– నాటి క్యాబినెట్, గవర్నర్ ఆమోదం
– అసెంబ్లీలోనూ అప్రూవల్ : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలనేది నాటి క్యాబినెట్ తీసుకున్న సమిష్టి నిర్ణయమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన ”కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు” అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాటి క్యాబినెట్‌లో ఉన్న వారిలో ఇద్దరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రులుగా ఉన్నారని చెప్పారు. క్యాబినెట్ నోట్ 20 నుంచి 30 పేజీలు ఉంటుందని దాన్ని కాంగ్రెస్ సర్కార్ బయటపెట్టడం లేదన్నారు. గవర్నర్, ఆర్థిక మంత్రి ప్రసంగాల్లోనూ కాళేశ్వరం అంశం ఉందనీ, వాటిని క్యాబినెట్ ఆమోదించిందనీ గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. ప్రాణహితకు జాతీయ హౌదా ఇవ్వాలని కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని చెప్పారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఉందా?
కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఉందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పను లు ప్రారంభించారనీ, బిల్లులు చెల్లించారని తెలిపారు. ఒక్క అనుమతి ఉన్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపించాలని సవాల్ విసిరారు. అనుమతి లేకుండా బిల్లులు ఎలా చెల్లించారో చెప్పాలని నిలదీశారు. పోలవరం మూడుసార్లు కూలినా దాన్ని నిర్మించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్‌డీఎస్‌ఏ సీడబ్ల్యూసీలో అంతర్భాగమనీ, దానికి దేశమంతా ఒకే నీతి ఉంటుందా? లేక రాష్ట్రానికో నీతి ఉంటుందా?అని అడిగారు. కాళేశ్వరం విషయంలో ఎన్నికలకు ముందు మూడు రోజుల్లోనే నివేదిక ఇచ్చి, మూడు సార్లు కూలిన పోలవరంపై ఎన్‌డీఎస్‌ఏ ఎందుకు వెళ్లడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యతనా?అని హరీశ్‌రావు అడిగారు. ఎన్‌డీఎస్‌ఏ చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్ నిర్మించిన పోలవరం కూలిందని చెప్పారు. ఆయనే కాళేశ్వరంపై నివేదిక ఇచ్చారని అన్నారు. చంద్రశేఖర్ అయ్యర్‌పై చర్యలెందుకు లేవు? ఎస్‌ఎల్‌బీసీ కూలి మరణించిన వారి మృతదేహాలు బయటకు తీయలేదనీ, ఈ ఘటనలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై చర్యలెందుకు తీసుకోలేదు? అని హరీశ్‌రావు ప్రశ్నలు వేశారు.
అధికారంలోకి రాగానే రెండు పిల్లర్లకు మరమ్మతులు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయిస్తామని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరంతో రెండు పంటలు పండినట్టు చెప్పారు. కాళేశ్వరం పూర్తి స్థాయిలో బాగుందని అన్నారు. సుందిళ్ల, అన్నారం సేఫ్ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలోనే చెప్పినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామే రిపేర్ చేసి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని నిరూపిస్తామన్నారు.
కాళేశ్వరం నిర్మాణం సమిష్టి నిర్ణయమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES