Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంకేంద్రం చర్య దుర్మార్గం

కేంద్రం చర్య దుర్మార్గం

- Advertisement -

హెచ్‌ఈసీఐ బిల్లు వెనక్కి తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర క్యాబినెట్‌ వికసిత్‌ భారత్‌ శిక్షా అధిక్షక్‌ బిల్లు 2025కు ఆమోదం తెలపడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా వ్యతిరే కించింది. ఈ మేరకు శనివారం ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్‌ ఎం. సాజి, సృజన్‌ భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ) బిల్లును వికసిత్‌ భారత్‌ శిక్షాఅధిక్షక్‌ అనే ముసుగులో ఆమోదించా లన్న కేంద్ర మంత్రివర్గ చర్యను ఎస్‌ఎఫ్‌ఐ వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. ఈ బిల్లు యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థల స్థానంలో హెచ్‌ఈసీఐ వంటి ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకు రావడంతో దేశ ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.

ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పెట్టుబడి దారీ ప్రయోజనాలకు, ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ప్రయోజనా లకు అనుగుణంగా దేశ విద్యారంగాన్ని కేంద్రీకరించడానికి, వాణిజ్యీకరించడానికి, మతతత్వీక రించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు ఎజెండాను అమలు చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని వివరించారు. ఈ బిల్లుతో దేశంలోని ఉన్నత విద్యా సంస్థల నిధులు, పనితీరులో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, ఇది సాధారణ విద్యార్థులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. యూజీసీని రద్దు చేయడంతో ఉన్నత విద్యా సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వారు వివరించారు. విద్యను కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన వస్తువుగా మారుస్తుందని విమర్శించారు.

ప్రజలు, మేధావులు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ప్రతిఘటనను పట్టించుకోకుండా ఈ బిల్లును ఆమోదించడం, కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు అనుసరిస్తున్న నియంతృత్వ స్వభావాన్ని సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌ఈసీఐ ”తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన” అనే సూత్రాన్ని పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ, 12 మంది సభ్యులలో 9 మందిని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుందని గుర్తు చేశారు. హెచ్‌ఈసీఐ బిల్లు మరో రాజ్యాంగ వ్యతిరేక చర్య అనీ, ఇది దేశ విద్యా రంగం నిలబెట్టిన సమాఖ్య సూత్రానికి, సమ్మిళిత దృక్పథానికి ప్రత్యక్ష ముప్పును కలిగిస్తుందని విమర్శించారు. ఈ ఏకపక్ష చర్యను ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండిస్తోందనీ, కేంద్రం ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఈసీఐ బిల్లు 2025ను వ్యతిరేకించాలని, ఈ చర్యను ప్రతిఘటించడానికి విద్యార్థి లోకం ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -