర్శకుల సంఖ్య 12 లక్షలను మించిపోయింది. బుక్‌ ఫెయిర్‌ నిర్వహణ, పుస్తకాల లభ్యత, అందుబాటులోని ధరలే కాకుండా పెరుగుతున్న నగర విస్తీర్ణం కూడా సందర్శకుల తాకిడికి కారణం. సామాజిక, ఆధ్యాత్మిక, నాస్తిక, అభ్యుదయ, విప్లవ, కాల్పానిక, సినిమా, శంగార, శాస్త్ర సాంకేతిక, వ్యక్తిత్వ వికాస, విజ్ఞాన, విద్యా సంబంధ, విభిన్న సాహిత్య సాంస్కతిక మొదలగు అన్ని రకాల వివిధ భాషల పుస్తకాలు ఇక్కడ లభిస్తుంటాయి. బుక్‌ ఫెయిర్‌ మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. విద్యార్థులకు ప్రవేశం ఉచితం. మిగతా వారికి ప్రవేశ రుసుం రూ. 20. ఈ ఫెయిర్‌లో ప్రచురణకర్తల స్టాల్స్‌ మాత్రమే కాకుండా రచయితల స్టాల్సు, మీడియా స్టాల్స్‌ కూడా ఉంటాయి.

పిల్లల కోసం…
రెండు నుండి ఐదు గంటల వరకు ‘బాలోత్సవం’ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. బాల బాలికలకు సాహిత్య సాంస్కతిక రంగాలపై అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. విద్యార్థుల్లోని ఆసక్తిని గ్రహించి వారి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు బాలసాహితీవేత్తలు ఈ కార్యక్రమం ద్వారా కషి చేస్తుంటారు. తదుపరి ఐదు నుంచి ఆరు గంటల వరకు సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు సందర్శకులకు వినోదాన్ని కలిగిస్తాయి. 6 నుంచి 7 గంటల వరకు పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన ప్రముఖులు పుస్తకాలతో, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌తో వారికి ఉన్న అనుబంధాన్ని సందర్శకులతో పంచుకుంటారు.

పుస్తకంపై చర్చ
చివరగా 7గంటల నుండి 9 గంటల వరకు ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరమే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు కవి యాకూబ్‌ ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, దర్శకులు, విమర్శకులు, గాయకులు, గ్రంథపాలకులు, చిత్రకారులు, సినీ, పత్రిక, ప్రచురణ రంగానికి చెందిన వారిని ఎంపిక చేసుకొని పుస్తకం వారిని ఏ విధంగా ప్రభావితం చేసింది, వారికి ఏ పుస్తకం ఎందుకు నచ్చింది – అనే అంశాలపై సందర్శకులతో పంచుకునే ఈ కార్యక్రమానికి గత సంవత్సరం లభించిన విశేష స్పందన బుక్‌ ఫెయిర్‌ చరిత్రలో ఒక మైలురాయి. ఎగ్జిబిషన్‌ అంటే కేవలం వ్యాపార కేంద్రం అనే కాకుండా తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదికగా తద్వారా ఈ పండుగలో తాము భాగస్వాములుగా అతిథులు, సందర్శకులు భావించే స్థాయికి ఈ కార్యక్రమం వెళ్ళింది. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పుస్తకంతో వారికున్న స్నేహాన్ని సందర్శకులతో పంచుకుంటారు. గతంలో ఈ కార్యక్రమాన్ని ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌, డాక్టర్‌ చంద్రయ్య, పేర్ల రాము సమన్వయకర్తలుగా ఉండి నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తారు.



అనుబంధం పెంచుతూ
ఈ పుస్తకాల పండుగలో మరో విశేషం పుస్తక ఆవిష్కరణలకు ప్రత్యేకంగా ఒక వేదిక ఉంటుంది. ఆ వేదికపై ఈ పది రోజుల్లో సుమారుగా 60 కి మించి పుస్తకాలు పురుడుపోసుకుంటాయి. ఈ వేదిక రచయితలను ఆకర్షించడమే కాకుండా రచయితలకు పాఠకులకు మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

