Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజలవివాదాలపై కేంద్రం స్పందించాలి

జలవివాదాలపై కేంద్రం స్పందించాలి

- Advertisement -

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ఉత్తమ్‌ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు, కృష్ణా, గోదావరి నదీ బేసిన్ల సమస్యలపై కేంద్రం వెంటనే చొరవ చూపాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ దృష్టికి లేఖ ద్వారా ఆయా అంశాలను తీసుకెళ్లారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు ఇప్పటికీ క్లియరెన్స్‌ రాలేదని గుర్తు చేశారు.


45 టీఎంసీలను వినియోగించుకోవాలి
పాలమూరుకు మైనర్‌ ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ నుంచి 45 టీఎంసీల మిగులు జలాలు, గోదావరి నీటిని కృష్ణా నదికి బదిలీ చేయడం ద్వారా తెలంగాణకు రావాల్సిన 45 టీఏంసీలను ఈ ప్రాజెక్టు వినియోగించుకోవాలని ప్రతిపాదించిందని అందులో చెప్పారు. గోదావరి వాటర్‌ డిస్ప్యూట్స్‌ ట్రిబ్యునల్‌ (జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం 45 టీఎంసీల కృష్ణా నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై వాడుకునే వీలుందని వివరించారు. ఆ నీటినే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిందని గుర్తు చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్ర జల సంఘం ఆమోదించాలనీ, ఆ తర్వాత పర్యావరణ శాఖ సీసీ, ఈసీ జారీ చేయమని సిఫారసు చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఈ ప్రాజెక్టులకు ఎన్విరాన్మెంటల్‌ క్లియరెన్స్‌ వస్తే కేంద్రం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డ్‌ లాంటి ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీతో రుణాలు పొందే వీలుంటుందని తెలిపారు.


తెలంగాణకు ముందే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2007లోనే డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఆమోదం పొందిందనీ. ఫ్లోరోసిస్‌ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో డిండి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణించాలని ప్రధాన మంత్రి కార్యాలయం 2010 డిసెంబర్‌ 10వ తేదీన ప్రతిపాదించిందని మంత్రి ఉత్తమ్‌ లేఖలో వివరించారు. 2021 సెప్టెంబర్‌ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్‌ ప్రాజెక్ట్‌ (తుపాకులగూడెం బ్యారేజ్‌) డీపీఆర్‌ సమర్పించిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి నో-అబ్జెక్షన్‌(ఎన్‌వోసీ) లేనందున ఇంటర్‌-స్టేట్‌ మ్యాటర్స్‌ డైరెక్టరేట్‌ నుంచి క్లియరెన్స్‌ ఆలస్యమవుతున్నదన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సూచనలను, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు, ముంపు విషయంలో ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసులను పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.


కృష్ణా బేసిన్‌లో
కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం నుంచి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తున్నదనీ, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 880 అడుగుల వద్ద 1.5 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా నీటిని మళ్లిస్తోందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా 841 అడుగుల నుంచి రోజుకు 8 టీఎంసీల నీటిని మళ్లించేలా ఏపీ కాల్వల నిర్మాణాలు చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌తోపాటు ముచ్చుమర్రి, మలయాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. కృష్ణా నది నుంచి వరద నీటిని బేసిన్‌ వెలుపల ప్రాంతాలకు మళ్లిస్తున్నదని గుర్తు చేశారు. శ్రీశైలం అట్టడుగు నుంచి నీటిని డైవర్ట్‌ చేసే నిర్మాణాలతో రిజర్వాయర్‌ ఖాళీ అవుతున్నదని వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ మీద ఆధారపడ్డ జల విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నదనీ, రోజుకు 10 టీఎంసీల చొప్పున 20 రోజులలో 200 టీఎంసీలు డైవర్ట్‌ చేసే సామర్థ్యముండటంతో తెలంగాణలోని ఇన్‌-బేసిన్‌ అవసరాలకు విఘాతం కలుగుతున్నదని వివరించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి ముందే కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో 287.06 టీఎంసీల సామర్థ్యంతో వివిధ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయనీ, కేడబ్ల్యూడీటీ 2 ముందు ఈ వాదనలను వినిపించామనీ, ఈ విచారణ త్వరగా పూర్తి కావాలని కోరారు. 1979లో ఎస్‌ఎల్‌బీసీ 1984లో మొదలైన కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు-రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్‌, 2014లో నారాయణపేట కొడంగల్‌ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వివరించారు.


కేడబ్ల్యూడీటీ 2 అవార్డు ప్రకారం..
కేడబ్ల్యూడీటీ 2 అవార్డు ప్రకారం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులివ్వాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసిన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్‌ఎంబీ అడ్డుకోవాలనీ, కృష్ణా జలాల మళ్లింపుపై నియంత్రణలు విధించాలని ఆయన వివరించారు. ఇన్‌-బేసిన్‌ అవసరాల విషయంలో కేఆర్‌ఎంబీ న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రవాహాలను కచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ అమలు చేయాలనీ, టెలీమెట్రీ అమలుకు తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ ఖాతాకు రూ.4.15 కోట్లు జమ చేసిందన్నారు. ఇప్పటికీ ఏపీ పరిధిలో టెలీమెట్రీ పనులు జరగలేదనీ, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీకి సూచించాలని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నీటిని కేసీ కెనాల్‌ నుంచి హెచ్‌ఎల్సీ, ఎల్‌ఎల్సీ కెనాల్‌కు నీటిని డైవర్ట్‌ చేస్తోందనీ, ఇది కేడబ్ల్యూడీటీ 2 అవార్డును ఉల్లంఘించటమే అవుతుందని అన్నారు. అవార్డు ప్రకారం తుంగభద్ర నుంచి వచ్చే ప్రవాహాలు కష్ణా నదికి రావాలనీ, దానికి విరుద్ధంగా ఏపీ అనుసరిస్తున్న తీరుపై ఇప్పటికే తుంగభద్ర బోర్డుకు లేఖలు రాశామని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. శ్రీశైలం రిజర్వాయర్‌ అడుగు నుంచి (797 అడుగుల వద్ద) రోజుకు 3 టీఎంసీల నీటిని అవతల బేసిన్‌కు లిఫ్ట్‌ చేసేలా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమును ఏపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎన్జీటీ స్టే ఇచ్చినా పనులు కొనసాగుతున్నాయనీ, పనులు ప్రారంభమయ్యే ముందు పూర్వస్థితికి పునరుద్ధరించాలని ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని వివరించారు.


అనధికారికంగా…
శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌ డిశ్చార్జ్‌ కెపాసిటీని అనధికారికంగా పెంచుకుందనీ, 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని తరలించుకునేలా ఏర్పాట్లు చేసుకుందని మంత్రి వివరించారు. 44 వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఈ కెనాల్‌కు ఇటీవల 89 వేల క్యూసెక్కులకు పెంచుకుందని చెప్పారు. శ్రీశైలం డ్యామ్‌ నిర్వహణ ప్రమాదకరంగా మారిందనీ, తెలంగాణ ప్రభుత్వం పదే పదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్లంజ్‌ పూల్‌కు మరమ్మతులు చేపట్ట లేదన్నారు. గత 6-7 సంవత్సరాలలో డ్యామ్‌ సైట్‌ను సందర్శించిన వివిధ నిపుణుల బందాలు చేసిన హెచ్చరికలు పట్టించుకోలేదనీ, డ్యామ్‌ భద్రత, నిరంతర కార్యకలాపాలు, జల విద్యుత్తు ఉత్పత్తి, నీటిపారుదల అవసరాలు, తాగునీటి సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలని వివరించారు.
శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి భారీ మొత్తంలో నీటిని మళ్లించేలా ఏపీ నిర్మించుకున్న ప్రాజెక్టులతో విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం పడుతున్నదనీ, నాగార్జునసాగర్‌, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్బీసీ ఆయకట్టుకు నీటి కొరతతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతలలో గ్రీన్‌ పవర్‌ ఉత్పత్తి తగ్గిపోతున్నదని తెలిపారు. 2007లో కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ సాయంతో తెలంగాణకు జీవనాడిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ చేపట్టిందనీ, ఆదిలాబాద్‌లో తుమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీల నీటిని ఏడు ఉమ్మడి జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు తాగునీటిని అందించేందుకు ప్రతిపాదించిందని అభిప్రాయపడ్డారు.


2010లోనే అనుమతి..
2010లోనే కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టుకు అనుమతించిందనీ, 2016లో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదిరిందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడున్న 20 టీఎంసీల కేటాయింపులను 80 టీఎంసీలకు పెంచాలనీ, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి 80 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు సర్దుబాటు చేయాలనీ, ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


నదుల అనుసంధానం
జాతీయ నదుల అనుసంధాన ప్రణాళికలో భాగంగా ఇచ్చంపల్లి కావేరి లింక్‌ కెనాల్‌ ప్రతిపాదనలున్నాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి 148 టీఎంసీల నీటి బదిలీలో 50 శాతం తెలంగాణకు ఇవ్వాలని నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ 2024 మార్చిలో లేఖ రాసింది. గోదావరి బేసిన్‌ నుంచి ఇతర బేసిన్‌లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరముంది. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాలని జీడబ్ల్యూడీటీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్నందున, అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్‌కు కేంద్రం నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -