రాజ్యసభలో ప్రభుత్వ అంచనా వెల్లడి
న్యూఢిల్లీ : 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్రప్రభుత్వ మొత్తం అప్పు రూ.200.16 లక్షల కోట్లకు పెరుగుతుంది. రాజ్యసభలో సిపిఎం ఎంపి వి శివదాసన్ అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం పేర్కొంది. 2020-21లో మొత్తం కేంద్రం అప్పు రూ.121.86 లక్షల కోట్లు, ఇందులో రూ.115.71 లక్షల కోట్లు దేశీయ అప్పు, రూ.6.15 లక్షల కోట్లు విదేశీ అప్పు ఉంది. 2024-25లో కేంద్ర అప్పు రూ.177.20 లక్షల కోట్లు, దేశీయ అప్పు, రూ.8.74 లక్షల కోట్లు విదేశీ అప్పులు ఉన్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం, కేంద్రం అప్పు రూ.200.16 లక్షల కోట్లకు మరింత పెరుగు తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ సమాధానం లో తెలిపింది. జూన్ 30, 2025 వరకు మాత్రమే కేంద్రం రూ.3.72 లక్షల కోట్ల కొత్త దేశీయ రుణాన్ని, రూ.0.23 లక్షల కోట్ల విదేశీ రుణాన్ని తీసుకుంది. ఇటీవల సంవత్సరాల్లో వడ్డీ చెల్లింపులు కూడా పెరిగాయి. 2020-21లో రూ.6.80 లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులు 2024-25లో రూ.11.16 లక్షల కోట్లకు పెరిగాయి. విడుదల చేసిన గణాంకాలు కేంద్ర ప్రభుత్వం ఆదాయ సేకరణను బలోపేతం చేయడానికి బదులుగా రుణాలపై ఎక్కువగా ఆధారప డుతున్నట్లు చూపిస్తున్నాయి.
కేరళలో ప్రసూతి మరణాల రేటు అత్యల్పం
కేరళలో ప్రసూతి మరణాల రేటు అత్యల్పంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ ప్రచారానికి సంబంధించి సిపిఎం ఎంపి ఎఎ రహీమ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియ పాటిల్ ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. 2021 నుంచి 2023 వరకు కేరళలో ప్రసూతి మరణాల రేటు కేవలం 30 అని అన్నారు. అదే సమయంలో ప్రసూతి మరణాల రేటు బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ 141, మధ్యప్రదేశ్ 142, బీహార్ 104, ఒడిశా 153, హర్యానా 81గా ఉంది. కేరళ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో చేస్తున్న అభివృద్ధి పనుల ఫలితమే ఈ విజయమని ఎఎ రహీమ్ అన్నారు. తల్లులు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో కేరళ.. ఇతర రాష్ట్రాలకు ఒక నమూనా అని ఆయన అన్నారు.
విద్యా కమిషన్ బిల్లుకు జెపిసి ఏర్పాటు
లోక్‌సభ ఉన్నత విద్యా కమిషన్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. బిల్లును జెపిసికి సూచించాలన్న కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సిఫార్సును మూజువాణి ఓటుతో ఆమోదించారు. లోక్‌సభ నుండి 21 మంది ఎంపిలు, రాజ్యసభ నుండి 10 మంది ఎంపిలతో కూడిన ఈ కమిటీ బిల్లును పరిశీలిస్తుంది. బడ్జెట్ సమావేశాల మొదటి అర్ధభాగం చివరి రోజున కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది. ఉన్నత విద్యా సంస్థలను రాష్ట్రపతి నియమించిన ఉన్నత విద్యా కమిషన్ నియంత్రణలోకి తీసుకొచ్చే ఈ బిల్లు, కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంపై తన పట్టును కఠినతరం చేయడానికి దారితీస్తుందని విమర్శలున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.200.16 లక్షల కోట్లు!
- Advertisement -
- Advertisement -



