చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వెంకటరమణ
24న ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ-ముషీరాబాద్
బీసీలకు విద్యా, ఉద్యోగం, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో ఉప వర్గీకరణ చేయాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మేకపోతుల వెంకటరమణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివిధ వృత్తిదారుల సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్‌ల అమలుకు రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపినప్పటికీ బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం రాత్రి అనుకొని తెల్లారి పార్లమెంట్‌లో పెట్టి అమలు చేశారని, బీసీ రిజర్వేషన్లపై ఆరు నెలలైనా ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలన్నారు.
రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య మాట్లాడుతూ.. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో చేసినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఉప వర్గీకరణ చేయాలన్నారు. అప్పుడే అత్యంత వెనుకబడిన వారికి అవకాశాలు వస్తాయన్నారు. మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ.. వృత్తిదారుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా వృత్తుల్లో మార్పులు తీసుకొచ్చి ఉపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రణాళిక రూపొందించాలన్నారు. గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో బీసీ రిజర్వేషన్‌ల అమలు కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
అక్టోబర్ 24న(రేపు) ఇందిరాపార్క్ వద్ద 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి నిర్వహించబోయే ధర్నాకు వృత్తిదారుల సంపూర్ణ మద్దతు ఉంటుందని, కేంద్రంపై పోరాడటానికి ముందుకొచ్చే ప్రజాసంఘాలతో తాము కలిసి పని చేయడానికి సిద్ధమన్నారు. ఈ సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.వెంకట నరసయ్య, బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిరాజు నాగరాజు, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చెన్నారం మల్లేశం, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాళ్ల బండి కుమారస్వామి, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నరహరి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మరియాలు గోపాల్, యాదగిరి చారి పాల్గొన్నారు.