పంచాయతీల్లో అత్యధిక స్థానాలు కైవసం
ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు…
22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం
ప్రశాంతంగా మూడోవిడత పోలింగ్
హస్తందే హవాొ ముగిసిన గ్రామీణ పోరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరిగిన పోలింగ్‌లో అన్నింటా హస్తం హవా కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం12,728 సర్పంచ్ స్థానాలను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 22 స్థానాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండు స్థానాలపై కోర్టు స్టే విధించింది.1,207 స్థానాలు ఏకగ్రీవం కాగా 11,497 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడు విడతల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ సర్పంచ్ స్థానాలను దక్కించుకుంది. తుది వార్తలు అందే సమయానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 6,822 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 3,518 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 703 చోట్ల, ఇతరులు 1,654 స్థానాల్లో విజయం సాధించారు.
నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్ సహా 28 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటింది. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు పెద్దఎత్తున గెలుపొందారు. సిద్దిపేట, కుమరంభీం ఆసిఫాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆ పార్టీ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. రెండో విడతలో నిర్మల్ జిల్లాలో అనూహ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను వెనక్కి నెట్టి బీజేపీ మద్దతుదా రులు మెజార్టీ స్థానాలను దక్కించుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాలను దక్కించుకోగా, బీఆర్‌ఎస్ రెండవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 53, బీఆర్‌ఎస్ 27.5, బీజేపీ 5.5, ఇతరులు 14 శాతం స్థానాలను దక్కించుకున్నారు. సర్పంచ్ స్థానాల్లో గణనీయ మైన స్థానాలు దక్కించుకున్న నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. సర్కార్ మౌఖిక ఆదేశాల మేరకు అధికారులు తగిన కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
మూడో విడతలో…
హస్తం 2,246 స్థానాలు
బీఆర్‌ఎస్ 1,162, బీజేపీ 246, ఇతరులు 491 చోట్ల విజయం
26 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
అదిలాబాద్‌తో పాటు 4 జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యం
తుది విడత పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. మొదటి, రెండో విడతల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఊపు మీదున్న ఆపార్టీ.. చివరి విడతలోనూ సత్తా చాటింది. బుధవారం జరిగిన పోలింగ్‌లో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,652 మంది, 28,410 వార్డు స్థానాలకు 75,618 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తుది వార్తలు అందే సమయానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 1,948 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్‌ఎస్ మద్దతుదారులు 1,017 స్థానాల్లో గెలిచారు. బీజేపీ 197 చోట్ల, ఇతరులు 417 స్థానాల్లో విజయం సాధించారు. నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మహబూబాబాద్ మొదలగు 25 జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటింది. కుమరంభీం ఆసీఫాబాద్, మెదక్, గద్వాల జిల్లాల్లో బీఆర్‌ఎస్ మెజార్టీ స్థానాలకు గెలుచుకుంది. మహబూబ్‌నగర్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఆ పార్టీ మద్దతు దారులు గట్టి పోటీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలో రెండో విడతలో అత్యధిక స్థానాలు దక్కించుకున్న బీజేపీ, మూడో విడతలోనూ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది.
మూడో విడతలో 85.76 పోలింగ్
చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడతలో 182 మండలాల్లోని 3,752 పంచాయతీలు, 75,725 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56 శాతం, ఆ తర్వాత మెదక్ జిల్లాలో 90.68, సూర్యపేటలో 89.25 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో 76.45 శాతం, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79.14, జగిత్యాలలో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని పోలింగ్ ముగిసే సమయానికి 85.77 శాతానికి చేరుకుంది. మూడో విడతలో ఏకగ్రీవం, నామినేషన్ దాఖలు కాని గ్రామాలను మినహయిస్తే మొత్తం 50,56,344 మంది ఓటర్లకు గాను 43,37,024 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ఇందులో 21,21,269 మంది పురుషులు (86.59 శాతం), 22,15,683 మంది మహిళలు (85.96 శాతం), 72 మంది ఇతరలు (50.70 శాతం) ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎన్నికలసంఘం తెలిపింది.
14.7 శాతం మంది ఓటింగ్‌కు దూరం సమయాభావం, ఇతర పనుల వల్ల రాని వైనం
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 14.7 శాతం మంది ఓటేయలేదు. రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది ఉన్నారు. అందులో 81, 42,231 మంది పురుషులు, 85, 12,455 మంది మహిళలు, 500 మంది ఇతరులు ఉన్నారు. మొదటి విడతలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. (45,151,41 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు). రెండో విడతలో 85.86 శాతంగా నమోదైంది. (46,70,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు). మూడో విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదైంది. (43,37,024 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు). మొత్తం మూడు విడతల్లో కలిపి 85.3 శాతం ఓటింగ్ నమోదైంది.
22న కొత్త సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కొత్తగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ప్రమాణం ఇలా…
‘గ్రామ పంచాయతీ సర్పంచినైన/సభ్యుడినైన. (విజేత పేరు) అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటాననీ, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర/సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను.’ అని ప్రతిజ్ఞ చేస్తారు. సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు చేపడతారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సై
కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం
సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకుని జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తగిన కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల డ్రాఫ్ట్ లిస్ట్‌ను ప్రభుత్వానికి, సీఎంకు అధికారులు అందించారు. రెండు విడతలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఈ నెల 20న రిజర్వేషన్లు, 25న షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. న్యాయవివాదాలు రాకుండా పంచాయతీ ఎన్నికల తరహాలోనే 50 శాతంలోపు రిజర్వేషన్లను ప్రతిపాదించారు.
నోటిఫై చేసిన సర్పంచ్ స్థానాలు 12,726
నామినేషన్ దాఖలు కాని స్థానాలు 22
ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు 1,207
ఎన్నికలు జరిగినవి 11,497
హస్తం బలపర్చిన అభ్యర్థులు 6,822 మంది గెలుపు
బీర్‌ఎస్ మద్దతుల దారులు.3,518 మంది విజయం
బీజేపీ 703 ఇతరులు 1654 పాగా
ఓవరాల్‌గా 85.3 శాతం పోలింగ్
14.7 శాతం మంది ఓటేయలేదు
22న సర్పంచ్‌ల ప్రమాణ స్వీకారం
(రాత్రి 12.50 గంటల వరకు)




