మోడీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య ఉదమ్యం
కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించేలా కొత్త విత్తన చట్టం
రైతు సేద్యం డైరీ ఆవిష్కరణలో రైతు సంఘం నాయకులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూనే మరోవైపు భారాలను మోపుతూ ఆర్థిక దాడికి పాల్పడుతున్నదని రైతు సంఘం నేతలు విమర్శించారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పగించేలా కొత్త విత్తన చట్టం ఉందని ఎత్తిచూపారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య ఉద్యమం చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 18 వరకు జిల్లా స్థాయి జాతాలు, 19న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు సేద్యం డైరీ-2026ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి టి.సాగర్, జాతీయ కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీనియర్ నేతలు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ సర్కారు ప్రజల హక్కులను కాలారాయడమే కాక రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తూ చట్టాలను చేసుకుంటూ పోతున్నదని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. మోడీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ. 18 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిన విషయాన్ని ఎత్తిచూపారు. లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికులు, ట్రేడ్ యూనియన్లు పెట్టుకోవడానికి ఆంక్షలు పెట్టడం, వృత్తి రక్షణ, ఆరోగ్యం, పని పద్ధతులు, కార్మికుల హక్కులు లేకుండా చేయడం దారుణమన్నారు. వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో భాగంగా రాష్ట్రాలపై 40 శాతం భారాన్ని మోడీ సర్కారు మోపుతున్నదని విమర్శించారు. రాష్ట్రాల జాబితాలోని విద్యుత్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం సంప్రదించకుండా 2025 విద్యుత్ సవరణ చట్టం ఆమోదించుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆ చట్టంతో క్రాస్ సబ్సిడీ, పేదలకు ఉచిత విద్యుత్, ఆస్పత్రులు, కళాశాలకు సబ్సిడీ విద్యుత్ వంటివి ఎగిరిపోతాయని నొక్కి చెప్పారు.
ఇక నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ బాధ్యతలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయనీ, కేంద్రమే విద్యుత్ రెగ్యులరేటరీ కమిషన్ల ద్వారా కరెంటు చార్జీలను నిర్ణయిస్తుందని వివరించారు. స్మార్టు మీటర్లు పెట్టి టారిఫ్ ముందుగానే వసూలు చేయిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోకి 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు. విదేశీ బహుళ జాతి కంపెనీలకు ఇన్సూరెన్స్ రంగాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని వేగతరం చేసిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, అరిబండి ప్రసాద్‌రావు, పి.జంగారెడ్డి, మాదినేని రమేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, శెట్టి వెంకన్న సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, మాటూరి బాలరాజ్ గౌడ్, వర్ణ వెంకటరెడ్డి, ఎం శ్రీనివాస్, వెంకటేష్, శ్రీరాములు రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు నాగార్జున రెడ్డి, కాడిగల్ల భాస్కర్, అలివేలు, కొప్పుల రజిత, కొక్కెర పాటి పుల్లయ్య, కందాల శంకర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, వెంకట్ మావో, చుక్కయ్య, అశోక్ రెడ్డి, మహిపాల్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.



