Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసికింద్రాబాద్‌ పేరును రూపుమాపేందుకు సీఎం కుట్ర

సికింద్రాబాద్‌ పేరును రూపుమాపేందుకు సీఎం కుట్ర

- Advertisement -

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

నవతెలంగాణ-బేగంపేట్‌
ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ పేరును రూపుమాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శుక్రవారం వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్‌, ముఠా గోపాల్‌తో పాటు కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ గజ్జెల నగేష్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసుల్లో కూర్చొని గూగుల్‌ మ్యాప్‌ల ఆధారంగా డివిజన్ల విభజన చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ పేర్లతో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆలోచన సికింద్రాబాద్‌ అస్తిత్వానికి ముప్పుగా మారుతోందన్నారు. సికింద్రాబాద్‌ పేరుతో ప్రత్యేక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసే వరకు దశలవారీగా ఆందోళనలు చేస్తామని చెప్పారు. ఈనెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు బాలంరాయ్ లోని లీ ప్యాలెస్‌లో విస్తృత సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి క్లాక్‌టవర్‌, ప్యాట్నీ, ప్యారడైజ్‌ మీదుగా ఎంజీ రోడ్డులో మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

అనంతరం సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామని, అవసరమైతే బంద్‌లు, ధర్నాలు, చివరికి సచివాలయ ముట్టడికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే హైదరాబాద్‌ పేరు మార్చాలని సవాల్‌ విసిరారు. 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్‌ పేరుతో కాకుండా వేరొక పేరుతో కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో కార్పొరేటర్‌లు కోలన్‌ లక్ష్మి, టి.మహేశ్వరి, కూర్మ హేమలత, సామాల హేమ, ప్రసన్న లక్ష్మి, కంది శైలజ, రాసూరి సునీత, మాజీ కార్పొరేటర్‌ నామన శేషుకుమారి, లష్కర్‌ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్‌ కుమార్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి శాదం బాలరాజ్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ అధ్యక్షలు కోలన్‌ బాల్‌రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -