మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కువద్ద చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో బంద్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపించినప్పటికీ మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను మాత్రం రాత్రికి రాత్రే అనుకుని మరుసటి రోజే పార్లమెంట్‌లో పెట్టి బిల్ పాస్ చేశారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ఆరు నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం వి. రమణ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
అప్పుడు మాత్రమే వాటికి చట్టబద్ద రక్షణ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నర్సింహ్మ, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు, సీఐటీయూ నాయకులు జి నరేష్, సమ్మె గౌడ్ ఫౌండేషన్ చైర్మెన్ చిలువేరు సమ్మె గౌడ్, వివిధ వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES