Saturday, November 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపత్తిరైతుల పట్ల కేంద్రం తీరు దారుణం

పత్తిరైతుల పట్ల కేంద్రం తీరు దారుణం

- Advertisement -

– ఈ నెల 17 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్త ధర్నాలు : విలేకరుల సమావేశంలో టి.సాగర్‌, సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పత్తిరైతుల పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీనియర్‌ నేత సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పత్తి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా 26న రాష్ట్రంలో పత్తి రైతుల ప్రదర్శనలు, నిరసనలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడం దారుణమని విమర్శించారు. 8-12శాతం తేమకు మించి ఉంటే కొనుగోలు చేయబోమనీ, కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా మార్కెట్‌కు పత్తిపంటను తెచ్చే తేదీని స్లాట్‌ బుక్‌ చేయాలని నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల్లో రైతులు స్మార్ట్‌ ఫోన్ల పట్ల ఎంత మేర అవగాహన ఉంటుందని ప్రశ్నించారు. వర్షాల వల్ల పత్తిలో18శాతం వరకు తేమ వస్తున్నదనీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తేమశాతం 12 శాతం మించి వస్తోందని చెప్పారు. సీసీఐ ఆంక్షలతో పత్తిని కనీస మద్ధతు ధరలకన్నా తక్కువ ధరకు వ్యాపారులకు దుస్థితి వస్తోందని వాపోయారు. క్వింటాకు రైతులు రూ.2 వేల చొప్పున నష్టపోతున్నారని చెప్పారు. కిసాన్‌ కపాస్‌ యాప్‌తో కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. సీసీఐతో ప్రయివేటు వ్యాపారులు కుమ్మక్కు అయ్యాయరనీ, వచ్చిన లాభాన్ని వారు పంచుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని డిసెంబర్‌ 31 వరకు ఎత్తేయడం వల్ల ఇప్పటికే 40లక్షల బేళ్లు దిగుమతి అయ్యిందని వివరించారు. దేశంలో 360 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరుగుతున్నదనీ, మన దేశ అవసరాలకు 320 లక్షల బేళ్లు పోనూ మిగతా 40 లక్షల బేళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న తీరును వివరించారు. ఇప్పుడు సుంకం రద్దు చేయడంతో మన రైతులు నష్టపోవాల్సి వస్తున్నదని చెప్పారు. పత్తి పంటపై దిగుమతి సుంకాన్ని 20శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు ఎత్తేయాలని కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి లేఖలు రాసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్‌ కు రూ. 475 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు, శివకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -