Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌

- Advertisement -

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారుల గెలుపే నిదర్శనం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహౌరీగా పోరాడి సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన బీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్‌ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌రెడ్డి పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్‌ఎస్‌ మాత్రమేననీ, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టాయని వివరించారు. వచ్చే మూడేండ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి జరగదనీ, గ్రామస్తులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయని తెలిపారు.

సగం స్థానాలు కూడా కాంగ్రెస్‌ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ పల్లెల నుంచే ప్రారంభమైనట్టుగా స్పష్టంగా అర్థమైపోతోందని పేర్కొన్నారు. రెండేండ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయని వివరించారు. ఇది ఆరంభం మాత్రమే పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్‌ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -