మేము తిరగబడితే తట్టుకోలేరు
ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా బీఆర్‌ఎస్ : మాజీమంత్రి కేటీఆర్ హామీ
నవతెలంగాణ-నూతనకల్
సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్‌నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ‘మేము తిరగబడితే రాష్ట్రం ఆగమైతది.. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు.మేము కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?” అని హెచ్చరించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మాని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులు కొనసాగితే తాము కూడా తిరగబడక తప్పదన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం, నూతనకల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పలమల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు.
మల్లయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళలర్పిం చారు. బాధితకుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని కేటీఆర్ అందజేశారు. మల్లయ్యపై హత్య జరిగిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూ డదనే ఉద్దేశంతోనే కొద్దిరోజులు ఆగానని తెలిపారు. బాధిత కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కేవలం సర్పంచ్, పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేండ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇండ్లు, రేషన్‌కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే అయితే, ఎన్ని కలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ శ్రేణులకు అభినందనలు
ఈ మండలంలో కాంగ్రెస్‌కు దీటుగా, సమానంగా బీఆర్‌ఎస్ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజలంతా కేసీఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్య మంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద భిక్షమయ్య, నేతలు భూపాల్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నరసింహారెడ్డి, గుజ్జ యుగంధర్ రావు, దయాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండలఅధ్యక్షులు మొన్న మల్లయ్యయాదవ్, ప్రధానకార్యదర్శి భక్తుల సాయిలుగౌడ్ ,నాయకులు గాజుల తిరుమలరావు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే కాంగ్రెస్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



