సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శ..రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను కాలరాస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. అంబేద్కర్ 69వ వర్థంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సర్కారు రాజ్యాంగాన్ని బలహీన పరిచి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తున్నదనీ, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నదని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష, దళితులపై దాడులు, దౌర్జన్యాలు, లైంగికదాడులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయటం లేదని ఆరోపించారు. కులం పేరుతో దాడులు, దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయనీ, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగ హక్కులకే ప్రమాదం ఏర్పడిందని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని పార్టీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, కేంద్రం దీన్ని అడ్డుకుంటున్నదని తెలిపారు. రిజర్వేషన్ల అమలుపై నిరాశ చెంది ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకోవటం పూలే, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు పాల్గొన్నారు.