వివిధ వేదికలు
ప్రతి సంవత్సరము ఈ బుక్‌ ఫెయిర్‌ జరిగే ప్రాంగణానికి లబ్దప్రతిష్టులైన ఒక సాహితీవేత్త పేరు పెడుతూ ఉంటారు. అలాగే ప్రధాన వేదికలతో సహా ఇతర వేదికలకు సాహిత్య, సాంస్కతిక రంగాన్ని ప్రభావితం చేసిన వారి పేర్లు పెట్టే గొప్ప సంప్రదాయం కొనసాగుతుంది. గత సంవత్సరము దాశరథి శతజయంతి సందర్భంగా ఈ ప్రాంగణానికి ‘దాశరథి ప్రాంగణం’ అని నామకరణం చేశారు. ఈసారి ఈ ప్రాంగణానికి ఇటీవలే మన నుండి దూరమైన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ పేరు పెట్టనున్నారని వినికిడి. అలాగే ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణలు జరిగే వేదికకు కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌, ఇతర వేదికలకు స్వేచ్ఛ, ప్రొ. ఎస్‌.వి.రామారావు వంటివారి పేర్లుపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ అస్తిత్వ స్పహతో సాహిత్య, సాంస్కతిక రంగాలకు వీరు చేసిన కషిని గుర్తిస్తూ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ఈ విధంగా స్మరించుకుంటుంది.

ప్రభుత్వ సహకారం
గత సంవత్సరం జరిగిన 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ గతంలో జరిగిన దానికన్నా భిన్నమైనది. ఎందుకంటే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించి పుస్తక జ్ఞానభాండాగార అవసరాన్ని నొక్కి చెపుతూ ప్రభుత్వపరంగా ఈ పండుగకు అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని సభాముఖంగా ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీకి ఇంతవరకు సొంత కార్యాలయం లేదు. ఈ విషయం కూడా గ్రహించిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సలహామండలి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం గారికి ఈ పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఒక ముఖ్యమంత్రి పుస్తక ప్రదర్శన ప్రారంభించడం అంటే వారికి సమాజం మీద ఉన్న బాధ్యతకు అలాగే బుక్‌ ఫెయిర్‌కు ఉన్న ప్రాధాన్యతకు అద్దం పడుతుంది.

సమాజ హితం కోరే పుస్తకాలు
ఈ సంవత్సరం జరగబోయే 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పోస్టర్‌ను బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు, సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర పర్యాటక , సాంస్కతిక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు నవంబర్‌ 25న వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని, గిరిజన ప్రాంతాల్లోని గ్రామపంచాయతీలు, మహిళా సంఘాల కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లో సమాజ హితం కోరే పుస్తకాలను అందుబాటులో ఉంచే ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కమిటీని మంత్రి కోరారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రభాతభేరి’ కార్యక్రమం గురించి ఈ బుక్‌ ఫెయిర్‌ లో విస్తతంగా ప్రచారం చేయాలని మంత్రి కోరారు. మాదకద్రవ్యాల వాడకానికి, ఆడపిల్లలపై అత్యాచారానికి వ్యతిరేకంగా ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌ లకు దూరంగా యువతను ఉంచి చైతన్యపరిచే ప్రభాతభేరి లక్ష్యాలకు అనుగుణంగా ఈ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ లో కార్యక్రమాలు ఉంటాయి.

అభ్యుదయ సాహిత్యానికి నెలవు నవతెలంగాణ
ఈ బుక్‌ఫెయిర్‌లో నవతెలంగాణ కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది. అభ్యుదయ సాహిత్యానికి నెలవైనా నవతెలంగాణ ఈ ఏడాది కూడా వేలాది పుస్తకాలను పాఠకుల ముందుకు తీసుకురాబోతోంది. ముఖ్యంగా చరిత్ర, సైన్స్‌, ఎడ్యుకేషన్‌, జీవిత చరిత్రలు, ఫిక్షన్‌-నాన్‌ ఫిక్షన్‌ పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం, కుల, మత సమస్యల గురించి, రాజకీయ, జర్నలిజం, పిల్లల పుస్తకాలు, ఆర్థిక విషయాలకు సంబంధించి, ఇంగ్లీష్‌ గ్రామర్‌తో పాటు ఇంకా అనేక రకాల పుస్తకాలు బుక్‌ఫెయిర్‌లో ఉంచబోతోంది. పుస్తక ప్రియులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము.
డి.కిష్టారెడ్డి, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ మేనేజర్‌, 9490099437

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ 9849082693

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -