Sunday, December 21, 2025
E-PAPER
Homeజాతీయం'ఉపాధి హామీ'ని కేంద్రం బలహీనపరుస్తోంది

‘ఉపాధి హామీ’ని కేంద్రం బలహీనపరుస్తోంది

- Advertisement -

చట్టంలో ఏకపక్షంగా మార్పులు
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పేరు మార్పు సరికాదు
మోడీ సర్కారుపై సోనియాగాంధీ తీవ్ర విమర్శలు


న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును మార్చడంపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం దశాబ్దకాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించింది. ఇటీవల ఈ చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేయడంతోపాటు దేశంలో కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని వారి ప్రయోజనాలపై మోడీ సర్కారు దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 20 ఏండ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంటు ఏకాభిప్రాయంతో ఆమోదించిన విషయాన్ని సోనియాగాంధీ గుర్తు చేశారు. దానిని విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు.

అత్యంత పేదలు, అణగారినవారి జీవితాలకు ఆ పథకం ఉపాధి మార్గంగా నిలిచిందని చెప్పారు. వలసలు ఆగిపోవడమే కాకుండా.. ఉపాధికి హామీ దక్కిందన్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తీసుకొచ్చిన ఆ పథకాన్ని మోడీ ప్రభుత్వం అణచివేసిందని ఆరోపించారు. గత 11 ఏండ్లుగా గ్రామీణ పేదల ప్రయోజనాలను విస్మరించిన మోడీ సర్కారు.. మహాత్ముడి పేరును తొలగించటమేగాక.. చట్టం స్వరూపాన్నే మార్చిందని సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్చా లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాన్ని మార్చివేయడం దారుణమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు లక్షలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆమె తెలిపారు. చట్టంలో మార్పులను ఇప్పటికే పలు విపక్షాలు వ్యతిరేకించిన విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -